సాక్షి, న్యూఢిల్లీ : లాక్డౌన్ సమయంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన జూమ్ యాప్ పై ప్రభుత్వం షాకింగ్ న్యూస్ వెలువరించింది. వీడియో కాన్ఫరెన్సుల కోసం ఎక్కువగా వాడుతున్న యాప్ అంత సురక్షితమైన వేదిక కాదని హోం మంత్రిత్వ శాఖ తాజాగా హెచ్చరించింది. జూమ్‌ను ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు అధికారిక ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని నొక్కి చెప్పింది. సెక్యూరిటీ లోపాలకారణంగా, మీటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు కూడా అందులో ప్రత్యక్షమయ్యే ప్రమాదం ఉంటుందనీ, దీంతో ఆయా సమావేశంలో సంభాషణ వివరాలు, సున్నితమైన సమాచారాన్ని, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు తస్కరించే ప్రమాదం వుందని హెచ్చరించింది.
కాన్ఫరెన్స్ నిర్వహించేటప్పుడు వెబ్‌సైట్‌లోని యూజర్ ఖాతాలోకి లాగిన్ అవ్వడం ద్వారా లేదా పీసీ / ల్యాప్‌టాప్ / ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన అప్లికేషన్ లో చాలా సెట్టింగులు చేయవచ్చని తెలిపింది. వ్యక్తుల వినియోగానికి కూడా జూమ్ సురక్షితమైన వేదిక కాదంటూ హోం మంత్రిత్వ శాఖ సూచించింది. సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ సూచనల మేరకు మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. వర్చువల్ సమావేశాల్లో థర్డ్ పార్టీ అక్రమంగా చొరబడే "జూంబాంబింగ్" నిరోధానికి కొన్ని మార్గదర్శకాలను వెల్లడించింది. భారత్ భద్రతా ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా(సీఆర్ టీ-ఇండియా) ఇప్పటికే దీనిపై హెచ్చరికలను కూడా చేసింది. (కరోనా కట్టడికి ఇదే మార్గం! భౌతిక దూరం అంటే ఇదీ!)
భద్రతాపరంగా ఈ యాప్ వినియోగించవద్దని ప్రైవేట్ సంస్థలకు సూచిస్తూ ఓ ప్రకటన చేసింది. "ప్రైవేట్ ప్రయోజనాల కోసం జూమ్‌ను ఉపయోగించాలనుకునే ప్రైవేట్ వినియోగదారుల భద్రత కోసం మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జూమ్ యాప్‌లో గోప్యతకు, భద్రతకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. మరోవైపు గూగుల్ , స్టాండర్డ్ చార్టర్డ్ సహా అనేక సంస్థలు తమ ఉద్యోగులకు జూమ్ నుండి దూరంగా ఉండమని హెచ్చరించడం గమనార్హం. ఈ యాప్ ద్వారా నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ కు భద్రత లేకుండా పోయిందని ఇప్పటికే పలు ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. వర్చువల్ సమావేశాల సమయంలో అశ్లీల కంటెంట్ తెరపెకి వచ్చిన ఘటనలు కూడా నమోదయ్యాయి. కాలిఫోర్నియాకు చెందిన శాన్ జోస్ సంస్థ ఈ నెల ప్రారంభంలో జూమ్ యాప్ లో కొన్ని గోప్యతా సమస్యలను గుర్తించింది. దీంతో యాప్ వినియోగాన్ని సింగపూర్ ఇప్పటికే సస్పెండ్ చేసింది. అటు అమెరికాకు చెందిన ఎఫ్‌బిఐ కూడా దీని భద్రతా లోపాలను పరిశీలిస్తోంది. జూమ్ వాడొద్దంటూ యుఎస్ సెనేట్ ఇటీవల తన సభ్యులకు సూచించింది. ఈ నేపథ్యంలో జూమ్ సీఈఓ ఎరిక్ యువాన్ వినియోగదారుల భద్రతను నిర్ధారించడానికి యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా నిర్వహించారు. అయితే తాజా పరిణామంపై ఇంకా స్పందించాల్సి వుంది.
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నేపథ్యంలో చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం (ఇంటినుంచే) సేవలను అందిస్తున్నారు. ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు సంబంధించి వీడియో కాన్ఫరెన్సులకోసం జూమ్ యాప్ వైపు చాలా సంస్థలు మొగ్గు చూపాయి. కంపెనీలు, ఉద్యోగులు జూమ్ యాప్ ను విరివిగా వినియోగిస్తుండటంతో డిమాండ్ భారీగా పుంజుకుంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 200 మిలియన్ల వినియోగదారుల మార్కును దాటేసింది.
Comments
Please login to add a commentAdd a comment