సాక్షి, ముంబై: ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య పదవుల పంపకంపై పాకులాట మొదలైనట్లు తెలుస్తోంది. ఒకపక్క హోం, ఆర్థిక శాఖ లాంటి కీలక శాఖలు తనవద్దే ఉండాలని షిండే పట్టుబడుతుండగా, మరోపక్క షిండే వర్గం వద్ద ముఖ్యమంత్రి ఉండటంతో హోం శాఖ, నగరాభివృద్ధి, రెవెన్యూ, జలవనరులు లాంటి కీలక శాఖలు తమకే కావాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కీలక శాఖలపై ఇరువర్గాలు చేస్తున్న డిమాండ్లను ఎలా పరిష్కరిస్తారనే దానిపై ఇటు తిరుగుబాటు, అటు బీజేపీ ఎమ్మెల్యేలో ఉత్కంఠ నెలకొంది.
ఆది, సోమవారాలు రెండు రోజులపాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్‌గా రాహుల్ నార్వేకర్‌ను ఎన్నుకోవడంలో షిందే, ఫడ్నవీస్ వర్గానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. కానీ మంత్రివర్గంలో ఎవరికి స్ధానం కల్పిస్తారు..? ఆ తరువాత పదవులు ఎలా పంపకం చేస్తారు.? ఏ ఎమ్మెల్యేకు, ఏ పదవి కట్టబెడతారనే దానిపై చర్చ జోరుగా సాగుతోంది. మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం హయాంలో కాంగ్రెస్, ఎన్సీపీ వద్ద ఉన్న పదవుల్లో అధిక శాతం పదవులు తమకే కావాలని బీజేపీ భావిస్తోంది. ఏక్‌నాథ్ షిండే వద్ద ముఖ్యమంత్రి పదవి ఉండటంతో హోం, విద్యుత్, నగరాభివృద్ధి, జలవనరుల లాంటి కీలక శాఖలు తమకే కావాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
చదవండి: తెగని పంచాయితి.. మహారాష్ట్రలో ఆ 16 మంది ఎమ్మెల్యేల పరిస్థితేంటి?
కాని షిండే వర్గం హోం, నగరాభివృద్ధి, ఆర్ధిక, జలవనరులు, విద్య లాంటి కీలక శాఖలు కావాలని కోరుకుంటుంది. అందులో హోం, ఆర్ధిక లాంటి అత్యంత కీలకమైన శాఖలు స్వయంగా తన వద్ద ఉంచుకోవాలని షిండే పట్టుబడగా, ఫడ్నవీస్ కూడా ఆ రెండు శాఖలు తనవద్దే ఉంచుకోవాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో శివసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం హయాంలో ఫడ్నవీస్ వద్ద హోం, నగరాభివృద్ధి లాంటి కీలక శాఖలుండేవి. కానీ ఇప్పుడు శాఖల పంపిణీపై ఇరువర్గాల మధ్య విభేదాలు పొడచూపకుండా చాలా జాగ్రత్తగా సమస్యను పరిష్కరించేందుకు షిండే, ఫడ్నవీస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
చదవండి: మహారాష్ట్ర: బల పరీక్షలో నెగ్గిన ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment