పట్నా: బిహార్‌లో తుది విడత ఎన్నికలకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 15 జిల్లాల్లోని 78 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. మొత్తం 1,204 మంది అభ్యర్థులు బరిలో ఉంటే, దాదాపుగా 2.34 కోట్ల మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. 78 అసెంబ్లీ స్థానాలతో పాటుగా వాల్మీకి నగర్ లోక్ సభ నియోజకవర్గం స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. సిట్టింగ్ జేడీ(యూ) ఎంపీ బైద్యనాథ్ మహతా మృతితో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.
మూడో విడత కీలకంగా ఒవైసీ
ఈ విడత జరిగే ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొంది. ఎన్డీయే, మహాఘట్‌బంధన్, చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీతో పాటుగా అసదుద్దీన్ ఒవైసీ ఏఐఎంఐఎం, మాయావతికి చెందిన బీఎస్పీ, ఉపేంద్ర కుష్వా ఆర్‌ఎల్‌ఎస్‌పీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో తమ పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. కోసి–సీమాంచల్ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లోనే తుది విడత ఎన్నికలు జరగనున్నాయి. ప్రతీ ఏడాది వరదలతో అతలాకుతలమవుతూ సారో ఆఫ్ బిహార్‌గా పేరు పడిన కోసి ప్రాంతంలో ముస్లింలు, యాదవులు, అత్యంత వెనుకబడిన వర్గాల కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు.
సీమాంచల్ ప్రాంతంలో 30% జనాభా ముస్లింలే. దీంతో ఎంఐఎం అధ్యక్షుడు ఒవైసీ చాలా సీట్లలో తమ అభ్యర్థులను నిలబెట్టారు. ఆయన ఉధృతంగా ప్రచారాన్ని కూడా నిర్వహించారు. అత్యధిక నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ నెలకొని ఉండడంతో ఎలాగైనా పట్టు సాధించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈసారి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతీ ర్యాలీలోనూ బిహార్ అభివృద్ధి చెందాలంటే నితీశ్ కుమార్ సీఎం కావాలని ఆయన పేరే జపించారు. బిహార్ రాష్ట్ర భవితవ్యాన్ని తేల్చే ఈ ఎన్నికల్లో ఓటరు దేవుడు ఎవరి వైపు మొగ్గు చూపిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment