
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)లోని నిబంధనల రూపకల్పనకు కేంద్ర హోం శాఖ అదనంగా మరో మూడు నెలల సమయం కావాలని కోరినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సబార్డినేట్ లెజిస్లేషన్‌కు సంబంధించిన హోం శాఖ పార్లమెంటరీ కమిటీకి నివేదన పంపినట్లు వెల్లడించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో అణచివేతకు గురయ్యే ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పించేందుకు కేంద్రం సీఏఏను తీసుకువచ్చిన విషయం విదితమే. ఉభయసభల ఆమోదం పొందిన అనంతరం గత ఏడాది డిసెంబర్ 12వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దీనికి ఆమోదముద్ర వేశారు. (పౌరసత్వ సవరణ చట్టం: ఎందుకీ ఆందోళనలు?)
కాగా నిబంధనల ప్రకారం.. ఏదైనా చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందిన 6 నెలల్లోగా నిబంధనల రూపకల్పన పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకుంటే గరిష్టంగా 3 నెలల పొడిగింపునకు అనుమతి పొందవచ్చు. సీఏఏ నిబంధనల రూపకల్పన పూర్తికాక పోవడంతో మరో మూడు నెలల గడువు కోరుతూ పార్లమెంటరీ కమిటీకి విజ్ఞాపన పంపారు. ఈ వినతిని సంబంధిత కమిటీ ఆమోదించే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. ఇక ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని సీఏఏ రూపొందించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చట్టానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.