మేమేం చేయలేం!
ఉద్యోగుల విభజనపై తేల్చిచెప్పిన కేంద్ర హోంశాఖ
న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీల మధ్య ఉద్యోగుల విభజనపై తామేమీ చేయలేమని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది. దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని సామరస్య పూర్వక ఒప్పందానికి వస్తే తప్ప ఈ సమస్య పరి ష్కారం కాబోదని స్పష్టం చేసింది. గురువారం తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు, ఎన్జీవోలతో పాటు టీఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కవిత, బి.వినోద్‌కుమార్, బీబీ పాటిల్, బూర నర్సయ్యగౌడ్ తదితరులు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆ శాఖ అదనపు కార్యదర్శి అనంత్‌కుమార్‌సింగ్‌లతో భేటీ అయ్యా రు. రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజనను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన రాజ్‌నాథ్.. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులను స్థానికత ప్రాతిపదికన విభజించాలంటోంది. కానీ ఏపీ ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన, ఆప్షన్ల ప్రాతిపదికన విభజించాలంటోంది. చట్టంలో మాత్రం ఆప్షన్ల ప్రకారం విభజించాలని ఉంది.
అందువల్ల 2 రాష్ట్రాల సీఎంలు కూర్చొని ఒక పరిష్కార మార్గం చూపితే మాకేమీ అభ్యంతరం లేదు. అది కాకుండా మేం ఏ మార్గదర్శకాలు ఇచ్చినా చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. మీరు స్థానికత ఆధారంగా విద్యుత్ ఉద్యోగులను పంపించేశారు. ఒకవేళ వాళ్లు ఆప్షన్ల ఆధారంగా విభజించుకుంటే సంబంధిత ఉద్యోగులకు అదే పరిస్థితి ఎదురవుతుంది. అందువల్ల మధ్యే మార్గం ఉండాలి. లేదంటే కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాలను పాటించాలి. చట్టంలో ఏదైనా సందిగ్ధత ఉంటే ఆ సెక్షన్లపై మేము వివరణ మాత్రమే ఇవ్వగలం..’’ అని తేల్చిచెప్పారు. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రతినిధి బృం దం... ఏపీలో ఉద్యోగ ఖాళీలున్నప్పటికీ తెలంగాణలో ఆప్షన్ కోరుకుంటే ఇక్కడి ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని, అలాంటప్పుడు పరిస్థితి ఇంకా జటిలం అవుతుందని వివరించింది. దీంతో రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజన అంశం కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ(డీవోపీటీ) పరిధిలోకి వస్తుందని, ఆ శాఖ మంత్రిని కలవడం మంచిదని రాజ్‌నాథ్ సూచించారు. ఈ నేపథ్యంలో ప్రతినిధి బృందం డీవోపీటీ మంత్రి వద్దకు వెళ్లి... సమస్య మొత్తాన్ని వివరించింది. అయితే తమ శాఖ కార్యదర్శి అర్చనావర్మ హైదరాబాద్‌లో ఉన్నారని, శుక్రవారం రాగానే సమావేశమవ్వాలని ప్రతినిధి బృందానికి మంత్రి సూచించారు.
వెంటనే పరిష్కరించాలని కోరాం..: కవిత
ఉద్యోగుల విభజనపై సత్వరమే కచ్చితమైన పరిష్కారం చూపాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ను కోరామని ఎంపీ కవిత చెప్పారు. కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగులు, ఉద్యోగుల భద్రత, పదోన్నతులు, విభజన తర్వాత వచ్చే కొత్త ఉద్యోగాలు చాలా ముఖ్యమైనవని, వాటిని సాధించుకోవాల్సి ఉందన్నారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేస్తే తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని... అలాగే తెలంగాణలో పనిచేస్తున్న 10వేల మంది ఏపీ ఉద్యోగులను ఆ రాష్ట్రానికి పంపడానికి మార్గదర్శకాలు ఇవ్వాలని కోరామని చెప్పారు. తమ డిమాండ్లపై రాజ్‌నాథ్, జితేంద్రసింగ్ సానుకూలంగా స్పందించారని, శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. టీఎన్జీవోల నేత దేవీప్రసాద్ మాట్లాడుతూ... ఉద్యోగుల విభజనలో లోపభూయిష్ట అంశాలు, స్థానికతను పక్కనపెడుతున్న తీరును రాజ్‌నాథ్, జితేంద్రసింగ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఉద్యోగుల విభజనకు ఏపీ ప్రభుత్వం మోకాలడ్డుతోందని ఆరోపించారు. టీజీవోల నేత శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. జోనల్, జిల్లా, మల్టీజోనల్‌లో జరిగిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్థానికతను గుర్తించడానికి కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల విభజన కోసం మరో ఉద్యమం తప్పదన్నారు. ఉద్యోగుల ప్రతినిధి బృందంలో రవీందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌గౌడ్, మధుసూదన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.