పట్నా: 15 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను, ఇటీవల వేరుపడిన మిత్రపక్షం ఎల్జేపీ శత్రుత్వాన్ని, ఆర్జేడీ యువనేత సారధ్యంలోని విపక్షాన్ని విజయవంతంగా ఎదుర్కొని బిహార్‌లో ఎన్డీయే మరోసారి అధికారంలోకి రానుంది. 243 సీట్ల అసెంబ్లీలో, మెజారిటీ మార్క్ 122 కన్నా కేవలం 3 స్థానాలు అధికంగా సాధించి, మరోసారి బిహార్ గద్దెనెక్కనుంది. గట్టిపోటీనిచ్చిన ఆర్జేడీ నాయకత్వంలోని విపక్ష మహా కూటమి 110 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ విజయంతో వరుసగా నాలుగోసారి జేడీయూ నేత నితీశ్‌కుమార్ సీఎం కానున్నారు. 2015 ఎన్నికల్లో 71 సీట్లు సాధించిన జేడీయూ ఈ ఎన్నికల్లో 43 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. 2015లో నితీశ్ బీజేపీ వ్యతిరేక కూటమిలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేశారు.
మిత్రపక్షం జేడీయూ కన్నా ఎక్కువ స్థానాల్లో(74) గెలిచినా.. ముందే కుదిరిన అంగీకారం మేరకు నితీశ్‌కుమారే సీఎంగా ఉంటారని బీజేపీ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో జేడీయూ ఆశించినన్ని స్థానాలను గెలవలేకపోవడం వెనుక మాజీ మిత్రపక్షం ఎల్జేపీ హస్తం ఉంది. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్‌ను అంగీకరించినప్పటికీ.. ఎక్కువ స్థానాలు గెలుచుకున్న బీజేపీ మంత్రివర్గంలో అధిక వాటాను, కీలక శాఖలను డిమాండ్ చేసే అవకాశముంది. ఎంఐఎం, బీఎస్పీ, ఆర్‌ఎల్‌ఎస్పీల ‘మహా ప్రజాస్వామ్య, లౌకిక కూటమి’ ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మహా కూటమి విజయావకాశాలను బాగా దెబ్బతీసిందని, ముఖ్యంగా ముస్లిం ఓట్లను ఈ కూటమి చీల్చిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment