పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆర్జేడీ ఛీప్ తేజస్వీ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఫలితాల్లో పెద్ద ఎత్తున ఆక్రమాలు జరిగాయని ఆరోపణలు గుప్పించారు. బిహార్ ఓటర్లు మహా ఘట్‌బందన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎన్నికల సంఘంతో కుమ్మకై ఫలితాలను తారుమారు చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అవకతవకలు జరిగాయన్నారు. గురువారం పట్నాలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయేకు ఈసీ అనుకూలంగా వ్యవహరించిందని విమర్శించారు. పోల్ ప్యానల్‌పై సైతం తీవ్ర ఆరోపణలు చేశారు. బిహార్ ఫలితాలను రీకౌంటింగ్ జరపించాలని తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. మరోవైపు ఫలితాలపై ఆర్జేడీతో పాటు కాంగ్రెస్ నేతలు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహా కూటమి గెలిచిన స్థానాల్లో చాలావరకు వెయ్యిలోపు మెజార్టీ ఉండటంతో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. (బిహార్ ఎన్నికల ఎఫెక్ట్; కాంగ్రెస్ సీట్లకు కోత!)
కాగా మంగళవారం విడదలైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో ఎన్డీయే కూటమి విజయ సాధించింది. ఆర్జేడీకి 76, బీజేపీ 74, జేడీయూ 43 స్థానాల్లో గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా బీజేపీకి 74 స్థానాను సొంతం చేసుకుంది. అయితే ఆర్జేడీ భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపకపోవడంతో ఆ ప్రభావం తేజస్వీపై పడింది. ఏకంగా 70 సీట్లకు పోటీచేసి కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది.
ఇక మరోసారి బిహార్ సీఎం పగ్గాలను అందుకునేందుకు జేడీయూ అధినేత నితీష్ కుమార్ సిద్ధమయ్యారు. మంత్రివర్గ సంప్రదింపుల అనంతరం దిపావళి తరువాత సీఎంగా ప్రమాణం చేయనున్నారు. కేబినెట్‌లో కీలక శాఖలు తమకే దక్కాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇక అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సరైన సంఖ్యా బలం లేకపోవడంతో తేజస్వీ మరోసారి ప్రతిపక్ష పాత్ర పోషించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment