LJP: మత్తు ఇచ్చి నాపై లైంగికదాడి: ఆ ఎంపీపై సంచలన ఆరోపణలు | LJP Coup Row Twist: Molestation Allegations Against Chirag Paswan Cousin | Sakshi
Sakshi News home page

మత్తు ఇచ్చి నాపై లైంగికదాడి: తిరుగుబాటు ఎంపీపై సంచలన ఆరోపణలు

Published Thu, Jun 17 2021 4:24 PM | Last Updated on Thu, Jun 17 2021 9:02 PM

LJP Coup Row Twist: Molestation Allegations Against Chirag Paswan Cousin - Sakshi

చిరాగ్‌ పాశ్వాన్‌తో ప్రిన్స్‌రాజ్‌(ఫైల్‌ ఫొటో: కర్టెసీ-పీటీఐ)

న్యూఢిల్లీ/పట్నా: లోక్‌జనశక్తి పార్టీలో తిరుగుబాటు జరిగిన నాటి నుంచి ఎంపీలు చిరాగ్‌ పాశ్వాన్‌, పశుపతి పరాస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అబ్బాయి వ్యవహారశైలి కారణంగానే.. ముఖ్యంగా పార్టీని పరిరక్షించేందుకే తాను మిగతా ఎంపీలతో బయటకు వచ్చానని బాబాయ్‌ చెబుతుంటే.. వెన్నుపోటు రాజకీయాలు చేశారని చిరాగ్‌ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈ కుట్ర వెనుక జేడీయూ హస్తం ఉందని, ప్రస్తుతం తమ పార్టీలో సంక్షోభానికి నితీశ్‌ కుమార్‌ వర్గం కారణమని ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనా తన కజిన్‌, ఎంపీ ప్రిన్స్‌రాజ్‌ పాశ్వాన్‌(రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ సోదరుడు రామచంద్ర పాశ్వాన్‌ తనయుడు) సైతం తమ అంకుల్‌ పశుపతితో చేతులు కలిపి తనను ఒంటరి చేశారనే బాధ చిరాగ్‌ను వేధిస్తోందని ఆ కుటుంబ సన్నిహితులు అంటున్నారు.

మత్తు ఇచ్చి అత్యాచారం..
ఈ పరిణామాల నేపథ్యంలో... ఓ కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రిన్స్‌రాజ్ పాశ్వాన్‌ తనపై లైంగిక దాడి చేశాడంటూ ఓ మహిళ కనాట్‌ప్లేస్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. మూడు పేజీలతో కూడిన తన ఫిర్యాదులో.. ‘‘నా డ్రింక్‌లో మత్తుమందు కలిపి ప్రిన్స్‌రాజ్‌.. ఢిల్లీలోని ఓ హోటల్‌లో నాపై అత్యాచారం చేశారు’’ అని ఆమె ఆరోపించారు. ఇక ఈ విషయంపై స్పందించిన పోలీసులు.. ఈ ఘటనపై ఆరా తీస్తున్నామని, అయితే ఇంతవరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని తెలిపారు.ఇదిలా ఉండగా.. అత్యాచార ఆరోపణల గురించి చిరాగ్‌ పాశ్వాన్‌ దృష్టికి రాగా.. తనకు పూర్తి వివరాలు తెలియదని, ఇరు వర్గాలను పోలీసులను సంప్రదించమని తాను సలహా ఇచ్చానని పేర్కొన్నట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది.

కాగా దివంగత కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ మరణం తర్వాత ఆయన తనయుడు చిరాగ్‌ పాశ్వాన్‌ ఎల్జేపీ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు-2020 సమయంలో జేడీయూకు వ్యతిరేకంగా అభ్యర్థులను బరిలోకి దింపి నితీశ్‌ కుమార్‌కు సవాల్‌ విసిరారు. అప్పటి నుంచి చిరాగ్‌, పశుపతి మధ్య తలెత్తిన విభేదాలు ముదిరి తిరుగుబాటుకు దారి తీసింది. ఇక ఈ ఎన్నికల్లో ఎల్జేపీ విఫలమైనప్పటికీ తన ఓట్ల శాతం మాత్రం పెరిగిందని చిరాగ్‌ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబాన్ని, పార్టీని కలిపి ఉంచేందుకు తను చేసిన ప్రయత్నాలు వృథా అయిపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

చదవండి: మంచాన పడి ఉంటే.. వెన్నుపోటు పొడిచారు: చిరాగ్‌ పాశ్వాన్‌

నువ్వు నా రక్తం కావు; ఇక మీ బాబాయ్‌ చచ్చిపోయాడు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement