పట్నా : జేడీయూ అధినేత నితీష్ కుమార్‌కు ఇదే చివరి ఎన్నికలని లోక్‌జన శక్తిపార్టీ (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ జోస్యం చెప్పారు. నితీష్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని, బిహార్ ప్రజలు ఆయన పాలనలో విసుగుచెందారని విమర్శించారు. బిహార్‌లో నేడు (మంగళవారం) రెండో దశ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ తన ట్వీట్‌లతో అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి కారని, రాష్ట్రం వెనుకబాటుతనం కారణంగా బిహారీలు తమను తాము బిహారీలుగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బిహారీ ప్రజలు విలువైన ఓటును వృథా చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే నుంచి విడిపోయి ఒంటరిగా పోటీ చేస్తున్న ఎల్జేపీ నాయకుడు, బీజేపీతో తన స్నేహం చెక్కుచెదరకుండా ఉందని మరోసారి స్పష్టం చేశారు. నవంబర్ 10 తర్వాత నితీశ్ కుమార్ మరెన్నడూ ముఖ్యమంత్రి కారని లిఖితపూర్వకంగా రాసివ్వగలనని, బిహార్ మొదట-బిహారీ మొదట ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. మొదటి దశ పోలింగ్ తర్వాత నితీష్‌జీకి ఓటమి భయం పట్టుకుందని, ప్రజలు అతన్ని తిరస్కరిస్తున్నారని అర్థమైందని అన్నారు.
‘నితీష్ ఫ్రీ బిహార్ కావాలి, గత 15 ఏళ్లలో రాష్ట్రం అపఖ్యాతి పాలై, దారుణమైన స్థితికి చేరుకుంది. వలసలు, నిరుద్యోగం, వరదలు వంటి పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల లేదు. ఉపాధ్యాయులు, విద్యార్ధులు చీకట్లో జీవిస్తున్నారు. బిహార్ నుంచి వలస వెళ్లిన వారు తమను తాము బిహారీ అని చెప్పుకోడానికి వెనకాడుతున్నారు. అయోధ్య రామ మందిరం కంటే పెద్దదైన సీత ఆలయాన్ని బిహార్‌లో నిర్మిస్తామని హామీ ఇస్తున్నా. బిహార్ ఫస్ట్- బిహారీ ఫస్ట్ అనేదే మా నినాదం’ అని అన్నారు.
బిహార్‌లో మొత్తం 243 నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అక్టోబర్ 27న మొదటి దశ ఎనికలు పూర్తి కాగా, నవంబర్ 3న రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ఏడో తేదీన 71 నియోజకవర్గాల్లో మూడో దశ పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 10న విడుదల కానున్నాయి. కరోనా సంక్షోభం అనంతరం జరగుతున్న ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది దేశ వ్యాప్తంగా ఆసక్తి కరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment