
సాక్షి, న్యూఢిల్లీ: గత నాలుగు నెలల్లో జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద ఘటనల్లో మొత్తం 61 మంది భద్రతా సిబ్బంది మృతి చెందినట్లు భారత హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారితో పాటు 11 మంది సాధారణ పౌరులు మృతి చెందినట్లు తెలిపింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన రోహిత్ చౌదరీ అనే సామాజిక కార్యకర్త ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా జనరల్ ఆఫీసర్ కమాండర్ ఇన్ చీఫ్ సులేఖ ఈ వివరాలను బహిర్గతం చేశారు.
గత నాలుగు నెలల్లో జరిగన అనేక దాడుల్లో 142 మంది గాయపడగా.. వీరిలో 73 మంది భద్రతా సిబ్బంది, 63 మంది పౌరులు ఉన్నారని తెలిపారు. అలాగే ఈ సంవత్సరం ఆరంభం నుంచి 177 ఉగ్రవాద ఘటనలు జరిగాయని ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 86 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్ సింగ్ తెలిపారు. అందులో 20 మందిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. పాక్ సరిహద్దుల్లో 16 ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్లు తెలుస్తోందని.. వాటి కార్యక్రమాలను అడ్డుకుంటున్నామని వెల్లడించారు.