ఫ్రెండ్లీ పోలీసింగ్, పోలీసుల సామాజిక సేవలపై రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఫోటోలు, షార్ట్‌ఫిల్మ్‌లలో ఉత్తమమైన వాటికి
సాక్షి, హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్, పోలీసుల సామాజిక సేవలపై రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఫోటోలు, షార్ట్‌ఫిల్మ్‌లలో ఉత్తమమైన వాటికి పోలీసుశాఖ బహుమతులను ప్రకటించింది. ఇందులో ‘సాక్షి’ నల్లగొండ జిల్లా ఫొటోగ్రాఫర్ బజరంగ్ ప్రసాద్‌కు మూడో బహుమతి (రూ.25వేలు), కన్సోలేషన్ బహుమతులను ప్రకటించారు. ఈ పోటీకి రాష్ట్రవ్యాప్తంగా 563 ఫోటోలు, 103 షార్ట్‌ఫిల్మ్‌లు వచ్చాయి. జాతీయ పోలీస్ అకాడమీ జాయింట్ డెరైక్టర్ ఉమేష్ ష్రాఫ్ అధ్యక్షతన 8 మంది సభ్యుల కమిటీ ఉత్తమ ఫొటోల్ని ఎంపిక చేసింది. ఇందులో మొదటి బహుమతి (రూ.లక్ష నగదు)ని వరంగల్ జిల్లాకు చెందిన వెంకన్న (నమస్తే తెలంగాణ)కు, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలానికి చెందిన ఎస్.రవికుమార్‌కు రెండో బహుమతి (రూ.50 వేలు), మరో నలుగురికి కన్సోలేషన్ బహుమతులు ప్రకటించారు.
వీరికి ఈ నెల 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా బహుమతులను అందజేస్తారు. షార్ట్‌ఫిల్మ్ ఎంట్రీలను హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీ ఆధ్వర్యంలోని 8 మంది సభ్యుల కమిటీ పరిశీలిస్తోంది. వీటి ఎంపిక పూర్తికానందున పేర్లు వెల్లడి కాలేదు.