ముంబై: శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఎన్నికల కమిషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసీ బీజేపీలో ఓ శాఖ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకు రాదంటూ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీనిపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. ‘భారత ఎన్నికల కమిషన్ బీజేపీకి చెందిన ఓ శాఖ. దాని నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం’ అన్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొదటి దశ పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఆర్జేడీ చీఫ్, విపక్షాల సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఓ యువకుడు.. ఎవరి మద్దతు లేదు.. తండ్రి జైలులో ఉన్నాడు. సీబీఐ, ఐటీ డిపార్ట్‌మెంట్లు అతడి వెంట పడుతున్నాయి. ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికి రేపు అతడు ముఖ్యమంత్రి అయినా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. మెజారిటీ ఓట్లు సంపాదించుకుంటాడు అనిపిస్తుంది’ అన్నారు. (చదవండి: కాంగ్రెస్‌కి షాకిచ్చిన ఎన్నికల కమిషన్)
అంతేకాక ఎన్నికల వేళ బిహార్‌లో ఏం జరుగుతుందో అందరికి తెలుసన్నారు సంజయ్ రౌత్. ఎన్నికల కమిషన్ బీజేపీకి కొమ్ము కాస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకురాలు పంకజా ముండే శివసేనలో చేరారనే పుకార్లపై సంజయ్ రౌత్ తనకు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. బిహార్ మొదటి దవ ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ 30 న 71 స్థానాలకు ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 55.69 శాతం ఓటర్లు నమోదయ్యాయి. రెండవ దశ నవంబర్ 3న, మూడవ దశ నవంబర్ 7న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 10 న జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment