ఉగ్రదాడా..? ఉలికిపాటా?
బారాముల్లా కాల్పుల ఘటనపై గందరగోళం
* ఇద్దరు ఉగ్రవాదుల మరణం నిర్ధారణ కాలేదన్న హోం శాఖ
* జవాన్ ఎలా చనిపోయాడన్న దానిపై సందిగ్ధం
* ఎల్వోసీ వెంట ఉద్రిక్తతల తగ్గింపుపై ఎన్‌ఎస్‌ఏల చర్చలు
శ్రీనగర్: ఆదివారం రాత్రి 10.30 గంటలు... కశ్మీర్‌లోని బారాముల్లా పట్టణం బీఎస్‌ఎఫ్ ఆర్మీ శిబిరంపై తెగబడ్డ ఉగ్రవాదులు.. జవాన్ల ఎదురు కాల్పులు.. ఉగ్రవాదుల హతం.. ఒక బీఎస్‌ఎఫ్ జవాను అమరుడయ్యాడంటూ కథనాలు...తెల్లారేసరికి సీన్ రివర్స్... ఉగ్రవాదులెవరూ మరణించలేద ని ప్రకటనలు..!
హోం శాఖ మాత్రం ఉగ్రవాదులు హతమయ్యారంటూ ఒకసారి, ఇంకా నిర్ధారణ కాలేదంటూ మరోసారి ప్రకటించి గందరగోళాన్ని మరింత పెంచింది. ఇక ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌లు మాత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, చీకట్లో తప్పించుకుపారిపోయారంటూ పేర్కొన్నాయి.
జన్బాజ్‌పురా వద్ద 40వ బెటాలియన్ సెంట్రీ... వంట ప్రాంతంలో అనుమానాస్పద కదలికల్ని గుర్తించి కాల్పులు జరిపాడు. ఉగ్రవాదులు ఆర్మీ క్యాంప్‌లోకి ప్రవేశించారా? లేదా బయటి నుంచి కాల్పులు జరుపుతున్నారా? అన్నది తెలియక జవాన్లు నలువైపుల నుంచి కాల్పులు కొనసాగించారు. 90 నిమిషాల తర్వాత భారీ వెలుతురులో వెదికితే ఉగ్రవాదుల ఆనవాళ్లు కనిపించలేదు.
ఉగ్రవాదుల కాల్పులు నిజం: ఆర్మీ
ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, చీకట్లో తప్పించుకు పారిపోయారన్నది ఆర్మీ అధికారుల వాదన. కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్స్ నితిన్, పుల్విందర్‌లు గాయపడగా వారిని శ్రీనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం నితిన్ చికిత్స పొందుతూ మరణించాడు. బీఎస్‌ఎఫ్ జవాను ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించాడా? లేదా... సైన్యం కాల్పుల్లో పొరపాటున గాయపడి మరణించాడా?(ఫ్రెండ్లీ ఫైరింగ్) అన్నది ఇంకా తేలలేదు. ఆదివారం అర్ధరాత్రి ఉధమ్‌పూర్ కేంద్రంగా ఉన్న ఉత్తర కమాండ్ పరిధిలోని బారాముల్లాలో కాల్పులు జరిగాయని ఆర్మీ ట్వీట్ చేసింది. దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని సోమవారం ఉదయం పేర్కొన్న హోంశాఖ అనంతరం ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పింది.
జీపీఎస్ పరికరం, మందుగుండు స్వాధీనం
బీఎస్‌ఎఫ్ ఐజీ (కశ్మీర్ ) వికాస్ చంద్ర మాట్లాడుతూ... దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొన్నారని, జీపీఎస్ పరికరం, కంపాస్, వైర్ కట్టర్‌తో పాటు మందుగుండును భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయన్నారు. సోమవారం ఉదయం జీలం నది పరీవాహక ప్రాంతంలో గాలింపు నిర్వహించామన్నారు. నితిన్‌పైకి ఉగ్రవాదులు గ్రనేడ్లు విసరడం వల్ల తీవ్రంగా గాయపడ్డాడన్నారు. ఉగ్రవాద గ్రూపుల ప్రయత్నాల్ని భద్రతా దళాలు సమర్థంగా తిప్పికొట్టాయని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం లేహ్‌లో అన్నారు.
పాక్ కవ్వింపు కాల్పులు
పాక్ దళాలు సోమవారం నాలుగుసార్లు కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లా సరిహద్దు వెంట ఉన్న భారత సైనిక శిబిరాలు, జనావాసాలపై కాల్పులకు తెగబడ్డాయి.ఐదుగురు పౌరులు గాయపడగా, అనేక దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. పాక్ దాడుల్ని భారత దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి. పూంచ్ జిల్లాలోని షాహ్‌పూర్, కృష్ణగాటి, మండీ, సబ్జీయన్ సెక్టార్లలో పాక్ కాల్పులు జరిపింది.
జాతీయ భద్రతా సలహాదారుల చర్చలు
ఉద్రిక్తత తగ్గించాలని భారత్, పాక్ అంగీకారానికి వచ్చాయని, ఈ మేరకు ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు ఫోన్‌లో మాట్లాడుకున్నారని పాక్ దౌత్యవేత్త సర్తాజ్ అజీజ్ చెప్పారు. భారత భద్రతా సలహాదారు దోవల్, పాక్ సలహాదారు జన్జువాలు చర్చించారన్నారు. ఎల్వోసీలో ఉద్రిక్తత తగ్గాలనేది పాక్ కోరికని, కశ్మీర్‌పై దృష్టి పెట్టడమే తమ లక్ష్యమన్నారు.