lokjana shakti
-
స్పీకర్ నిర్ణయం: చిరాగ్‌కు భారీ షాక్...
న్యూఢిల్లీ: తన బాబాయి పశుపతి పరాస్‌ను లోక్‌సభలో పార్టీ పక్షనేతగా గుర్తిస్తూ స్పీకర్ ఓంబిర్లా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. చిరాగ్ పిటిషన్‌పై జస్టిస్ రేఖా పిళ్లై శుక్రవారం విచారణ జరిపారు. ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని చెప్పారు. నిజానికి చిరాగ్ పాశ్వాన్‌కు జరిమానా విధించాలని భావించామని, ఆయన తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు ఆ ఆలోచన విరమించుకున్నామని పేర్కొన్నారు. ఎల్జేపీ చీలిక వర్గం నాయకుడైన పశుపతి పరాస్‌ను లోక్‌సభలో ఆ పార్టీ పక్షనేతగా గుర్తిస్తూ స్పీకర్ జూన్ 14న సర్క్యులర్ జారీ చేశారు. -
ఎల్జేపీ: అసలు విషయం ఇదేనా.. అందుకే పశుపతి రాజీనామా?!
పట్నా/న్యూఢిల్లీ: ఇటీవల లోక్‌జనశక్తి పార్టీలో తిరుగుబాటు లేవనెత్తి ఆ పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నికైన ఎంపీ పశుపతి కుమార్ పరాస్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కనుందా... జేడీయూను ఎదిరించిన అన్న కొడుకు చిరాగ్ పాశ్వాన్‌ను నైతికంగా దెబ్బకొట్టినందుకు ఆయనకు అగ్రతాంబూలం దక్కనుందా.. అన్న ఊహాగానాలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పశుపతి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఎల్జేపీ పగ్గాలు ఎవరి చేతిలో ఉండాలన్న అంశంపై బాబాయ్- అబ్బాయ్ మధ్య వివాదం కొనసాగుతున్న వేళ.. ‘‘నేను కేంద్ర మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయగానే.. పార్లమెంటరీ పార్టీ నేతగా రాజీనామా చేస్తాను’’ అని పశుపతి పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీ ఇటీవల కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తుండటంతో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. గత గురువారం నుంచి ప్రారంభమైన సమావేశాల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఎన్డీయేలో భాగస్వామి అయిన ఎల్జేపీలో తిరుగుబాటు అనంతరం తాము ఇదే కూటమిలో కొనసాగుతామని పశుపతి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పశుపతి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. నితీశ్ కుమార్‌తో కలిసి ఆయన పావులు కదిపుతున్నారా అన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. మరోవైపు.. చిరాగ్ పాశ్వాన్ సైతం బీజేపీకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. పైగా ప్రధాని మోదీ రాముడు అయితే, తాను హనుమంతుడినంటూ గతంలో అభిమానం చాటుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఒకవేళ కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగితే పశుపతికి పదవి ఇస్తే బాగానే ఉంటుందని కొంతమంది స్థానిక(బిహార్) బీజేపీ నేతలు అభిప్రాయపడుతుండగా, మరో వర్గం మాత్రం చిరాగ్ పాశ్వాన్‌కే మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(2020) చిరాగ్ పాశ్వాన్ జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ, బీజేపీకి అనుకూల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు 35 స్థానాల్లో జేడీయూ సీట్లకు గండికొట్టగా.. ఆయా చోట్ల బీజేపీకి అనుకూల పవనాలు వీయడం గమనార్హం. ఇక తాజా పరిణామాలు, ప్రకటనలతో బిహార్ రాజకీయాలు ఒక్కసారిగా దేశమంతా చర్చనీయాంశమయ్యాయి. చదవండి: LJP: మత్తు ఇచ్చి నాపై లైంగికదాడి: ఆ ఎంపీపై సంచలన ఆరోపణలు ‘నువ్వు నా రక్తం కావు; ఇక మీ బాబాయ్ చచ్చిపోయాడు’ -
LJP: మత్తు ఇచ్చి నాపై లైంగికదాడి: ఆ ఎంపీపై సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ/పట్నా: లోక్‌జనశక్తి పార్టీలో తిరుగుబాటు జరిగిన నాటి నుంచి ఎంపీలు చిరాగ్ పాశ్వాన్, పశుపతి పరాస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అబ్బాయి వ్యవహారశైలి కారణంగానే.. ముఖ్యంగా పార్టీని పరిరక్షించేందుకే తాను మిగతా ఎంపీలతో బయటకు వచ్చానని బాబాయ్ చెబుతుంటే.. వెన్నుపోటు రాజకీయాలు చేశారని చిరాగ్ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈ కుట్ర వెనుక జేడీయూ హస్తం ఉందని, ప్రస్తుతం తమ పార్టీలో సంక్షోభానికి నితీశ్ కుమార్ వర్గం కారణమని ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనా తన కజిన్, ఎంపీ ప్రిన్స్‌రాజ్ పాశ్వాన్(రామ్‌విలాస్ పాశ్వాన్ సోదరుడు రామచంద్ర పాశ్వాన్ తనయుడు) సైతం తమ అంకుల్ పశుపతితో చేతులు కలిపి తనను ఒంటరి చేశారనే బాధ చిరాగ్‌ను వేధిస్తోందని ఆ కుటుంబ సన్నిహితులు అంటున్నారు. మత్తు ఇచ్చి అత్యాచారం.. ఈ పరిణామాల నేపథ్యంలో... ఓ కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రిన్స్‌రాజ్ పాశ్వాన్ తనపై లైంగిక దాడి చేశాడంటూ ఓ మహిళ కనాట్‌ప్లేస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. మూడు పేజీలతో కూడిన తన ఫిర్యాదులో.. ‘‘నా డ్రింక్‌లో మత్తుమందు కలిపి ప్రిన్స్‌రాజ్.. ఢిల్లీలోని ఓ హోటల్లో నాపై అత్యాచారం చేశారు’’ అని ఆమె ఆరోపించారు. ఇక ఈ విషయంపై స్పందించిన పోలీసులు.. ఈ ఘటనపై ఆరా తీస్తున్నామని, అయితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలిపారు.ఇదిలా ఉండగా.. అత్యాచార ఆరోపణల గురించి చిరాగ్ పాశ్వాన్ దృష్టికి రాగా.. తనకు పూర్తి వివరాలు తెలియదని, ఇరు వర్గాలను పోలీసులను సంప్రదించమని తాను సలహా ఇచ్చానని పేర్కొన్నట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. కాగా దివంగత కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆయన తనయుడు చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు-2020 సమయంలో జేడీయూకు వ్యతిరేకంగా అభ్యర్థులను బరిలోకి దింపి నితీశ్ కుమార్‌కు సవాల్ విసిరారు. అప్పటి నుంచి చిరాగ్, పశుపతి మధ్య తలెత్తిన విభేదాలు ముదిరి తిరుగుబాటుకు దారి తీసింది. ఇక ఈ ఎన్నికల్లో ఎల్జేపీ విఫలమైనప్పటికీ తన ఓట్ల శాతం మాత్రం పెరిగిందని చిరాగ్ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబాన్ని, పార్టీని కలిపి ఉంచేందుకు తను చేసిన ప్రయత్నాలు వృథా అయిపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మంచాన పడి ఉంటే.. వెన్నుపోటు పొడిచారు: చిరాగ్ పాశ్వాన్ ‘నువ్వు నా రక్తం కావు; ఇక మీ బాబాయ్ చచ్చిపోయాడు’ -
మంచాన పడి ఉంటే.. వెన్నుపోటు పొడిచారు: చిరాగ్ పాశ్వాన్
పట్నా/న్యూఢిల్లీ: లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ) జాతీయాధ్యక్ష పదవి నుంచి తనను తొలగించడం పూర్తిగా చట్టవిరుద్ధమని ఎంపీ చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఈ అంశంపై చట్టబద్ధ పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా దివంగత కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తనయుడైన చిరాగ్ పాశ్వాన్, బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఎల్జేపీలో తిరుగుబాటు జరిగిన విషయం తెలిసిందే. పశుపతి పరాస్ సహా ఐదుగురు ఎంపీలు చిరాగ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేశారు. ఈ నేపథ్యంలో లోక్‌సభలో ఎల్జేపీ నేతగా పరాస్‌ను ఎన్నుకోవడం.. ఈ విషయాన్ని స్పీకర్ ఓం బిర్లాకు తెలపడం.. పరాస్‌ను ఎల్జేపీ పక్షనేతగా గుర్తిస్తూ సోమవారం లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయడం వంటి పరిణామాలు శరవేగంగా జరిగిపోయాయి. ఈ క్రమంలో చిరాగ్‌ను జాతీయాధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ మంగళవారం ఎల్జేపీ ప్రకటన విడుదల చేయగా.. ఇందుకు స్పందించిన చిరాగ్.. తానే ఆ ఐదుగురు ఎంపీలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన చిరాగ్ పాశ్వాన్... ‘‘ఒకవేళ పశుపతి పరాస్ పార్లమెంటరీ నేతగా ఉంటానని నన్ను కోరితే ఎంతో సంతోషంగా అందుకు ఒప్పుకునేవాడిని. ఆయనను నాయకుడిని చేసేవాడిని. కానీ ఆయన అలా చేయలేదు. పైగా నన్ను పార్టీ పదవి నుంచి తొలగించడం పూర్తిగా చట్టవిరుద్ధం. ఈ విషయంపై పోరాడేందుకు నేను సిద్ధమవుతున్నా. నిజానికి దీనంతటి వెనుక జేడీయూ హస్తం ఉంది. తమకు వ్యతిరేకంగా గొంతెత్తే పార్టీలను విడగొట్టేందుకు వారు ఎంతకైనా తెగిస్తారు. గతకొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై చట్టపరంగా ముందుకు వెళ్తాం. ప్రస్తుత పరిస్థితికి జేడీయూనే ముఖ్య కారణం. ఏదేమైనా నేను రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడిని. సింహం బిడ్డను. కచ్చితంగా పోరాడి విజయం సాధిస్తాను’’అని చెప్పుకొచ్చారు. అదే విధంగా.. ‘‘నన్ను ఘోరంగా మోసం చేశారు. నిజానికి కొన్ని రోజులుగా నాకు ఆరోగ్యం బాగాలేదు. టైఫాయిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. నేను మంచాన పడి ఉన్న సమయంలో ఇలాంటి వ్యూహంతో నాకు వెన్నుపోటు పొడవడం నన్ను తీవ్రంగా బాధిస్తోంది. పార్టీని, కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచేందుకు నా శాయశక్తులా ప్రయత్నించాను. మా అమ్మ కూడా బాబాయ్‌తో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించింది. కానీ ఫలితం లేకుండా పోయింది. పరాస్‌ను నా తండ్రిలా భావించాను. కానీ ఆయన నా తండ్రి మరణించిన నాడే మాకు దూరంగా వెళ్లిపోయారు’’ అని చిరాగ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికలు-2020లో తమ పార్టీ పరాజయం గురించి మాట్లాడుతూ.. ‘‘అసెంబ్లీ ఎన్నికల సమయం నాకు అత్యంత కఠినమైనది.. అప్పుడే నాన్నను కోల్పోయాను. నా కుటుంబంతో సరిగ్గా సమయం గడిపే వీలు కూడా దొరకలేదు. శాసనసభ ఎన్నికల్లో ఎల్జేపీ బాగానే పనిచేసింది. మా పార్టీకి ఓటింగ్ శాతం 2 నుంచి 6 శాతానికి పెరిగింది’’ అని తన నాయకత్వాన్ని చిరాగ్ సమర్థించుకున్నారు. చదవండి: ‘నువ్వు నా రక్తం కావు; ఇక మీ బాబాయ్ చచ్చిపోయాడు’ -
తొలిసారి నాన్న లేకుండానే: చిరాగ్
పట్నా: లోక్‌జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళల సంక్షేమమే లక్ష్యంగా బుధవారం పార్టీ ప్రణాళికను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ‘‘నా తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ పక్కన లేకుండా విలేకరులతో మాట్లాడటం ఇదే తొలిసారి. అడవిని చీల్చుకుంటూ పులి పిల్ల నెమ్మదిగా బయటకు వస్తుందని నాన్న ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. నేడు నేను అదే పని చేశాను. బిహార్ ఫస్ట్, బిహారీ ఫస్ట్ అనేదే మా సిద్ధాంతం. 4 లక్షల మంది ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుని రూపొందించిన మేనిఫెస్టో ఇది. విద్య, ఉద్యోగం కోసం పెద్ద ఎత్తున యువత రాష్ట్రాన్ని వీడి వెళ్తున్నారు. రాష్ట్రంలో అభవృద్ధి కార్యక్రమాలు కుంటుపడిన కారణంగా వలసలు చోటుచేసుకుంటున్నాయి. వాటిని నివారించి స్థానికులకే తొలి ప్రాధాన్యం ఇచ్చే విధంగా మేనిఫెస్టోలో పలు అంశాలు రూపొందించాం’’ అని పేర్కొన్నారు.(చదవండి: నా చెల్లెలు వంటిది, గెలిపించండి: చిరాగ్) అదే విధంగా, ఉద్యోగార్థులు- సంస్థల మధ్య అనుసంధానం కోసం ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేసి, నిరుద్యోగ సమస్యను పారద్రోలుతామని హామి ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కరువుకాటకాలు, వరదలు వంటి ప్రకృతి వైపరిత్యాలను తట్టుకుని నిలబడే విధంగా, కెనాళ్ల ద్వారా నదుల అనుసంధాన ప్రక్రియ చేపడాతమని చిరాగ్ పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత రాజస్తాన్‌లోని కోటా, ఢిల్లీలోని ముఖర్జీ నగర్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వంటి కోచింగ్ సిటీని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామన్నారు. (చదవండి: ‘పాదాలకు నమస్కరించినా పట్టించుకోలేదు’) వీటితో పాటు లైబ్రరీలు కూడా ఏర్పాటు చేస్తామని, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఇక తాము అధికారంలోకి వస్తే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సహా గ్రామ పంచాయతి ప్రధాన కేంద్రాలు, మార్కెట్లతో పాటు ఇతరత్రా ప్రధాన బ్లాకులన్నింటిలో వారి కోసం ప్రత్యేకంగా టాయిలెట్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. కాగా ఈనెల 28న బిహార్‌లో తొలి విడత అసెంబ్లీ పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒంటరిగా బరిలోకి దిగిన ఎల్జేపీ నేడు మేనిఫెస్టో రిలీజ్ చేసింది. -
తెలంగాణలో లోక్‌జనశక్తిని విస్తరిస్తాం
► రాష్ట్ర ఏర్పాటులో పాశ్వాన్‌పాత్ర మరువలేనిది ► ఎఫ్‌సీఐ పునరుద్ధరణకు సైతం కృషి ► పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భీంరావు పెద్దపల్లి : తెలంగాణలోని అట్టడుగు వర్గాలను కలుపుకుపోతూ లోక్‌జనశక్తి పార్టీని విస్తరిస్తామని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇనుగాల భీంరావు తెలిపారు. పెద్దపల్లిలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో పేదరిక సమస్య పరిష్కారానికి పార్టీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నపుడు ఎఫ్‌సీఐ పునరుద్ధరణకు ఆయన చేసిన ప్రతిపాదనలే ఫలించాయన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సోనియాగాంధీ దృష్టికి ఇక్కడి పోరాటాన్ని తీసుకెళ్లి రాష్ట్ర ఏర్పాటుకు పాశ్వన్ విశేష కృషి చేశారన్నారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారన్నారు. సమావేశంలో మద్దెల ప్రశాంత్, గద్దల వినయ్ తదితరులు పాల్గొన్నారు.