పట్నా: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బిహార్ అసెంబ్లీ హోరాహోరీ ఎన్నికల పోరులో అధికార ఎన్డీయో కూటమి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 243 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 122 కాగా, అంతకన్నా కేవలం రెండు సీట్లు ఎక్కువ గెలుచుకుని 124 సీట్లతో ఎన్డీయే అధికారం చేపట్టనుంది. విపక్ష మహాకూటమి మొత్తంగా 111 స్థానాలకు పరిమితమైంది. బిహార్ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
నియోజకవర్గాల వారిగా ప్రముఖుల ఫలితాలు:
తేజస్వి యాదవ్ (రాఘోపూర్ నియోజకవర్గం): మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ రాఘోపూర్ నియోకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. సమీప బీజేపీ ప్రత్యర్థి సతీష్ కుమార్‌పై 38,174 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. 2015లో కూడా తేజస్వి యాదవ్ ఈ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. గతంలో తేజస్వి తండ్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ 1995, 2005 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
జితాన్ రామ్ మంజి (ఇమామ్ గంజ్ నియోజకవర్గం): బిహార్ మాజీ సీఎం, హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం) చీఫ్ జితాన్ రామ్ మంజి బిహార్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 76 ఏళ్ల జితాన్ ఆర్జేడీ అభ్యర్థి ఉదయ్ నరేన్ చైదరిపై 16,034 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జితాన్ 29,408 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.
శ్రేయాసి సింగ్ (జముయి నియోజకవర్గం): కామన్ వెల్త్ గేమ్స్-2018 స్వర్ణపతక విజేత, ఎస్ షూటర్ శ్రేయాసి సింగ్ బీజేపీ అభ్యర్థిగా బిహార్ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. మాజీ కేంద్ర మంత్రి దివంగత దిగ్విజయ్ సింగ్ కుమార్తె అయిన శ్రేయాసి సమీప ఆర్జేడీ అభ్యర్థి విజయ్ ప్రకాష్‌పై 41,049 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె అక్టోబర్ 4న బీజేపీలో చేరి జముయి ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల పోటీలో నిలిచారు.
అనంత కుమార్ సింగ్ (మోకామా నియోజకవర్గం): బిహార్‌లో ‘బాహుబలి’ నేతగా పిలువబడే అనంత కుమార్ సింగ్ మోకామా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన 35,750 ఓట్ల మెజార్టీతో సమీప జేడీయూ అభ్యర్థి రాజీవ్ లోచన్ నారాయణ్ సింగ్‌పై గెలుపొందారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు సన్నిహితంగా ఉండే అనంత 2015లో ఆర్జేడీలో చేరారు. ఇక ఆయన జేడీయూలో ఉన్నప్పుడు స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment