
రక్సాల్‌లో సెల్ఫీ స్టాండ్ వద్ద ఓటరు
బిహార్ శాసనసభకు జరిగిన మూడో దశ(చివరి దశ) ఎన్నికల్లో 57.92 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మొదటి రెండు దశల కంటే మూడో దశలో అధికంగా పోలింగ్ జరిగిందని తెలిపింది. చెదురుమదురు సంఘటనలు మినహా శనివారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చివరి దశలో ఉత్తర బిహార్‌లో 15 జిల్లాల్లోని 78 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ మొత్తం 1,204 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 78 నియోజకవర్గాల్లో 2.35 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 33,782 పోలింగ్ కేంద్రాల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది.
ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్ణియాలో ఓటింగ్ కేంద్రం వద్ద ఉన్న గుమికూడిన జనాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. కతిహర్‌లో రైల్వే క్రాసింగ్‌ల వద్ద గేట్లు ఏర్పాటు చేయనందుకు నిరసనగా 12 బూత్‌లతో జనం ఓటింగ్‌ను బహిష్కరించారు. జోకిహత్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్ అలామ్ తన చొక్కాకు పార్టీ బ్యాడ్జీని ధరించి ఓటు వేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 10న జరగనుంది. శనివారం జరిగిన పోలింగ్‌తోపాటు తొలి రెండు పోలింగ్ శాతాలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తంగా 56.43 శాతం పోలింగ్ నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment