ఎన్నికల మేనిఫెస్టో ఒక పార్టీ రాజకీయ దృక్పథానికి, అది అనుసరించే విలువలకు, దాని దూర దృష్టికి ప్రతీకగా వుండాలి. కానీ ఇటీవలకాలంలో అది ఆచరణసాధ్యం కాని ఫక్తు వాగ్దానాల చిట్టాగా మిగిలిపోతోంది. సాధారణ సమయాల్లో ఎన్ని సంక్షోభాలు తలెత్తినా, జనం ఏమైపోయినా ధీర గంభీర మౌనాన్ని ఆశ్రయించే నాయకులు ఎన్నికలు ప్రకటించగానే వాగ్దానకర్ణులుగా మారిపోతారు. మేనిఫెస్టో రాసినప్పుడు వారి చేతికి ఎముక వుండదేమో... అందులో ఎక్కడలేని వాగ్దానాలూ వచ్చి కూర్చుంటాయి. ఇప్పుడు బిహార్ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. ఇవి కరోనా అనంతరం తొలిసారి జరుగుతున్న పూర్తి స్థాయి ఎన్నికలు గనుక... లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నెన్నో కడగండ్లు చవిచూసిన వలసజీవుల్లో అధికశాతంమంది ఆ రాష్ట్రవాసులే గనుక అందరి దృష్టీ సహజంగానే బిహార్‌పై పడింది.
ఇప్పటివరకూ వచ్చిన సర్వేలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్‌కుమారే ఇప్పటికీ మెరుగైన సీఎంగా జనం భావిస్తున్నారని చెబుతున్నాయి. ఆయన ప్రభ కాస్త తగ్గినా, కేంద్రంలో నరేంద్ర మోదీ సమర్థపాలన దానికి జవజీవాలు కల్పించిం దని, పర్యవసానంగా ఆ రెండు పార్టీల కూటమి మంచి మెజారిటీతో విజయం సాధిస్తుందని అంటు న్నాయి. మేనిఫెస్టోలు చూస్తే మాత్రం ఆ అభిప్రాయం కలగదు. అవి సమ్మోహనాస్త్రాలను తలపిస్తు న్నాయి. ఎలాగైనా ఓటర్లను లోబర్చుకోవాలన్న తృష్ణ కనబడుతోంది. ఏ పార్టీ మేనిఫెస్టో చూసినా వాటినిండా లక్షలాది ఉద్యోగాలు సునామీలా తోసుకొస్తున్నాయి. తాము ఎన్నికైతే పది లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని ఒకరంటే...19 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మరొకరు పోటాపోటీగా ప్రకటిస్తున్నారు.
ఈ క్రమంలో తాము అధికారంలో వున్నామన్న స్పృహ కూడా వుండటం లేదు. మరి ఇన్నేళ్లూ ఏం చేశారని ఓటర్లు నిలదీస్తారన్న భయాందోళనలు లేవు. బీజేపీ మేనిఫెస్టో మరొక అడుగు ముందుకేసింది. ‘మేం గెలిస్తే కరోనా టీకా ఉచితమ’ని బిహార్ వాసులను ఊరిస్తోంది. టీకాకు అను మతి రావడమే తరువాయి... దాన్ని ప్రజలందరికీ ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా చెప్పారు. కాబట్టి అది ఎప్పుడు వస్తుం దన్న సంగతలా వుంచితే... ఆ వాగ్దానం తీర్చడానికయ్యే వ్యయమెంతో కూడా ఆమెకు తెలిసే మాట్లాడారనుకోవాలి. అందుకు బదులు బిహార్‌తో సహా దేశమంతా ఆ టీకా ఉచితంగా ప్రజలకు అందించబోతున్నామని చెప్తే ఆచరణ మాటెలావున్నా కనీసం వినడానికి బాగుండేది. కేవలం బిహా ర్‌కు మాత్రమే అనడం వల్ల అది అనైతికమన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఉచితం మాటెలావున్నా నిపుణులు చెబుతున్న ప్రకారం టీకా రావడానికి ఇంకా చాన్నాళ్లు పట్టేలా వుంది. ఈలోగా సభలకొచ్చే జనాన్ని భౌతిక దూరం పాటించేలా చేయడంలో కూడా పార్టీలు విఫలమవుతున్నాయి. ఏ సభ చూసినా ఈ ఎన్నికల హోరుకు జడిసి కరోనా మాయమైందా అన్న సంశయం కలుగుతోంది.
ఏడెనిమిదేళ్లక్రితం పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలపై సుప్రీంకోర్టు విలువైన వ్యాఖ్యానం చేసింది. రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేలా హామీలు గుప్పించడం ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలన్న స్ఫూర్తిని దెబ్బతీయడమేనని దాని సారాంశం. 2011లో డీఎంకే, అన్నా డీఎంకేలు పోటాపోటీగా చేసిన వాగ్దానాలు చూసి, రోజురోజుకూ అవి శ్రుతిమించిన వైనం గమనించి చిర్రెత్తుకొచ్చిన తమిళనాడు వాసి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం ఆ వ్యాఖ్య చేసింది. కమ్మని వాగ్దానాలను కట్టు దాటించడంలో తెలుగుదేశం అధి నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరితేరారు. 2009 ఎన్నికల్లో ఇంటికొక కలర్ టీవీతో మొదలుపెట్టి ఎన్నిటినో ఉచితంగా ఇస్తానని ఊరించారు. అది ఏ స్థాయికి చేరిందంటే ఆయనకు అప్పట్లో ‘ఆల్ ఫ్రీ బాబు’ అన్న పేరు కూడా వచ్చింది. 2014లో ఆ పార్టీ మేనిఫెస్టో చేసిన వాగ్దానాలకు అంతులేదు. అవి ఏ స్థాయిలో వున్నాయంటే... నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలనాటికి ఆ మేనిఫెస్టో ఆచూకీ లేకుండా పోయింది. ఆన్‌లైన్‌లోగానీ, టీడీపీ కార్యాలయాల్లోగానీ అది ఎవరి కంటా పడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. మళ్లీ రంగంలోకి కొత్త వాగ్దానాలు గుదిగుచ్చి సరికొత్త మేనిఫెస్టో తీసుకొస్తే 2019లో జనం ఆ పార్టీని తిరస్కరించారు. అది వేరే కథ!
మన దేశంలో సార్వత్రిక వ్యాధి నిరోధక కార్యక్రమం కింద 12 రకాల వ్యాక్సిన్‌లు ఇప్పుడు ఉచితంగానే ఇస్తున్నారు. పోలియో నియంత్రణకిచ్చే టీకా ఉచితంగా లభించకపోతే దేశంనుంచి దాన్ని తరమడం ఇప్పటికీ సాధ్యమయ్యేది కాదు. ఆ మాదిరే కరోనా టీకా కూడా దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తామంటే బిహార్ వాసులు సంతోషించేవారు. దేశవ్యాప్తంగా బిహారీలు పనిచేస్తుంటారు గనుక ఈ దేశంలో తాము విడదీయరాని భాగమన్న స్పృహ వారికి దండిగావుంటుంది. అలాగే ఈ కరోనా మహమ్మారి విజృంభణ పర్యవసానంగా తమ కళ్లముందే అనేకులు రాలిపోతుండటం చూసి కుంగుబాటులోవున్న దేశ ప్రజలందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ వాగ్దానం ఎంతో ఊరటనిచ్చేది.
రేపో, మాపో అది రాబోతోందన్న భరోసా ఏర్పడేది. వాగ్దానం బిహారీలకు పరిమితమై వుండటం వల్ల ఇతరులకు అది ఉచితంగా లభించదేమోనన్న సంశయం కలుగుతుంది. కనీసం నితీష్‌కుమార్ ఆ వాగ్దానం చేసివుంటే ముఖ్యమంత్రిగా ఆయన బిహారీల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోదల్చుకున్నా రన్న అభిప్రాయం కలిగేది. ఎటూ నితీష్ ఎన్‌డీఏ భాగస్వామి గనుక ఆయన గెలుపు బీజేపీకి, నరేంద్రమోదీకి కూడా గెలుపే అవుతుంది. అలాగని ఉచిత వాగ్దానాలన్నిటినీ ఒకే గాటన కట్టాల్సిన అవసరం లేదు. సంక్షేమ రాజ్యం ఇరుసుగా పనిచేసే ప్రజాస్వామ్యంలో పేద వర్గాలకు ఉచితంగానో, సబ్సిడీతోనో అందుబాటులోకి తీసుకురావాల్సిందే. కానీ చేసే ఎలాంటి వాగ్దానమైనా బాధ్యతాయు తమైనదిగా వుండాలి. తాము ఇస్తున్న హామీలు ప్రజలకు ఎలాంటి సందేశం మోసుకెళ్తాయో గ్రహిం చాలి. అవి వారి ఉన్నతాశయానికి అద్దంపట్టాలి. వారి దూరదృష్టికి సంకేతంగా నిలవాలి.
Comments
Please login to add a commentAdd a comment