
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఇతర రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వ్యయాన్ని 10 శాతం పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల సంఘంతో విస్తృతంగా చర్చించిన తర్వాత కేంద్ర న్యాయశాఖ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఎన్నికల్లో వ్యయ పరిమితిని మరో 10శాతం పెంచుతూ కొత్తగా ఉత్తర్వులు జారీచేసింది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇన్నాళ్లూ రూ.70 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. ఇప్పుడు దానిని రూ.77 లక్షలు చేశారు. అదే చిన్న రాష్ట్రాల లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే వారి ఖర్చుని రూ.54 లక్షల నుంచి రూ. 59 లక్షలకి పెంచారు.
ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుని రూ.28 లక్షల నుంచి రూ.30.8 లక్షలకి పెంచారు. చిన్న రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఉన్న రూ.20 లక్షల వ్యయం పరిమితిని రూ.22 లక్షలకి పెంచారు. కరోనా సంక్షోభం నేపథ్యంలోనే ఎన్నికల వ్యయ పరిమితిని పెంచినట్టుగా తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం 10శాతం వరకు ఎన్నికల వ్యయాన్ని పెంచుకోవడానికి సిఫారసు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
పోలింగ్ ముందు రోజు నుంచే రాజకీయ ప్రకటనలపై నిషేధం
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, వాల్మీకి లోక్‌సభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో పోలింగ్ రోజు, అంతకు ముందు రోజు అభ్యర్థులు ఎటువంటి రాజకీయ పరమైన ప్రకటనలు ఇవ్వకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324ని అనుసరించి ఎన్నికల కమిషన్ ఈ ప్రకటనలపై నిషేధం విధించింది. 2015 బిహార్ ఎన్నికల సందర్భంగా ఈసీ తొలిసారి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. పోలింగ్ రోజు, దానికి ముందు రోజు ప్రకటనల్ని శాశ్వతంగా నిషేధించాలన్న ప్రతిపాదనలు ఏళ్ల తరబడి న్యాయమంత్రిత్వ శాఖ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఎన్నికల సంఘం తనకున్న అధికారాలను ఉపయోగించి తాజాగా ఆదేశాలు జారీ చేసింది.