రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య పలు రంగాల్లో రాజుకుంటున్న వివాదాల పరిష్కారంపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య పలు రంగాల్లో రాజుకుంటున్న వివాదాల పరిష్కారంపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది. ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలపై చర్చించడానికి హస్తినకు రావాల్సిందిగా కేంద్ర హోంశాఖ నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావులకు పిలుపొచ్చింది.
ఈ నెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు ఢిల్లీలో హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి అధ్యక్షతన ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, కేంద్రంలోని కీలక రంగాలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ, కేంద్ర ఇంధన శాఖ, కేంద్ర ఆర్థిక వ్యవహారాలు శాఖ, కేంద్ర వ్యక్తిగత శిబ్బంది, శిక్షణ శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ద్వారా సాగునీటి రంగానికి చెందిన అంశాలన్నింటినీ కేంద్రం తన చేతిలోకి తీసుకున్న విషయం తెలిసిందే.