-
ఒకవైపు సర్కారు సన్నాహాలు.. మరోవైపు విపక్షాల దాడి
-
కేంద్ర హోం శాఖకు ఏపీ తెలుగుదేశం పార్టీ ఎంపీల ఫిర్యాదు
-
వివరాలు తెలపాలని రాష్ట్రాన్ని కోరిన కేంద్ర ప్రభుత్వం
-
అక్రమాల అడ్డుకట్టకు సమగ్ర సర్వే తప్పనిసరి అంటున్న కేసీఆర్
-
స్థానికత నిర్ధారణకు, సర్వేకూ సంబంధం లేదని స్పష్టీకరణ
-
ఏకపక్ష నిర్ణయమంటూ టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ధ్వజం
-
సీమాంధ్రులను వేరు చేయడానికేనని ఏపీ సర్కారు మండిపాటు
-
సామాన్య జనంలో సందేహాల ముసురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే వివాదాలకు కేంద్రమవుతోంది. అర్హులకే సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన ఈ కార్యక్రమంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఒకవైపు ఈ నెల 19న రాష్ర్ట వ్యాప్త సర్వేకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుండగా.. మరోపక్క ఇదేం సర్వే అంటూ ప్రతిపక్షాలు దాడి మొదలుపెట్టాయి. అటు ఏపీ రాజకీయ వర్గాలు దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ తాజాగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ సర్వే వెనక తెలంగాణలో నివసించే సీమాంధ్రుల స్థానికతను నిర్ధారించే ప్రయ త్నాలు జరుగుతున్నాయని సందేహిస్తున్న ఏపీ టీడీపీ ఎంపీలు బుధవారం కేంద్ర హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో హోంశాఖ వెంటనే స్పందించింది. సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన వివరాలు పంపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. అలాగే ఈ సర్వే న్యాయబద్ధమేనా అన్న విషయంపైనా ఆరా తీస్తోంది. మరోవైపు సర్వే చట్టవిరుద్ధమంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ గురువారం విచారణకు రాబోతుంది. దీనిపై కోర్టు స్పందన ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటు అధికార పక్షం మాత్రం రాజకీయ విమర్శలను తిప్పికొట్టే పనిలో పడ్డాయి. స్థానికత నిర్ధారణకు సర్వేకూ ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం చెబుతోంది. మొత్తానికి రాష్ర్ట సచివాలయంలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ సచివాలయంలోని అటెండర్ వరకు ప్రభుత్వ సిబ్బంది మొత్తం సర్వే సన్నాహాల్లో మునిగిపోయింది. సర్వేలో పాల్గొనకుంటే సర్కారు లెక్కల్లో లేనట్టేనన్న సీఎం కేసీఆర్ మాటలు బాగానే పనిచేశాయి. బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారంతా సొంతూళ్లకు తరలి వస్తున్నారు. 19న ఇంటి పట్టునే ఉండేలా చూసుకుంటున్నారు.
అందరూ ఉండాలంటేనే చిక్కు..
సాహసోపేత నిర్ణయంతో ఒకే రోజున రాష్ర్టవ్యాప్త సర్వే కోసం సర్కారు ఇప్పటికే సిద్ధమైంది. ప్రజలు కూడా వీలైనంత వరకు ఆ రోజు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గల్ఫ్, బొంబాయి, సూరత్, భీవండి తదితర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారు, విదేశాల్లో ఉంటున్న వారి పరిస్థితి ఏంటని వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరు మొత్తం వివ రాలు చెబితే చాలునని, అవసరమైతే ఎన్యుమరేటర్లు వాటిని నిర్ధారించుకుంటే సరిపోతుందన్న అభిప్రాయాలు జనంలో వ్యక్తమవుతున్నాయి. కానీ కుటుంబసభ్యుల సంఖ్య సరిగ్గా తేలడానికి అందరూ ఇంట్లో ఉండాల్సిందేనని సర్కారు స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం మంచి రోజులు కావడంతో.. 22వ తేదీ వరకు తెలంగాణ జిల్లాల్లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు కూడా చాలానే ఉన్నాయి. వీటి కోసం వెళ్లే వారు కూడా సతమతమవుతున్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు, వారి అటెండెంట్లు, సంచార జాతులు, కూలీ పనులు చేసుకునేవారు, గొర్రెల కాపరులు అందరూ 19వ తేదీనే అందుబాటులో ఉండాలన్న నిబంధన కొంత ఇబ్బందికరంగా మారింది. ఇవన్నీ ఒకెత్తు కాగా సొంతిల్లు, మోటారు సైకిల్, టీవీ, గ్యాస్ సిలెండర్ వంటివి ఉన్నా ఈ సర్వే తర్వాత సంక్షేమ పథకాల నుంచి ఆ కుటుంబాలను మినహాయిస్తారేమోనని చాలా మంది కలత చెందుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఇదే రీతిన స్పందిస్తుండడంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడుతోంది. ఇక సర్వే సందర్భంగా తీసుకునే ప్రజల వ్యక్తిగత, ఆస్తుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేసే బాధ్యతను ఔట్ సోర్సింగ్ సిబ్బందికే అప్పగించే అవకాశముంది. మరి ఈ వివరాలన్నీ బయటకు పొక్కితే ఎలాగన్న ఆందోళన కూడా సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతోంది. కీలక వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే భద్రతాపరమైన సమస్యలు వస్తాయేమోనన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.
అర్హులకే సంక్షేమ పథకాలు..
ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కొన్నేళ్లుగా దుర్వినియోగం అయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ బాహాటంగానే చెబుతున్నారు. కుటుంబాల కన్నా తెల్ల రేషన్‌కార్డులు ఎక్కువున్నాయని, ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు జరిగాయని, పింఛన్లు ఎడాపెడా ఇచ్చేశారని, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇతర పథకాల్లో కూడా అక్రమాలు జరిగాయని ఆయనపదే పదే పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సమగ్ర కుటుంబ సర్వేకు పిలుపునిచ్చారు. ఒకే రోజు సర్వే చేపట్టి.. ఆ రోజున కుటుంబసభ్యులంతా ఇంట్లోనే ఉండాలన్న నిబంధన పెట్టడం వల్ల నకిలీ(డూప్లికేషన్ ఎంట్రీలు) సమాచారానికి అవకాశం ఉండదని ఆయన భావిస్తున్నారు. కుటుంబ ఆస్తుల వివరాలు సేకరించడం ద్వారా సామాజిక ఆర్థిక స్థితిగతులు తెలుస్తాయన్నది కేసీఆర్ ఆలోచన. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన వెనక్కి తగ్గడం లేదు. సర్వే రోజు అందుబాటులో ఉండని వారి వివరాలను కుటుంబ యజమాని ద్వారా తెలుసుకుని ధ్రువీకరణ చేసుకుని ఆమోదిస్తే గందరగోళానికి తెరపడుతుందని సర్కారు భావిస్తోంది.
ఏపీ సర్కారు వ్యతిరేకత!
తెలంగాణలో దశాబ్దాల క్రితం వచ్చి స్థిరపడిన సీమాంధ్రులను వేరు చేయడం కోసమే ఈ సర్వే నిర్వహిస్తున్నారన్న అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని మంత్రులు బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. కులం పేర్లు, వ్యవసాయ భూముల సర్వే నెంబర్లు, వాటికి జరిగిన రిజిస్ట్రేషన్ల ఆధారంగా తెలంగాణేతరులను గుర్తిస్తారని అభిప్రాయపడుతున్నారు. అయితే అనవసరంగా అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ తెలంగాణ మంత్రులు, టీఆర్‌ఎస్ నాయకులు రెండు రోజులుగా ఎదురుదాడికి దిగారు. అసలు చంద్రబాబు నాయుడు ఏపీకి ముఖ్యమంత్రిగా గాకుండా తెలంగాణ ప్రతిపక్ష నేతగా వ్యవహరించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ విమర్శించారు. మరోవైపు టీటీడీపీ బృందం కూడా బుధవారం గవర్నర్‌ను కలిసి సర్వేపై ఫిర్యాదు చేసింది.
నేతల స్పందన
‘‘ఈ సర్వే ప్రభుత్వ ఏకపక్ష వైఖరికి నిదర్శనం. ప్రజల హక్కులకు భంగం కలిగించేలా సర్వేలోని అంశాలున్నాయి. బ్యాంకు అకౌంట్, ఆస్తుల వివరాలు, ఇన్‌కమ్ టాక్స్ వివరాలు అడిగే హక్కు రాష్ట్రానికి ఎక్కడిది? ఒకేరోజు సర్వే అంటే ప్రజల మీద నమ్మకం లేకే కదా! రేషన్‌కార్డులు, ఫీజులు, ఇళ్లు దుర్వినియోగం అయ్యాయని చెబుతున్న కేసీఆర్ ప్రజలను అనుమానిస్తున్నారు. డూప్లికేషన్ కాకుండా ఐరిష్, ఇతర సాంకేతిక పరిజ్ఞానాలు ఉండగా.. ఒకే రోజు సర్వే అని ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమెందుకు?’’ - బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి
‘‘ఈ సర్వే రాచరికపు వ్యవస్థను తలపించేలా ఉంది. ప్రజా ప్రతినిధులకు, అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన లేని పరిస్థితుల్లో ఈ సర్వే ఎలా చేస్తారో అర్థం కావడం లేదు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని పార్టీల అభిప్రాయం తీసుకోవాలన్న కనీస ఆలోచన లేకుండా ప్రభుత్వం.. ‘రాజు ఆదేశించాడు.. అందరూ పాటించాలి’ అనే దోరణిలో వెళుతోంది’’ - టీడీపీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్
‘‘ఇదంతా ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్‌లా కనిపిస్తోంది. నిజానికి 90 శాతం వివరాలు ఆధార్ కార్డుల్లోనే ఉండగా మళ్లీ ప్రత్యేకంగా ఈ సర్వే ఎందుకు? కే వలం సంక్షేమ పథకాల్లో కోత పెట్టడమే సర్కారు ఉద్దేశంలా ఉంది. ప్రజల్లో తీవ్ర గందరగోళం, ఆందోళన నెలకొంది’’ - టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య
‘‘తెలంగాణ సర్వేపై టీడీపీ ఎంపీలు కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయడం సరైంది కాదు. పచ్చకామెర్ల వ్యాధి పట్టిన వాళ్లలా టీడీపీ ఎంపీలు వ్యవహరిస్తున్నారు. సర్వేను అడ్డుకునే ప్రయత్నం చే యడం సరికాదు. సర్వేపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తుంటే టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. బీసీలంతా సర్వేలో పాల్గొనాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య పిలుపునిస్తే.. ఆ పార్టీ ఎంపీలు మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణం’’ - టీఆర్‌ఎస్ ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, బాల్క సుమన్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్