ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (ఫైల్ ఫొటో)
లక్నో : ఇసుక తుఫాను సృష్టించిన బీభత్సం వల్ల ఉత్తర ప్రదేశ్‌లో 50 మందికి పైగా మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కర్ణాటక ఎన్నికల ప్రచారం నుంచి హడావుడిగా సొంత రాష్ట్రానికి వచ్చారు. అయితే బాధిత కుటుంబాలను పరామర్శించిన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ‘తుఫాను ఎంతో మంది జీవితాలను నాశనం చేసింది. మీకు సానుభూతిని తెలియజేయడానికి వచ్చాను. తుఫాను ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించాల్సిందిగా అధికారులు, మంత్రులను ఆదేశించాను. కానీ, చనిపోయిన వాళ్లను మాత్రం తిరిగి తీసుకురాలేం కదా!’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బాధిత కుటుంబాలకు యోగి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రజల సంక్షేమం పట్ల తన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన పని లేదని యోగి చెబుతున్నారు. ఇదిలా ఉంటే మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ. 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి పూర్తి వైద్య ఖర్చులు భరిస్తామని తెలిపింది.
8 వేల మందిని కాపాడాం..
తుఫాను బారి నుంచి 8 వేల మందిని కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. విద్యుత్ సరఫరా స్తంభించి పోయిందని.. త్వరలోనే లైన్లను పునరుద్ధరిస్తామని వారు చెప్పారు. కాగా ఉత్తర భారతదేశంలో ఇసుక తుఫాను సృష్టించిన బీభత్సానికి 124 మంది మరణించగా సుమారు 300 మంది గాయపడినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. తుఫాను కారణంగా ఐదు రాష్ట్రాల్లో నష్టం వాటిల్లిందని కేంద్రం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment