పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (ఫైల్ ఫోటో)
కోల్‌కతా : అస్సాం ప్రభుత్వం విడుదల చేసిన పౌరుల ముసాయిదా జాబితాలో 40 లక్షల మందికి పైగా ప్రజలకు చోటు దక్కకపోవడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. స్వదేశంలోనే వారు శరణార్ధులుగా మారారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇది విభజించి పాలించే విధానమే..ప్రజల్ని ఏకాకులుగా చేసి మానవత్వాన్ని మసిచేయడమేనని దీదీ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తాను వ్యక్తిగతంగా ఈ అంశాన్ని తీసుకువెళతానన్నారు. ప్రజల్ని కాపాడండి..వారిని అణిచివేయకండని ప్రధానికి విన్నవిస్తానన్నారు. ఇంత కీలక చర్యలు చేపడుతున్న క్రమంలో బెంగాల్ ప్రభుత్వంతో ఎందుకు సంప్రదించలేదని మమతా బెనర్జీ ప్రశ్నించారు.
బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను నిరోధించేందుకు 1951 తర్వాత తొలిసారిగా అస్సాం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్‌ఆర్‌సీ)ను ప్రభుత్వం అప్‌డేట్ చేసింది. ఈ జాబితాలో 40 లక్షల మందికి చోటుదక్కకపోవడంతో వీరిని స్ధానికేతరులుగా పరిగణిస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది కేవలం ముసాయిదా జాబితానేనని, దీని ఆధారంగా ఎవరినీ అరెస్ట్ చేయడం లేదా వేరే ప్రాంతానికి తరలించడం వంటి చర్యలు చేపట్టబోమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బంగ్లా వలసదారుల పేరుతో అస్సాం ముస్లిం జనాభాను టార్గెట్ చేసేందుకు ప్రభుత్వం పూనుకుంటోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఇది ముసాయిదా జాబితా మాత్రమేనని తుది జాబితా కాదని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి హింస చోటుచేసుకోకుండా అస్సాంలో భారీగా కేంద్ర బలగాలను మోహరించారు.
Comments
Please login to add a commentAdd a comment