
ఏకే–47తో ఎస్పీ భార్య కాల్పులా?
ఎస్పీ రవికృష్ణపై ఏం చర్యలు తీసుకున్నారు?.. ప్రశ్నించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా భార్యకు ఏకే 47 రైఫిల్ ఇచ్చి ఫైరింగ్ రేంజ్‌లో కాల్పులు జరిపించిన కర్నూలు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)ని హైకోర్టు ఆదేశించింది. రవికృష్ణపై ఆలిండియా సర్వీసెస్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర హోంశాఖ డిప్యూటీ కార్యదర్శి పంపిన లేఖ ఆధారంగా అతనిపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అదే విధంగా రవికృష్ణపై చర్యల నిమిత్తం న్యాయవాది బి.పురుషోత్తంరెడ్డి ఇచ్చిన వినతిపత్రంపై కూడా ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు(అర్బన్) ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో రవికృష్ణ, ఆయన భార్య పార్వతీదేవితో కలసి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ఫైరింగ్ రేంజ్‌కు వెళ్లి ఆమెకు ఏకే 47 రైఫిల్ ఇచ్చి, కాల్పులు జరిపించారని, ఇది ఆలిండియా సర్వీసు నిబంధనలకు విరుద్ధమంటూ హైకోర్టు న్యాయవాది బి.పురుషోత్తంరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రవికృష్ణపై ఆయుధాల చట్టం కింద తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.