వామ్మో.. ఏటిఎం? | RBI and Home Ministry circulars on ATM security | Sakshi
Sakshi News home page

వామ్మో.. ఏటిఎం?

Published Fri, Dec 27 2019 1:33 AM | Last Updated on Fri, Dec 27 2019 5:13 AM

RBI and Home Ministry circulars on ATM security - Sakshi

ఒకపక్క ఏటీఎంలలో భద్రత లోపాలు అనేకసార్లు బైటపడుతున్నప్పటికీ బ్యాంకులు తగు చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయంలో బ్యాంకింగ్‌ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలను కూడా అంతగా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఏటీఎంలలో విండోస్‌ 7 సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవడం మొదలుకుని యాంటీ స్కిమ్మింగ్‌ కార్డ్‌ రీడర్లు ఇన్‌స్టాల్‌ చేయడం, నగదు సరఫరాలో తీసుకోవాల్సిన జాగ్రత్తల దాకా వివిధ అంశాలపై ఏప్రిల్‌ 2018 నుంచి ఆగస్టు 2019 మధ్యలో ఆర్‌బీఐ, హోంశాఖ పలు సర్క్యులర్‌లు జారీ చేశాయి. నగదు భర్తీ చేసే సంస్థలు పాటించాల్సిన నిబంధనలు కూడా వీటిల్లో ఉన్నాయి. విండోస్‌ 7 సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకునేందుకు ఆర్‌బీఐ విధించిన జనవరి 2020 డెడ్‌లైన్‌ దగ్గరపడుతోంది. అయినప్పటికీ.. మిగతా నిబంధనల్లాగే దీన్ని కూడా పూర్తి స్థాయిలో అందుకునే పరిస్థితి కనిపించడం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.  

తీవ్రంగా పరిగణిస్తున్న ఆర్‌బీఐ...
భారత్‌లో బ్యాంకింగ్‌ తీరుతెన్నులు, పురోగతిపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం.. ఏటీఎం, డెబిట్‌ కార్డు లావాదేవీలపై బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌కి 2017–18లో 24,672 ఫిర్యాదులు రాగా, 2018–19లో 36,539కి పెరిగాయి. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యల గురించి అనేకసార్లు హెచ్చరించినప్పటికీ బ్యాంకులు పట్టించుకోకపోతుండాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ తీవ్రంగా పరిగణిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏటీఎంలలో భద్రతా ప్రమాణాలకు సంబంధించి 2017 మార్చి, నవంబర్‌లలో చేసిన సిఫార్సులను అమలు చేయాలంటూ 2018 జూన్‌ 21న ఆర్‌బీఐ ఒక సర్క్యులర్‌ పంపించింది.

ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం..  ఏటీఎంలను కచ్చితంగా గోడలు లేదా పిల్లర్లలోకి అమర్చడం, నగదు భర్తీ కోసం వన్‌ టైమ్‌ కాంబినేషన్‌ (ఓటీసీ) తాళాలను ఉపయోగించడం తదితర నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్‌బీఐ ఆదేశాల అమలు పురోగతి నత్తనడకన సాగుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం దేశంలో ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి మొత్తం 2,06,589 ఏటీఎంలు నిర్వహణలో ఉన్నాయి. అయితే, ఇప్పటికీ సగం ఏటీఎంలలో ఓటీసీ వినియోగంలోకి రాలేదు. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోకపోవడం, తగిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల.. బ్యాంకు ఖాతాదారులు నష్టపోవడంతో పాటు బ్యాంకు ప్రతిష్ట కూడా దెబ్బతింటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

వ్యయాల భయంతో వెనుకంజ..
ఏటీఎంలలో నగదు భర్తీకి ప్రస్తుతం ఉపయోగిస్తున్న విధానానికి బదులుగా మరింత సురక్షితమైన లాకబుల్‌ క్యాసెట్స్‌ (పెట్టె) విధానాన్ని అమల్లోకి తేవాలని సూచిస్తూ 2018 ఏప్రిల్‌ 12న.. ఆర్‌బీఐ మరో సర్క్యులర్‌ కూడా ఇచ్చింది. 2020–21 నాటికి మొత్తం ఏటీఎంలలో కనీసం 60% ఏటీఎంలలో దీన్ని అమల్లోకి తేవాలని నిర్దేశించింది. అయితే, దీనిపై బ్యాంకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల ఖర్చులు తడిసిమోపెడవుతాయని, పరిశ్రమపై సుమారు రూ. 6,000 కోట్ల భారం పడుతుందంటున్నాయి.

భారీ ఆర్థిక భారం పడే అవకాశాలు ఉన్నందున ఈ ఆదేశాల విషయంలో జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర ఆర్థిక శాఖను కోరాయి. మరోవైపు, నగదు రవాణా చేసే సంస్థలకు (సీఎల్‌సీ) సంబంధించి కూడా ఆర్‌బీఐ 2018 ఏప్రిల్‌ 6న మరో కీలక సర్క్యులర్‌ జారీ చేసింది. సీఎల్‌సీల వద్ద పటిష్టమైన, తేలికపాటి వాణిజ్య వాహనాలు కనీసం 300 అయినా ఉండాలని నిర్దేశించింది. దీన్నే పునరుద్ఘాటిస్తూ 2018 ఆగస్టు 8న కేంద్ర హోంశాఖ కూడా ఒక నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇందుకు నిర్దేశించిన గడువు దాటిపోయి ఏడాది గడిచిపోయినా.. ఇంతవరకూ పూర్తిగా అమలు కావడం లేదని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.

దేశంలో మొత్తం ఏటీఎంల సంఖ్య: 2,06,589
వీటిలో ఎస్‌బీఐ వాటా : 58,567
ఏటీఎం/డెబిట్‌ కార్డులు: 83,55,93,848
క్రెడిట్‌ కార్డులు: 5,25,89,719

♦ గణాంకాలు 2019 సెప్టెంబర్‌ నాటికి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement