విభజనకు ఎవరేం చేయాలి? | Home ministry reviews on state division | Sakshi
Sakshi News home page

విభజనకు ఎవరేం చేయాలి?

Published Thu, Feb 27 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 4:07 AM

Home ministry reviews on state division

హోం శాఖ సమీక్ష.. పాల్గొన్న సీఎస్
 
 సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన బాధ్యతలపై కేంద్ర హోం శాఖ బుధవారం ఇక్కడ సమీక్ష జరిపింది. శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో 15 కేంద్ర శాఖల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి పాల్గొన్నారు. రాష్ట్ర విభజన బిల్లు చట్ట రూపం దాల్చాక దాని అమలులో ఎవరి బాధ్యతలేమిటన్న అంశాలపై సమీక్షించారు. కొన్నింటిని కేంద్రం, కొన్ని రాష్ట్రం, మరికొన్నింటిని ఉమ్మడిగా చేయాల్సి ఉంటుందని తేల్చారు. హోం, సిబ్బంది వ్యవహారాల శాఖ, విద్యుత్తు, స్టీలు, బొగ్గు, పర్యావరణ, అటవీ, మానవ వనరులు, వైద్య ఆరోగ్యం, విపత్తు నివారణ, ఓడ రేవులు, పౌర విమానయానం, ఆర్థిక, జల వనరుల వంటి కేంద్ర శాఖలు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన బాధ్యతలపై స్పష్టంగా చర్చించారు. దీనిపై సీఎస్ ఒక సమగ్ర సర్క్యులర్ జారీ చేయనున్నారు.

ఒక ప్రభుత్వం ఏర్పాటైనా, రెండు ప్రభుత్వాలొచ్చినా, రాష్ట్రపతి పాలన విధించినా ఎవరేం చేయాలో ఈ సర్క్యులర్ స్పష్టత ఇస్తుంది. భేటీ అనంతరం మహంతి మీడియాతో మాట్లాడారు. విభజన పర్యవేక్షణకు గవర్నర్ అధ్యక్షతన అపెక్స్ కమిటీ పని చేస్తుందని తెలిపారు. ‘‘ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్ కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో ఇద్దరు తెలంగాణకు చెందిన ఐఏఎస్‌లు, ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్‌లు, ఇద్దరు ఇతర రాష్ట్రాల వారు సభ్యులుగా ఉంటారు. 14 ఉప కమిటీలు దీనికి అనుబంధంగా పని చేస్తాయి. విభజన తేదీపై సమీక్షలో ఎలాంటి చర్చా రాలేదు’’ అని చెప్పారు. ఐఏఎస్‌ల పంపిణీ కమిటీ, రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీ కమిటీలపై కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ కార్యదర్శితో సమీక్షకు ముందు సీఎస్ చర్చించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement