బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన కొత్త కేబినెట్‌లో మంత్రులకు శనివారం శాఖలు కేటాయించారు. కీలకమైన హోం శాఖను మొదటిసారిగా కేబినెట్‌లోకి తీసుకున్న అరగా జ్ఞానేంద్రకు కట్టబెట్టారు. గత యడియూరప్ప ప్రభుత్వంలోని చాలా మంది మంత్రులను తిరిగి అవే శాఖలను అప్పగించారు. కీలకమైన ఆర్థిక శాఖను సీఎం బొమ్మై తన వద్దే ఉంచుకున్నారు. దీంతోపాటు, ఇంటెలిజెన్స్, కేబినెట్ వ్యవహారాలు, బెంగళూరు అభివృద్ధి, కేటాయించని ఇతర శాఖలు కూడా ఆయన వద్దే ఉన్నాయి.
బెంగళూరు నగరపాలక సంస్థకు త్వరలో ఎన్నికలు జరగనున్నందున ‘బెంగళూరు డెవలప్‌మెంట్’ శాఖను నగరానికి చెందిన సీనియర్ మంత్రికి అప్పగిస్తారని అందరూ భావించారు. కానీ, పోటీదారులు ఎక్కువ కావడం వల్లే సీఎం ఎవరికీ ఈ పోస్టును కేటాయించలేదని భావిస్తున్నారు. కాగా, శాఖల కేటాయింపుపై ఆనంద్ సింగ్, ఎంటీ బీ నాగరాజ్ బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. వారితో వ్యక్తిగతంగా మాట్లాడి, సమస్య పరిష్కరిస్తానని సీఎం బొమ్మై తెలిపారు. కాగా, వీరిద్దరూ గతంలో కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ సర్కారును వీడి, బీజేపీ సర్కారు ఏర్పడటంలో సహకరించిన వారే కావడం గమనార్హం.
కర్ణాటక సీఎంగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బొమ్మై తన కేబినెట్‌లోని 29 మందికి మంత్రిత్వ శాఖలు కేటాయించారు. గత యడియూరప్ప కేబినెట్‌లోని 23 మందితోపాటు కొత్తగా ఆరుగురికి తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఎవరూ ఊహించని విధంగా కీలకమైన హోం శాఖను కొత్తగా కేబినెట్‌లోకి తీసుకున్న అరగా జ్ఞానేంద్రకు కట్టబెట్టారు. మొదటిసారిగా కేబినెట్‌లో చోటు దక్కిన జ్ఞానేంద్రకు ఈ విధంగా జాక్‌పాట్ తగిలింది. అదేవిధంగా, ముఖ్యమైన విద్యుత్ శాఖతోపాటు కన్నడ, సాంస్కతిక శాఖను వి.సునీల్‌కుమార్‌కు కేటాయించారు.
పాత వారిలో 17 మందికి గత శాఖలనే కొనసాగించగా, వీరిలో 8 మంది కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని వీడి, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంలో సహకరించిన వారే కావడం గమనార్హం. అరగా జ్ఞానేంద్ర, సునీల్ కుమార్ సహా కొత్తగా చేర్చుకున్న వారికి, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. మిగతా నలుగురిలో.. కె.ఎస్. ఈశ్వరప్పకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలు, ఆర్–అశోకకు రెవెన్యూ, కోటా శ్రీనివాస పూజారికి సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతులు, బీసీ నగేశ్‌కు ప్రాథమిక, సెకండరీ విద్య దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment