పట్నా: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నాయి. కాగా ఈనెల 28న రాష్ట్రంలో తొలి విడత పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో 1064 మంది ఎన్నికల బరిలో నిలిచారు. 16 జిల్లాల్లోని 71 శాసన సభ స్థానాలకు జరుగుతున్న మొదటి దశ పోలింగ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) సంపన్న అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ 1064 మందిలో 375 మంది కోటీశ్వరులు ఉన్నట్లు వెల్లడించింది. మూడింట ఒక వంతు అభ్యర్థులు రూ. కోటికి పైగా ఆస్తులు కలిగి ఉన్నట్లు పేర్కొంది. (చదవండి: బిహార్ 2020: ప్రధాన మహిళా అభ్యర్థులు)
అత్యధికంగా ఆర్జేడీ నుంచి
ఏడీఆర్ నివేదిక ప్రకారం, ఆర్జేడీ నుంచి పోటీపడుతున్న 41 మంది అభ్యర్థులో 39 మంది, జేడీయూ నుంచి బరిలో దిగిన 35 మందిలో 31 మంది, బీజేపీకి చెందిన 29 మందిలో 24 మంది, ఎల్‌జేపీ 30(41), బీఎస్పీ 12(26), 14(21) మంది అభ్యర్థులు కోటి రూపాయల కంటే ఎక్కువ సంపద కలిగి ఉన్నారు. అదే విధంగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు తొలి విడత పోలింగ్‌లో బరిలోకి దిగిన ఒక్కో అభ్యర్థి సగటున 1.99 కోట్ల ఆస్తి కలిగి ఉన్నారని ఏడీఆర్ వెల్లడించింది. (తొలిసారి నాన్న లేకుండానే: చిరాగ్)
ఆయనే సంపన్న అభ్యర్థి
ఇక వీరందరితో పోలిస్తే ఆర్జేడీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అనంత్ కుమార్ 68 కోట్ల రూపాయల సంపదతో సంపన్న అభ్యర్థిగా నిలిచినట్లు ఏడీఆర్ పేర్కొంది. కాగా 2015 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీపడిన ఆయన, ప్రస్తుతం మొకామా నియోజకవర్గం నుంచి ఆర్జేడీ గుర్తు మీద రంగంలోకి దిగారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన గజానంద్ షాహి(షేక్‌పురా) రూ. 61 కోట్ల ఆస్తి కలిగి ఉండి రెండోస్థానాన్ని ఆక్రమించారు. వీరిద్దరి తర్వాత మనోరమా దేవి(జేడీయూ) రూ. 50 కోట్ల ఆస్తితో మూడో స్థానంలో నిలిచారు. ఇక ఐదుగురు అభ్యర్థులు మాత్రం తమకు ఎలాంటి ఆస్తులు లేవని అఫిడవిట్‌లో పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment