బీజేపీకే ఎందుకు పట్టంగట్టారు!? | Why People Are Still voting BJP! | Sakshi
Sakshi News home page

బీజేపీకే ఎందుకు పట్టంగట్టారు!?

Published Wed, Nov 11 2020 2:10 PM | Last Updated on Wed, Nov 11 2020 2:16 PM

Why People Are Still voting BJP! - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజంభణను అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గత మార్చి నెలలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల దేశంలో పౌర జీవనం పూర్తిగా స్తంభించి పోవడం, ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు కట్టుబట్టలతో కాలినడకన, సైకిళ్లు, దొరికిన వాహనాలపై ఇళ్లకు బయల్దేరి అష్టకష్టాలు పడిన విషయం తెల్సిందే. ఎర్రటి ఎండలను లెక్క చేయకుండా పిల్లా పాపలతో సొంతూళ్లకు బయల్దేరిన బడుగు జీవుల కష్టాలు నేటికి మన కళ్ల ముందు మెదలుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో దాదాపు వెయ్యి మంది ప్రజలు మరణించారు. (బీజేపీదే బిహార్‌)

దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా బిహార్‌ నుంచే ప్రజలు ఎక్కువగా వలసలు పోవడం, తిరుగు టపాలో వారే ఎక్కువగా కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. మరి అలాంటి రాష్ట్రంలో ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం ఏమిటా? అన్న ఆశ్చర్యం నేడు మేథావుల మెదళ్లను కూడా తొలుస్తోంది. బిహార్‌లో కాషాయ పార్టీకి 74 సీట్లు రావడం అంటే ఓటింగ్‌లో 20 శాతం వాటా వచ్చినట్లే. 243 స్థానాలు కలిగిన ఆ రాష్ట్రంలో బీజేపీకి 125 సీట్లతో అధికార పీఠాన్ని అప్పగించడమంటే మామూలు విషయం కాదు. అలాగే 11 రాష్ట్రాల పరిధిలోని 58 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ విజయఢంకా మోగిస్తుందని ఊహించిన వారూ తక్కువే. మధ్యప్రదేశ్‌లో 28కిగాను 19 సీట్లు, గుజరాత్‌లో ఎనిమిదికి ఎనిమిది, యూపీలో ఏడింట ఆరు, కర్ణాటకలో రెండింటికి రెండు సీట్లను కైవసం చేసుకున్న బీజేపీ, తెలంగాణలోని దుబ్బాక స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా భౌగోళికంగా కూడా విస్తరించింది. (ఆర్జేడీని కాంగ్రెస్సే ముంచిందా?)

ఎన్నికల్లో బిహార్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా బీజేపీ విజయఢంకా మోగించిందంటే లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రజలు తాము అనుభవించిన అసాధారణ కష్టాలకు అటు ప్రధాని నరేంద్ర మోదీనికానీ, బీజేపీగానీ బాధ్యులను చేయదల్చుకోలేదన్న విషయం స్పష్టం అవుతోంది. దేశ ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మైనస్‌ 23.9 శాతానికి (ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికానికి) పడిపోయినప్పటి వారు పార్టీనిగానీ, ప్రధానినిగానీ నిందించదల్చుకోలేదు. లాక్‌డౌన్‌ పట్ల ప్రజలు వ్యక్తం చేసిన భావాలను పరిగణలోకి తీసుకున్నా మనకు కాస్త వాస్తవ చిత్రం మననంలోకి వస్తుంది. లాక్‌డౌన్‌ చాలా కఠినంగా ఉందని, అసలు విధించాల్సిందికాదని లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ నిర్వహించిన సర్వేలో 43.7 శాతం మంది అభిప్రాయపడగా, లాక్‌డౌన్‌ కఠినంగా ఉన్న మాట వాస్తవమేనని, కరోనాను అరికట్టేందుకు మరింత కఠినంగా అమలుచేసి ఉండాల్సిందని 49.7 శాతం మంది అభిప్రాయపడ్డారు. (బిహార్‌లో విజయం సాధించిన ప్రముఖులు)

లాక్‌డౌన్‌ కారణంగా ఆహారం కోసం ఏదోరకంగా, ఎంతోకొంత ఇబ్బందులు పడ్డామని 90 శాతం మంది ప్రజలు చెప్పగా, తమకు ఎదురైన ఆర్థిక కష్టాల ముందు కరోనా మహమ్మారిని అంతగా పట్టించుకోలేదని, బతికుంటే బలిసాకు తిని బతకవచ్చనే ఆశతోనే సొంతూళ్లకు బయల్దేరి వచ్చామని 44.9 శాతం మంది వలస కార్మికులు తెలియజేశారు. వలస కార్మికుల పట్ల మోదీ ప్రభుత్వం అనుసరించిన వైఖరిని 72.8 శాతం మంది సమర్థించగా, వివిధ రాష్ట్రాలు అనుసరించిన వైఖరిని 76 శాతం మంది సమర్థించారు. అలాగే కరోనా కట్టడికి మోదీ తీసుకున్న చర్యలను 74.7 శాతం మంది ప్రజలు, రాష్ట్రాలు తీసుకున్న చర్యలను 77.7 శాతం మంది ప్రజలు సమర్థించారు. అంటే ‘కరోనా’కు సంబంధించిన ఏ అంశం కూడా ఎన్నికలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదని అర్థం అవుతోంది. (ఎకానమీ కోలుకుంటోంది కానీ..)

గతంలోకన్నా ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రాభవం పెరగడానికి కారణం ఏమిటీ? ‘పాలిటిక్స్‌ ఆఫ్‌ విశ్వాస్‌’ అని, నరేంద్ర మోదీ, బీజేపీ పట్ల ప్రజలకున్న నమ్మకమే ఎన్నికల్లో ప్రభావం చూపిందని ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త నీలాంజన్‌ సర్కార్‌ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎన్నో ఇక్కట్ల పాలైనప్పటికీ, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వచ్చినప్పటికీ 2019 ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడానికి ప్రజల విశ్వాసమే కారణమని ఆయన అన్నారు. హిందూ జాతీయవాదం పట్ల ఉన్న విశ్వాసం కూడా విజయానికి దోహదపడగా, మీడియా పట్ల బీజేపీకి ఉన్న పట్టు, సంస్థగతంగా ఆ పార్టీకున్న బలమైన యంత్రాంగం కూడా ఫలితాలను ప్రభావితం చేసిందని సర్కార్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement