జపాన్‌లో కొత్త పోకడ
మన దగ్గర ఉద్యోగం కలి్పంచడం కోసం బోలెడన్ని కన్సల్టెన్సీలు ఉంటాయి. కానీ ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ అందుకు భిన్నం! అక్కడ రాజీనామా చేయాలనుకునే ఉద్యోగుల కోసం కన్సల్టెన్సీలుంటాయి!! అవి ఇటీవల దేశవ్యాప్తంగా పుట్ట గొడుగుల్లా పెరుగుతున్నాయి. రాజీనామాకు కన్సల్టెన్సీలు ఎందుకా అనుకుంటున్నారా? జపాన్ పని సంస్కృతి, అందులోని సంక్లిష్టతలే అందుకు కారణం...
రాజీనామా చేయాలంటే ఏం చేస్తాం? గడువు ప్రకారం రాజీనామా లేఖ ఇస్తాం. అంతటితో సరిపోతుంది. కానీ జపాన్‌లో రాజీనామా అంత ఈజీ కాదు. అక్కడి పని సంస్కృతే ఇందుకు కారణం. అక్కడ కెరీర్ మొత్తం ఒకే సంస్థలో కొనసాగించే వాళ్ల సంఖ్యే ఎక్కువట. చేస్తున్న పని ఇష్టం లేకపోయినా, బాస్ తీరు నచ్చకపోయినా వేధింపులకు భయపడో, మరో కారణంతోనో కష్టంగా అదే ఉద్యోగంలో కొనసాగుతున్న వాళ్లు చాలామంది. సరిగ్గా ఇలాంటి వాళ్లకు సాయం చేసేందుకే పుట్టుకొచ్చాయి
‘రాజీనామా కన్సల్టెన్సీలు’. ఇవి కొవిడ్‌కు ముందే ఉన్నా, ఆ మహమ్మారి తదనంతర కాలంలో ఆదరణ బాగా పెరిగింది. ఒక్క ఏడాదిలోనే ఏకంగా 11,000 పై చిలుకు క్లయింట్ల తమ సేవల గురించి ఎంక్వైరీ చేసినట్టు ‘మోమూరి ఆపరేషన్స్’ అనే రాజీనామాల కన్సల్టెన్సీ సంస్థ చెబుతోంది. ‘మోమూరి’ అంటే జపనీస్‌లో ‘నేనీ పని ఇంకే మాత్రమూ చేయలేను (ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్)’ అని అర్థం! ఇది 2022లో పుట్టుకొచి్చంది. కర్ర విరక్రుండా, పాము చావకుండా ఎలా రాజీనామా చేసి బయట పడాలో ఇవి సలహాలిస్తాయన్నమాట. ఈ వ్యవహారంలో చట్టపరమైన వివాదాల్లాంటివి తలెత్తితే కూడా అవే చూసుకుంటాయి.
అధిక పని సంస్కృతి...
జపాన్‌లో చాలాకాలంగా అధిక పని సంస్కృతి ఉంది. రంగమేదైనా ఉద్యోగులకు పనివేళలు మరీ ఎక్కువ. ఏకధాటిగా 12 గంటలు పని చేయడం చాలా మామూలు విషయం. ఇల్లు చేసేసరికి ఏ అర్ధరాత్రో అవుతుంది. మళ్లీ ఉదయాన్నే హడావుడిగా బయల్దేరాలి. ఇలా వెనక్కు తిరిగి చూసుకుంటే పనిలో కరగదీసిన జీవితమే తప్పితే సరదాగా గడిపిన క్షణాలంటూ పెద్దగా కన్పించడం లేదని వాపోయేవాళ్ల సంఖ్యే అధికం. వీటికి తోడు సూపర్‌వైజర్లు, మేనేజర్ల నుంచి ఒత్తిళ్లు. తట్టుకోలేక రాజీనామాకు ప్రయతి్నస్తే యజమానులు వేధిస్తారట. ఇలాంటి సంస్థలను ‘నల్లజాతి సంస్థలు’గా పిలుస్తుంటారు.
చిన్న, మధ్య తరహా వ్యాపారాల్లోనే గాక పెద్ద సంస్థల్లోనూ ఈ సంస్కృతి ఉందట. బాధితుల్లో ప్రధానంగా ఆహార పరిశ్రమ కార్మికులు, ఆ తర్వాత ఆరోగ్య సంరక్షణ, సంక్షేమ రంగాల వారున్నారు. పరిస్థితి ఎంతదాకా వెళ్లిందంటే, తీవ్రమైన పని ఒత్తిడి పెట్టే సంస్థల జాబితాను ప్రభుత్వమే నిషేధిత జాబితాలో పెట్టడం ప్రారంభించింది! అలా జపాన్‌వ్యాప్తంగా ఇప్పటికే 370కి పైగా కంపెనీలు లేబర్ బ్యూరో బ్లాక్ లిస్ట్‌లో చేరాయి.
అధిక పని ఒత్తిడి వల్ల మెదడు, గుండె సంబంధిత జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య జపాన్‌లో పెరుగుతోందట. 31 ఏళ్ల జర్నలిస్టు ఒకామె కేవలం పని ఒత్తిడి వల్లే హార్ట్ ఫెయిల్యూర్‌తో మరణించింది. చనిపోవడానికి ముందు ఒకే నెలలో ఆమె ఏకంగా 159 గంటలు ఓవర్ టైమ్ పని చేసిందట! అలాగే ఓ 26 ఏళ్ల వైద్యుడు కూడా ఒకే నెలలో 200 గంటలకు పైగా ఓవర్ టైమ్ పనిచేసి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు!
మారుతున్న యూత్..
ఈ పని జపాన్‌లో ఎప్పటినుంచో సంస్కృతి ఉన్నా రాజీనామా కన్సల్టెన్సీలు ఇటీవలి కాలంలోనే ఎందుకు పుట్టుకొచ్చాయి? అంటే యువత ఆలోచనల్లో వచి్చన మార్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. జపాన్‌లో ఉద్యోగుల్లో వృద్ధుల సంఖ్య తగ్గుతోంది. ఎక్కడ చూసినా యువ ఉద్యోగులే. ఉద్యోగం స్వభావంతో సంబంధం లేకుండా యజమాని ఏది చెబితే అది చేయాలనే పాత తరం ఆలోచనతో వాళ్లు ఏకీభవించడం లేదు. అందుకే అవసరమైతే రాజీనామాకూ వెనకాడటం లేదు. అలాగని యాజమాన్యంతో ఘర్షణ పడి ఉద్యోగ భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకోవడానికి ఇష్టపడటం లేదు. అందుకే నేర్పుగా పని కానిచ్చుకోవడానికి కన్సల్టెన్సీల బాట పడుతున్నారు.
‘‘రాజీనామా ఏజెన్సీలు జపాన్ సమాజం నుంచి పూర్తిగా కనుమరుగవ్వాలని మేం నిజాయితీగా కోరుకుంటున్నాం. ఉద్యోగులు తమ రాజీనామా గురించి నేరుగా బాస్‌తో మాట్లాడుకునే వాతావరణం వస్తే మేలు. కానీ మా క్లయింట్ల భయానక గాథలు వింటుంటే అది ఇప్పట్లో జరుగుతుందని అనిపించడం లేదు’’
– మోమూరీ కన్సల్టెనీ
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment