
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన అనుభవమున్న జానారెడ్డి గురించి కేసీఆర్ అబద్ధాలు చెప్పడం తగదని, ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తే సంతోషమని జానా అన్నారే తప్ప.. గులాబీ కండువా కప్పుకుంటానని ఆయన అనలేదని, అలా అన్నట్టు శాసనసభ రికార్డుల్లో ఎక్కడా లేదని చెప్పారు. శనివారం టీపీసీసీ ఫిషర్‌మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు పంటలకు కోటి ఎకరాలకు నీరిస్తే టీఆర్‌ఎస్ పార్టీకి ప్రచారం చేస్తానని జానారెడ్డి చెప్పారని, కేసీఆర్ మాట్లాడింది తప్పని తాము నిరూపించినందుకు ఇప్పుడు ఆయన ఏం శిక్ష వేసుకుంటారో చెప్పాలన్నారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు జానారెడ్డికి సీఎం క్షమాపణలు చెప్పాలని సంపత్ డిమాండ్‌చేశారు.