సాక్షి, పట్నా: ఎక్కడ చూసినా ప్రస్తుత ఎన్నికల పోరులో కరోనా వ్యాక్సిన్ ఉచితం అనేది ఓటర్లకు బంపర్ ఆపర్ గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము తిరిగి అధికారంలోకి వస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామంటూ బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడటంతో వివాదం రాజుకుంది. దీనిపై సాకేత్ గోఖలే అనే ఆర్టీఐ కార్యకర్త ఈసీని ఆశ్రయించారు. అయితే కోవిడ్-19 వ్యాక్సిన్ ఉచిత హామీ ఎంత మాత్రమూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా స్పష్టం చేసింది.
బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో రాష్ట్ర ప్రజలకు ఉచిత కరోనా వ్యాక్సిన్ వాగ్దానం ప్రవర్తనా నియమావళి (ఎంసిసి) ఉల్లంఘన కిందకు రాదంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. టీకా విధానం ఇంకా నిర్ణయించబని క్రమంలో ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం అని ఆరోపిస్తూగోఖలే ఫిర్యాదు మేరకు ఈసీ స్పందించింది. అక్టోబర్ 28 న గోఖలేకు కమిషన్ ఇచ్చిన సమాధానంలో మూడు విషయాలను ప్రస్తావించింది. రాజ్యాంగానికి, విరుద్దంగా, కించపర్చేదిగా, ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతను దెబ్బతీసేలా, విఘాం కలిగించేలా లేదా ఓటరుపై అనవసర ప్రభావాన్ని చూపే వాగ్దానాలు ఉండకూడదని స్పష్టం చేసింది.
కాగా ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీపై ఆర్జేడీ కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇంకా అందుబాటులోకి రాని వ్యాక్సిన్‌ను ఒక రాష్ట్ర ప్రజలకే ఉచితంగా ఎలా ఇస్తారని ప్రశ్నించాయి. కరోనా మహమ్మారిని బీజేపీ రాజకీయం చేస్తోందని, ప్రజల భయాలతో ఆడకుంటోందని మండిపడ్డాయి. అలాగే మిగతా రాష్ట్రాలు ఈ దేశంలో లేవా అని దుయ్యబట్టాయి. మరోవైపు బిహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ఈ నెల 28వ తేదీన ముగిసింది. రెండో విడత పోలింగ్ నవంబర్ 3న, చివరి విడత పోలింగ్ నవంబర్ 7న జరగనుంది. ఫలితాలు నవంబర్ 10 వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment