
సాక్షి, న్యూఢిల్లీ : అసోంలో చేపట్టిన జాతీయ పౌరుల జాబితా (ఎన్‌ఆర్‌సీ) పెను వివాదం రేపగా తాజాగా అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్‌ఆర్‌సీ నిర్వహించేందుకు హోం మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ చేపడతామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఓం మాధుర్ పేర్కొనడం గమనార్హం. అందరికీ ఆశ్రయం ఇచ్చేందుకు దేశం ధర్మశాల కాదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక ఎన్‌ఆర్‌సీని కేవలం అసోంకు పరిమితం చేయరాదని, దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని వీహెచ్‌పీ డిమాండ్ చేస్తోంది. కాగా, అసోం ఎన్‌ఆర్‌సీ ముసాయిదాలో 40 లక్షల మంది ప్రజలకు చోటు దక్కకపోవడంతో ఈ జాబితాపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా విపక్షాలు భగ్గుమన్నాయి. మరోవైపు అక్రమ విదేశీయులుగా ప్రకటించిన వారికి బయోమెట్రిక్ వర్క్ పర్మిట్ జారీ చేయాలని హోంమంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోందని సమాచారం.
అక్రమ విదేశీయులకు ఎలా చెక్ పెడతారని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉండటంతో దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను హోమంత్రిత్వ శాఖ రూపొందిస్తోంది. వీరిని ఆయా రాష్ట్రాల్లో స్ధిరాస్తులు కొనుగోలు చేకుండా నిలువరించే చర్యలు చేపట్టవచ్చని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment