పట్నా: విమర్శలు, ప్రతివిమర్శల దాడితో బిహార్‌లో రాజకీయం మరింతగా వేడెక్కింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన లోక్‌జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్, ఆర్జేడీ కీలక నాయకుడైన తేజస్వీ యాదవ్ వంటి యువ నేతలు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈనెల 28న రాష్ట్రంలో తొలి విడత పోలింగ్ జరుగనున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇందుకు సంబంధించి నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ కూడా ముగిసింది. ఈ క్రమంలో మొత్తంగా వెయ్యి మంది అభ్యర్థులు బరిలో నిలవగా, వీరిలో 113 మంది మహిళలు ఉన్నారు. వీరిలో చాలా మంది స్వతంత్ర అభ్యర్థులే కావడం గమనార్హం. ఇక ప్రధాన రాజకీయ పార్టీల నుంచి మొదటి దశ పోలింగ్‌లో(71 సీట్లు) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారి సంఖ్య 27. (చదవండి: నా గుండె చీల్చి చూడండి: చిరాగ్ పాశ్వాన్)
తొలి దశలో..
అధికార ఎన్డీయే కూటమిలోని మిత్రపక్షాలైన బీజేపీ 121 స్థానాల్లో పోటీ చేస్తుండగా, జేడీయూ 122 సీట్లలో పోటీ చేసేందుకు ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మద్యనిషేధ హామీతో మహిళా ఓటర్ల అభిమానం చూరగొన్న జనతాదళ్(జేడీ(యూ)) అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. ఈసారి మొత్తంగా 22 మంది మహిళా అభ్యర్థులకు పార్టీ టిక్కెట్లు ఇచ్చి ప్రత్యేకతను చాటుకున్నారు. మరే ఇతర పార్టీ ఈస్థాయిలో స్త్రీలకు సీట్లు కేటాయించలేదు. రాష్ట్రీయ జనతాదళ్ నుంచి మొదటి దశలో 10 మంది మహిళలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జేడీయూ, బీజేపీ, ఎల్జేపీ తొలి దశలో ఐదుగురు చొప్పున మహిళా అభ్యర్థులను నిలబెట్టగా, కాంగ్రెస్ పార్టీ, హెచ్‌ఏఎమ్-ఎస్ ఒక్కో మహిళకు అవకాశమిచ్చాయి. వీరిలో కొంతమంది ప్రముఖుల గురించి తెలుసుకుందాం.
డైనమిక్ ప్రియ
బిహార్ రాజకీయాల్లోకి మెరుపువేగంతో దూసుకువచ్చింది పుష్పం ప్రియా చౌదరి. ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది.‘ప్లూరల్స్’ అనే పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగింది. అంతేకాదు తానే సీఎం అభ్యర్థిని అని కూడా ప్రకటించుకుంది. అధికార జెడీ(యు) నాయకుడు వినోద్ చౌదరి కూతురు ఆమె. తండ్రి అండతో ఆ పార్టీలో పైకి ఎదిగే అవకాశాలు ఉన్నా.. సొంతంగా ఎదగాలనే లక్ష్యంతో.. ‘లవ్ బిహార్, హేట్ పాలిటిక్స్’ అనే నినాదంతో తొలుత సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది. బిహార్‌లోని దర్భంగాలో జన్మించిన ప్రియా, ఉన్నత విద్యకోసం లండన్ వెళ్లింది. డెవలప్‌మెంట్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. బిస్ఫీ, బంకీపూర్ నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచింది.
శ్రేయాసి సింగ్
ప్రముఖ షూటర్, కామన్‌వెల్త్ గేమ్స్ గోల్డ్‌మెడలిస్ట్, అర్జున అవార్డు గ్రహీత శ్రేయాసి సింగ్ బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జేడీయూ మాజీ నేత దిగ్విజయ్ సింగ్ కుమార్తె అయిన ఆమె, జమాయ్ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ఇక ఇప్పటికే బీజేపీకి మద్దతుగా పలుచోట్ల పోటీని విరమించుకున్న చిరాగ్ పాశ్వాన్, శ్రేయాసీ సింగ్ తరఫున ప్రచారం చేయడం గమనార్హం. జమాయ్ నుంచి ఎంపీగా ఉన్న ఆయన, శ్రేయాసీ తన చెల్లెలు వంటిదని, ఆమెకు ఓటు వేయాల్సిందిగా పార్టీ కార్యకర్తలతో పాటు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిస్తున్నారు.
మంజు వర్మ
నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్‌పూర్ షెల్టర్ హోం లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడితో, తన భర్తకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణ నేపథ్యంలో మంజు వర్మ తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు అక్రమంగా మందు గుండు సామాగ్రిని ఇంట్లో నిల్వ చేసిన కారణంగా సీబీఐ ఆమె ఇంటిపై దాడి చేసి, భార్యాభర్తలపై కేసు నమోదు చేసింది. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ జేడీయూ మరోసారి ఆమెకు టికెట్ ఇవ్వడం విశేషం. బెగుసరాయ్ జిల్లాలోని చెరియా బరియార్‌పూర్ నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.
మనోరమా దేవి
గయా జిల్లా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె భర్త, దివంగత బిందేశ్వరి ప్రసాద్ యాదవ్ కండలవీరుడిగా గుర్తింపు పొందారు. తన కుమారుడు సృష్టించిన ఓ వివాదం కారణంగా మనోరమా దేవిని జేడీయూ నుంచి బహిష్కరించారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆమెను పార్టీలోకి ఆహ్వానించి, ఆట్రీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించారు.
అంజుమ్ అరా
బక్సర్ జిల్లాలోని దుమరాన్ నుంచి పోటీకి దిగుతున్నారు. జేడీయూ అధికార ప్రతినిధిగా ఉన్న ఆమెకు ఈసారి పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్‌ను ఇచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే దదాన్ సింగ్ పెహల్వాన్‌ను కాదని, క్లీన్ ఇమేజ్ ఉన్న మహిళా యువనేతకే పెద్దపీట వేసింది.
సుషుమాలత కుశ్వాహ
జేడీయూ తరఫున భోజ్‌పూర్ జిల్లాలోని జగదీష్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న యువ నేత. ఇటీవలే ఆమె రెండో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. డెలివరీ అయిన వెంటనే ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోకుండా, ఎన్నికల ప్రచారంలోదిగి తన దైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలి ర్యాలీలో సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. ఆడబిడ్డ రాక ఎంతో శుభప్రదమని, ఎన్నికల్లో విజయం మీదేనంటూ విశ్వాసం నింపారు. ప్రస్తుతం ఆమె భోజ్‌పూర్ గ్రామ పంచాయతి పెద్దగా ఉన్నారు. ఇక వీరితో పాటు మరికొంత మహిళా అభ్యర్థులు కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.
అప్పటితో పోలిస్తే తక్కువే
243 సీట్లు ఉన్న బిహార్ అసెంబ్లీకి 2010లో ఎన్నికైన మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 34. అయితే ఐదేళ్ల తర్వాత అంటే 2015లో ఈ సంఖ్య 28కి పడిపోయింది. వీరిలో 10 మంది ఆర్జేడీకి చెందినవారు కాగా, 9 మంది జేడీయూ నుంచి గెలిచారు. బీజేపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి నలుగురు మహిళలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఒకరు స్వతంత్రంగా పోటీచేసి విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment