పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండో దశ పోలింగ్ నేడు ప్రారంభం అయ్యింది. 17 జిల్లాలోని 94 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు ఓటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓ యువతి పలువురు దృష్టిని ఆకర్షించింది. ఓటు వేయడం కోసం సదరు యువతి సైకిల్ మీద తన బామ్మతో కలిసి పట్నా పోలింగ్ కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఓటు హక్కు వచ్చిన తర్వాత మొదటిసారి దాన్ని వినియోగించుకున్నాను. మా బామ్మతో కలిసి ఓటు వేయడానికి వచ్చాను. భవిష్యత్తులో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తున్నాను’ అని తెలిపింది. (చదవండి: నితీష్‌కు ఇదే చివరి ఎన్నిక : చిరాగ్)
బిహార్ రెండో దశ అసెంబ్లీ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 17 జిల్లాల్లో విస్తరించి ఉన్న 94 అసెంబ్లీ స్థానాలకు నేడు (మంగళవారం) పోలింగ్ జరుగుతోంది. 94 స్థానాలకు 1,463 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. భద్రత దృష్ట్యా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. నేటి పోలింగ్‌లో 2.85 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వృద్ధులు, కోవిడ్ లక్షణాలున్నవారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్య చర్యలను పాటిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment