మహారాష్ట్ర, హరియాణాల్లో ఎన్నికల నగారా | Maharashtra, Haryana assembly elections full schedule | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర, హరియాణాల్లో ఎన్నికల నగారా

Published Sun, Sep 22 2019 3:30 AM | Last Updated on Sun, Sep 22 2019 11:30 AM

Maharashtra, Haryana assembly elections full schedule - Sakshi

ఎన్నికల షెడ్యూల్‌ వివరాలను వెల్లడిస్తున్న సీఈసీ సునీల్‌ అరోరా

సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో లోక్‌సభ, శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) షెడ్యూలు విడుదల చేసింది. దీంతోపాటు తెలంగాణలోని హుజూర్‌నగర్‌ శాసనసభ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల షెడ్యూలు విడుదలైన మరుక్షణం నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా మీడియాకు వెల్లడించారు.

ఈ రెండు రాష్ట్రాలకు ఒకే విడతలో ఎన్నికలు జరపనున్నట్లు ప్రకటించారు. కాగా, హరియాణాలోని 90 అసెంబ్లీ స్థానాల్లో 17 స్థానాలు షెడ్యూలు కులాలకు రిజర్వ్‌ అయి ఉన్నాయి. ఇక్కడ ఎస్టీ నియోజకవర్గాలేవీ లేవు. మహారాష్ట్రలో మొత్తం 288 నియోజకవర్గాలకు గాను 29 ఎస్సీ, 25 ఎస్టీ రిజర్వు అయి ఉన్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ 2014 నవంబరు 10వ తేదీన కొలువుదీరగా శాసనసభ కాల పరిమితి 2019 నవంబరు 9వ తేదీతో ముగియనుంది. అలాగే, హరియాణా శాసనసభ 2014, నవంబరు 3వ తేదీన కొలువుదీరగా 2019, నవంబరు 2న ముగియనుంది.

64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక
దేశవ్యాప్తంగా ఒక లోక్‌సభ స్థానం, వివిధ రాష్ట్రాల్లోని 64 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. ఎంపీ రామచంద్ర పాశ్వాన్‌ మరణించడంతో బిహార్‌లోని సమస్తిపూర్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. సమస్తిపూర్‌ లోక్‌సభ నియోజకవర్గంతో పాటు హుజూర్‌నగర్‌ సహా దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 64 శాసన సభ స్థానాలకూ అక్టోబరు 21న ఎన్నిక జరగనుంది. ప్రధానంగా కర్ణాటకలో 15, యూపీలో 11,  బిహార్, కేరళ రాష్ట్రాల్లో 5, అస్సాం, గుజరాత్‌లలో 4 చొప్పున స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో ఫిరాయింపు నిరోధక చట్టం పరిధిలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడంతో అక్కడ ఎక్కువ స్థానాల్లో ఉప ఎన్నిక జరుగుతోంది. ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గాల్లో ఎన్నికల నిబంధనావళి తక్షణం అమల్లోకి వస్తుంది.

సుప్రీంను ఆశ్రయిస్తాం: కర్ణాటక ఎమ్మెల్యేలు
సాక్షి, బెంగళూరు: ఎన్నికల సంఘం ప్రకటనపై అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు బెంగళూరులో మాట్లాడుతూ.. తమపై అనర్హత పిటిషన్‌ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా ఎన్నికలు జరపాలన్న ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఈసీ నిర్ణయంపై స్టే కోరుతామన్నారు. మొత్తం 17 మందిపై అనర్హత వేటు పడగా ఈసీ 15 స్థానాలకు మాత్రమే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడం గమనార్హం. మిగతా ఇద్దరి ఎన్నికకు సంబంధించిన పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున నిర్ణయం తీసుకోలేదని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా అన్నారు. వీరికి అనర్హత వేటు పడిన వారితో సంబంధం లేదని వివరించారు. జూలైలో కర్ణాటకలో జరిగిన వివిధ రాజకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజరు కావడంతో హెచ్‌డీ కుమారస్వామి  సంకీర్ణ ప్రభుత్వం కూలిపోగా, బీజేపీ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement