‘పదో షెడ్యూల్’పై మీరే చర్యలు తీసుకోండి!
కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఏపీ సీఎస్ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలోని ఉన్నత విద్యా మండలి నగదు పంపిణీతో పాటు పదో షెడ్యూల్ సంస్థల్లోని ఆస్తులు, అప్పులు పంపిణీపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎలాంటి ఒప్పందానికి రాలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. సుప్రీం తీర్పు మేరకు రెండు నెలల్లో ఇరు రాష్ట్రాలు సమావేశమై ఒక ఒప్పందానికి రావాల్సి ఉంది. అయితే గత నెల 18న ఏపీ, తెలంగాణ అధికారులు సమావేశమైనప్పటికీ ఒప్పందం కుదరలేదని, ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ వెంటనే జోక్యం చేసుకుని పంపిణీపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ సోమవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు.
ఇలా ఉండగా సుప్రీం తీర్పు ఉన్నత విద్యా మండలికి చెందిన నిధుల పంపిణీకి మాత్రమే వర్తిస్తుందని, మిగతా సంస్థలకు వర్తించదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే పదో షెడ్యూల్ సంస్థల పంచాయతీ తిరిగి మళ్లీ కేంద్ర హోంశాఖ పరిధిలోకి వెళ్లింది.