సాక్షి, న్యూఢిల్లీ: విభజనపై కేంద్రం ఏర్పాటుచేసిన మంత్రుల బృందానికి(జీవోఎం) ఈ నెల ఏడోతేదీలోగా నివేదికను సమర్పిస్తామని, అప్పటివరకు సమయం ఇవ్వాలని బీజేపీ మంగళవారం హోంశాఖకు రాసింది. విభజనపై రాష్ట్రంలోని తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నాయకులు ఇచ్చిన సూచనలు, సలహాలు, దృష్టికి తెచ్చిన సమస్యలతో జీవోఎంకు ఒకటే సమగ్ర నివేదికను ఇవ్వడానికి బీజేపీ కసరత్తు సాగిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రస్థాయిలో పార్టీ నేతలతో చర్చించి రూపొందించిన నివేదికతో ఢిల్లీకి వచ్చిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, అగ్రనేత ఎల్.కె.అద్వానీ, తదితరులతో మాట్లాడారు. రాష్ట్ర సీనియర్ నేత, జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ కూడా రాజ్‌నాథ్, అద్వానీతో వేరుగా భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో పార్టీపక్ష నాయకులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ప్రభృతులను కూడా వారు కలిశారు.