పట్నా: లోక్‌జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళల సంక్షేమమే లక్ష్యంగా బుధవారం పార్టీ ప్రణాళికను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ‘‘నా తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ పక్కన లేకుండా విలేకరులతో మాట్లాడటం ఇదే తొలిసారి. అడవిని చీల్చుకుంటూ పులి పిల్ల నెమ్మదిగా బయటకు వస్తుందని నాన్న ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. నేడు నేను అదే పని చేశాను. బిహార్ ఫస్ట్, బిహారీ ఫస్ట్ అనేదే మా సిద్ధాంతం.
4 లక్షల మంది ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుని రూపొందించిన మేనిఫెస్టో ఇది. విద్య, ఉద్యోగం కోసం పెద్ద ఎత్తున యువత రాష్ట్రాన్ని వీడి వెళ్తున్నారు. రాష్ట్రంలో అభవృద్ధి కార్యక్రమాలు కుంటుపడిన కారణంగా వలసలు చోటుచేసుకుంటున్నాయి. వాటిని నివారించి స్థానికులకే తొలి ప్రాధాన్యం ఇచ్చే విధంగా మేనిఫెస్టోలో పలు అంశాలు రూపొందించాం’’ అని పేర్కొన్నారు.(చదవండి: నా చెల్లెలు వంటిది, గెలిపించండి: చిరాగ్)
అదే విధంగా, ఉద్యోగార్థులు- సంస్థల మధ్య అనుసంధానం కోసం ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటు చేసి, నిరుద్యోగ సమస్యను పారద్రోలుతామని హామి ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కరువుకాటకాలు, వరదలు వంటి ప్రకృతి వైపరిత్యాలను తట్టుకుని నిలబడే విధంగా, కెనాళ్ల ద్వారా నదుల అనుసంధాన ప్రక్రియ చేపడాతమని చిరాగ్ పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత రాజస్తాన్‌లోని కోటా, ఢిల్లీలోని ముఖర్జీ నగర్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వంటి కోచింగ్ సిటీని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామన్నారు. (చదవండి: ‘పాదాలకు నమస్కరించినా పట్టించుకోలేదు’)
వీటితో పాటు లైబ్రరీలు కూడా ఏర్పాటు చేస్తామని, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఇక తాము అధికారంలోకి వస్తే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సహా గ్రామ పంచాయతి ప్రధాన కేంద్రాలు, మార్కెట్లతో పాటు ఇతరత్రా ప్రధాన బ్లాకులన్నింటిలో వారి కోసం ప్రత్యేకంగా టాయిలెట్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. కాగా ఈనెల 28న బిహార్‌లో తొలి విడత అసెంబ్లీ పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒంటరిగా బరిలోకి దిగిన ఎల్‌జేపీ నేడు మేనిఫెస్టో రిలీజ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment