గౌహతి హైకోర్టు సంచలన తీర్పు దర్యాప్తు సంస్థ రాజ్యాంగబద్ధతను ప్రశ్నించిన కోర్టు సీబీఐ 1963లో అప్పటి హోం శాఖ తీర్మానంతో ఏర్పడింది కేవలం కార్యనిర్వాహక ఉత్తర్వులతో పోలీసు దళం ఏర్పాటు చేయజాలరు అలా చేయాలంటే చట్టం తప్పనిసరి.. చట్టం చేయకుండా నియమించిన సీబీఐని పోలీసు దళంగా పరిగణించలేం నాటి హోం శాఖ తీర్మానాన్ని కొట్టివేసిన హైకోర్టు గువాహటి: కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చే పనిముట్టుగా మారిపోయిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘సీబీఐ’ రాజ్యాంగబద్ధత ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. భారత దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’(సీబీఐ) ఏర్పాటే అసలు రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు కాదని గౌహతి హైకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఐ.ఎ.అన్సారీ, జస్టిస్ ఇందిరా షాలతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం ఓ రిట్ పిటిషన్‌పై ఆదేశాలు జారీచేస్తూ ఈ మేరకు తీర్పు వెల్లడించింది. సీబీఐని ఏర్పాటు చేస్తూ కేంద్ర హోం శాఖ 1963 ఏప్రిల్ 1న చేసిన తీర్మానాన్ని ధర్మాసనం కొట్టివేసింది. చట్టం తప్పనిసరి.. ‘‘సీబీఐని ఏర్పాటు చేస్తూ 1963 ఏప్రిల్ 1న చేసిన సంబంధిత తీర్మానాన్ని మేం తోసిపుచ్చుతున్నాం, రద్దు చేస్తున్నాం. ఢిల్లీ ప్రత్యేక పోలీసు వ్యవస్థ (డీఎస్‌పీఈ)లో సీబీఐని భాగంగాగాని, దాని విభాగంగా గాని మేం చూడడం లేదు. కాబట్టి సీబీఐని పోలీసు దళంగా పరిగణించలేం’’ అని పేర్కొంది. నేర దర్యాప్తు అధికారాలు కలిగిన పోలీసు దళాన్ని.. కేవలం కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా ఏర్పాటు చేయజాలరని హైకోర్టు అభిప్రాయపడింది. అలా ఏర్పాటు చేయాలంటే.. చట్టం చేయడం తప్పనిసరి అని స్పష్టంచేసింది. నాడు కేవలం తాత్కాలిక అవసరం కోసమే ఆ తీర్మానం చేశారని పేర్కొంది. ‘‘ఆ తీర్మానం.. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంకాదు. అలాగే.. ఆ తీర్మానానికి రాష్ట్రపతి ఆమోదముద్రలేదు. కనీసం ఆర్డినెన్స్ కూడా జారీచేయలేదు. కాబట్టి దానిని కేవలం శాఖాపరమైన సూచనల ఉత్తర్వుగానే పరిగణించగలంగాని.. చట్టంగా పరిగణించలేం’’ అని వెల్లడించింది. నవేంద్ర కుమార్ దాఖలుచేసిన ఓ రిట్ పిటిషన్‌పై ఉత్తర్వులు వెలువరిస్తూ ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఇదీ కేసు.. అస్సాంలో బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి అయిన నవేంద్ర కుమార్‌పై సీబీఐ 2001లో ఐపీసీ 120బీ(నేరపూరిత కుట్ర), 420(మోసం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. దీన్ని కుమార్ హైకోర్టులో సవాలు చేశారు.. సీబీఐకు దురుద్దేశాలున్నాయని, అసలు రాజ్యంగాబద్ధంగా దాని ఏర్పాటు చెల్లదని వాదించారు. తనపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరారు. అయితే సింగిల్ జడ్జి ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. దీనిపై ఆయన డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా.. కుమార్‌పై సీబీఐ చార్జిషీట్‌ను కొట్టివేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. కేవలం హోంశాఖ తీర్మానంతో పోలీసు దళాన్ని ఏర్పాటు చేయజాలరని తీర్పులో పేర్కొంది. ‘‘హోం శాఖ తీర్మానంతో ఏర్పాటైన ఒక పోలీసు దళం.. ఒక నిందితుడిని అరెస్టు చేయవచ్చా? దాడులు, తనిఖీలు చేసి ఆస్తులు స్వాధీనం చేసుకోవచ్చా? చార్జిషీట్లు దాఖలు చేయగలదా? నిందితుడిని ప్రాసిక్యూట్ చేయగలదా?’’ అని ప్రశ్నలు లేవనెత్తింది. ఏర్పాటే చెల్లదుకాబట్టి.. ఈ చర్యలన్నిటినీ రాజ్యాంగ విరుద్ధంగా పరిగణిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
Published Fri, Nov 8 2013 3:58 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
Advertisement