ఉద్యోగం మానేయాలనుకుంటే భారత్‌లో రాజీనామా పత్రం ఇచ్చి నోటీస్ పీరియడ్ పూర్తిచేస్తే సరిపోతుంది. కానీ జపాన్ దేశంలో మాత్రం రాజీనామా ఇచ్చినా కంపెనీలు దాన్ని ఆమోదించడం లేదట. దాంతో చాలామంది ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. అలాంటి వారికోసం జపాన్‌లో కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. రాజీనామా తంతును పూర్తిచేసి ఉద్యోగులకు బాసటగా నిలుస్తున్నాయి. ఆ కంపెనీలను ఆశ్రయిస్తున్న క్లయింట్ల సంఖ్య ఏటా పెరుగుతోంది.
జపాన్‌లో సరిపడా కార్మికశక్తి లేక కంపెనీలు ఉన్న ఉద్యోగులు రాజీనామాలు ఆమోదించడం లేదు. దాంతో తమ కొలువులు వదిలివేయడం ఉద్యోగులకు సవాలుగా మారుతోంది. ఎగ్జిట్, ఆల్బాట్రాస్ వంటి కంపెనీలు కార్మికులు రాజీనామా చేయడంలో సహాయపడుతున్నాయి. ఇందుకోసం 20,000 యెన్‌లు(దాదాపు రూ.11,600) వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. ఈ కంపెనీలు తమ క్లయింట్ యజమానికి కాల్ చేసి రాజీనామాను సమర్పించి దాన్ని ఆమోదించే వరకు అవసరమయ్యే తంతును పర్యవేక్షిస్తున్నాయి. కంపెనీ అందిస్తున్న చాలా వెసులుబాట్లు అనుభవిస్తున్న వారు ఉద్యోగానికి రాజీనామా సమర్పించిన వెంటనే కొన్ని సంస్థలు వృత్తిపరంగా వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇలాంటి ఇబ్బందులను సైతం న్యాయబద్ధంగా పరిష్కరిస్తూ ఉద్యోగులకు బాసటగా నిలుస్తున్నాయి. 2017లో ప్రారంభమైన ఎగ్జిట్ కంపెనీ ఏటా సుమారు 10,000 మంది క్లయింట్లకు సాయం చేస్తున్నట్లు తెలిపింది.
యువత ఎక్కువగా ఉన్న భారత్‌లో శ్రామికశక్తికి ప్రస్తుతం ఢోకాలేదు. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతాల సరసన చేరిన జపాన్ వంటి దేశాల్లో యువతలేక అల్లాడిపోతున్నారు. కంపెనీల్లో పనిచేసే సరైన శ్రామికశక్తి లేక ఇబ్బందులు పడుతున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం పిల్లల్ని కనడానికి ప్రభుత్వం అక్కడి దంపతులకు ప్రత్యేక వెసులుబాటు అందిస్తోంది. నిరుద్యోగం, అధిక జీవన వ్యయం, మహిళల పట్ల వివక్ష తదితర సమస్యలతో అక్కడి జనాభా తగ్గిపోతోంది. వివాహం చేసుకుని సంతానాన్ని కనే వారికి జపాన్ ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నా యువత నిర్ణయంలో పెద్ద మార్పు ఉండడంలేదని తెలుస్తోంది. జపాన్ 2070 నాటికి 30 శాతం మేర జనాభాను కోల్పోయే ప్రమాదం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఫలితంగా కార్మికశక్తి లేక సంక్షోభంలోకి చేరే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: కొండలు, లోయ ప్రాంతాల్లో సులువుగా నడిపేలా కొత్త టెక్నాలజీ
Comments
Please login to add a commentAdd a comment