12న విడివిడిగా చర్చలకు కేంద్ర హోం శాఖ పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)తో ఈ నెల 12వ తేదీన ఢిల్లీలో చర్చలకు రావాలంటూ కేంద్ర హోంశాఖ రాష్ట్రంలోని ఐదు పార్టీలను ఆహ్వానించింది. ఇంతకుముందు చెప్పినట్లుగా ఎనిమిది పార్టీలతో అఖిలపక్ష సమావేశం కాకుండా.. జీఓఎంకు అభిప్రాయాలు తెలియజేసిన పార్టీలు - కాంగ్రెస్, టీఆర్‌ఎస్, సీపీఐ, బీజేపీ, ఎంఐఎంలను మాత్రమే చర్చలకు పిలిచింది. విభజనను వ్యతిరేకిస్తూ జీవోఎంను బహిష్కరించిన వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎంలను చర్చలకు పిలవకూడదని నిర్ణయించింది. విభజనకు అనుకూలమో, వ్యతిరేకమో చెప్పకుండా గోడ మీది పిల్లి వాటం ప్రదర్శిస్తున్న తెలుగుదేశం పార్టీని కూడా చర్చలకు పిలవలేదు. ఆహ్వానించిన ఐదు పార్టీల్లో ఒక్కో పార్టీతో జీఓఎం విడివిడిగా సమావేశమై చర్చిస్తుందని హోంశాఖ పేర్కొంది. ఒక్కో పార్టీకి అరగంట సమ యం కేటాయించారు. దీనికి సంబంధించి హోంశాఖ నుంచి ఆయా పార్టీల నేతలకు బుధవారం ఫోన్లో సమాచారం అందించినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన నిర్ణయంపై ఆయా పార్టీలు ఇప్పటికే అందించిన నివేదికల్లోని సారాంశం, పూర్వాపరాలు, అభిప్రాయాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు.
రాష్ట్ర విభజనకు సంబంధించి జీఓఎం విధివిధానాలపై సూచనలతో ఈ నెల ఐదో తేదీలోగా నివేదికలు సమర్పించాలని రాష్ట్రానికి చెందిన ఎనిమిది రాజకీయ పార్టీలను జీఓఎం కోరిన విషయం తెలిసిందే. ఈ గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. అధికార కాంగ్రెస్ పార్టీ రెండు నివేదికలు - ఒకటి ప్రత్యేక రాష్ట్రం కోరుతూ తెలంగాణ నేతల నుంచి, మరొకటి సమైక్య రాష్ట్రం కొనసాగించాలంటూ సీమాంధ్ర నేతల నుంచి సమర్పించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తూ టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, ఎంఐఎంలు నివేదికలు సమర్పించాయి. విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జీవోఎంకు ఎలాంటి నివేదిక ఇవ్వకపోగా.. రాష్ట్ర విభజనకు జరిగే ఎలాంటి ప్రయత్నమైనా తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, జీవోఎం ఏర్పాటు జరిగిందే రాష్ట్రాన్ని విభజించడానికైనప్పుడు దాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొంటూ ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హోంశాఖ సంయుక్త కార్యదర్శికి లేఖ రాశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనను వ్యతిరేకిస్తున్న సీపీఎం కూడా జీవోఎంకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు జీవోఎంకు నివేదిక ఇవ్వడంపై చివరి నిమిషం వరకు తర్జనభర్జన పడ్డారు. చివరకు నివేదికపై ఎటూ తేల్చకుండా జీవోఎం ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత సీమాంధ్ర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం అర్థరాత్రి ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఇదిలావుంటే.. ఢిల్లీలో ఈ నెల 12వ తేదీన జీఓఎంతో చర్చల విషయమై తమకు ఇంకా సమాచారం అందలేదని సీపీఐ, బీజేపీ తెలిపాయి.
నేడు ప్రధాని, మొయిలీతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ
సీమాంధ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ సీమాంధ్ర కేంద్ర మంత్రులు రూపొందించిన డిమాండ్ల జాబితాను గురువారం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిసి సమర్పించనున్నారు. ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ ఖరారయిందని మంత్రులు వెల్లడించారు.
నేడు జీవోఎం భేటీ..
రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అధ్యక్షతన ఏర్పాటయిన మంత్రుల బృందం గురువారం భేటీ కానుంది. ఆరుగురు సభ్యుల జీఓఎం పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందే తన నివేదికను సమర్పించాలని భావిస్తోంది. అయితే.. సభ్యుడు గులాంనబీఆజాద్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండటం, మరో సభ్యుడు జైరాంరమేష్ ఢిల్లీలో అందుబాటులో లేకపోవటంతో వారిద్దరూ గురువారం నాటి భేటీకి హాజరుకాలేరని అధికార వర్గాలు తెలిపాయి. జీవోఎం విధివిధానాలపై పార్టీల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైన నేపథ్యంలో.. విభజన ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద జీఓఎం మూడో భేటీలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. వివిధ మంత్రిత్వశాఖలు రూపొందించిన నివేదికలను, ప్రజల నుంచి ఈ-మెయిళ్ల రూపంలో అందిన సూచనలను పరిశీలిస్తుంది. ఈ నెల 12వ తేదీన రాజకీయ పార్టీలతో చర్చల అనంతరం మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసే అవకాశం ఉంది. మరో రెండు సమావేశాల్లో జీవోఎం తన తతంగాన్ని ముగించనుంది.
12న పార్టీలతో జీఓఎం భేటీలు ఇలా..
ఉదయం 11.00 గంటలకు: ఎంఐఎం
ఉదయం 11.30 గంటలకు: బీజేపీ
మధ్యాహ్నం 12.00 గంటలకు: సీపీఐ
సాయంత్రం 5.00 గంటలకు: కాంగ్రెస్
సాయంత్రం 5.30 గంటలకు: టీఆర్‌ఎస్
ఐదు పార్టీలకే జీవోఎం ఆహ్వానం
Published Thu, Nov 7 2013 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM
Advertisement
Advertisement