చెన్నై: తమిళనాడులో సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని కోయంబత్తూరుకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫోలీస్ (డీఐజీ) విజయ్ కుమార్ ప్రాణాలు విడిచారు. కోయంబత్తూరులోని డీఐజీ అధికారిక నివాసంలో శుక్రవారం ఈ సంఘటన వెలుగు చూసింది. తీవ్ర మానసిక ఒత్తిడితోనే విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే ఆయన మృతికి గల కారణలపై స్పష్టత రావాల్సి ఉంది.
కాగా 45 ఏళ్ల విజయ్ కుమార్ రేస్ కోర్స్ సమీపంలోని రెడ్ ఫీల్డ్స్‌లోని క్వార్టర్స్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. శుక్రవారం ఉదయం 6.15 గంటల ప్రాంతంలో డీఐజీ విజయకుమార్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గన్ పేలిన శబ్దం విన్న ఆయన ఇంటి భద్రతా సిబ్బంది.. వెంటనే సీనియర్ అధికారులను అప్రమత్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
అయితే విజయకుమార్ తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నారని, నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన కౌన్సిలింగ్ కూడా తీసుకుంటున్నారని, అతన్ని కుటుంబాన్ని కొన్ని రోజుల క్రితమే చెన్నై నుంచి కోయంబత్తూరుకు తీసుకొచ్చినట్లు పేర్కొన్నాయి.
చదవండి: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు
కాగా విజయ్ కుమార్ 2009 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన పోలీస్ అధికారి. ఈ ఏడాది జనవరిలో కోయంబత్తూరు రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకముందు ముందు కాంచీపురం, కడలూరు, నాగపట్నం, తిరువారూర్‌లకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా(ఎస్పీ) అన్నానగర్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు.
డీఐజీ ఆత్మహత్యపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. హోంమంత్రిత్వ శాఖ అధిపతి అయిన సీఎం.. ట్విటర్‌లో స్పందిస్తూ ‘ పోలీస్ అధికారి విజయకుమార్ అకాల మరణ వార్త విని దిగ్భ్రాంతి గురయ్యాను. ఆయన ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగించింది. జిల్లా ఎస్పీతోపాటు హా వివిధ హోదాల్లో పనిచేసిన విజయ్ కుమార్ మరణం తమిళనాడు పోలీస్ శాఖకు తీరని నష్టం. అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’అని పేర్కొన్నారు.
ఉన్నది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment