సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒనగూరే ప్రయోజనాలు, రావాల్సిన ప్రాజెక్టులు తదితరాంశాలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సోమవారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మంగళవారం ఉదయం కేంద్ర కేబినెట్ కార్యదర్శితో పాటు, కేంద్ర ప్రణాళికా సంఘం, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై విభజనకు చెందిన పలు అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు కొన్ని ఇనిస్టిట్యూషన్స్‌ను 13వ షెడ్యూల్‌లో చేర్చడం, అలాగే మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పరిశ్రమలకు రాయితీలతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడం, విద్యుత్ అంశాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏర్పడనున్న రెవెన్యూ లోటు భర్తీ అంశాలపై సంబంధిత కేంద్ర ఉన్నతాధికారులతో ఆయన చర్చించనున్నారు. అంతకు ముందు సోమవారం ఉదయం ఈ విషయాలన్నింటిపైన సచివాలయంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలను ప్రత్యేక నోట్స్‌ను ఆయా అధికారుల నుంచి సీఎస్ తీసుకున్నారు.
కార్పొరేషన్ల విభజనపై ఇద్దరు సీఎస్‌లు భేటీ
రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుత కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు రెండు రాష్ట్రాలకు విభజించడం ఎలా అనే అంశాలపై సోమవారం సచివాలయంలో తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ, ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావులు సమావేశమై చర్చించారు. అలాగే సంబంధిత అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన విభజన అంశాలపై పరస్పరం చర్చల ద్వారా ముందుకు సాగాలని ఇద్దరు సీఎస్‌లు స్థూలంగా నిర్ణయించారు.