సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని మహావికాస్ ఆఘడీ ప్రభుత్వంపై బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే కుప్పుకూలనుందని జోస్యం చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే మహారాష్ట్ర ప్రజలకు ప్రత్యామ్నాయం తామేనని అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ప్రభుత్వం త్వరలోనే పడిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కూటమిలోని మంత్రుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయిని, ఇలాంటి ప్రభుత్వం ఎక్కవ కాలం పరిపాలన కొనసాగించలేదని పేర్కొన్నారు. శివసేన సర్కార్ పడిపోయిన వెంటనే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామమని ఫడ్నవిస్ ధీమా వ్యక్తం చేశారు. (చదవండి:బిహార్ ఎన్నికల్లో ఎన్నో ‘సేలియెంట్ ఫీచర్స్’ )
గురువారం ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫడ్నవిస్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి సహాయం అందడం లేదు. ప్రతిపక్ష పార్టీగా రైతుల పక్షాన ఉంటూ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. బిహార్ ఎన్నికల ఫలితాలు కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఈ ప్రభావం చూపే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని’ వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిహార్ ఎన్నికల ఇంఛార్జ్‌గా ఫడ్నవిస్ బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. సీఎం నితీష్ కుమార్ పాలనకు ఆ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని అన్నారు. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించినప్పటికీ ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నమ్మి ప్రజలు బీజేపీకి ఓటేశారని, నితీష్ కుమార్ ఫాలోయింగ్ కూడా తమకు కలిసొచ్చిందని అన్నారు. బిహార్‌లో 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం వెలువడిన ఫలితాల్లో ఎన్డీయే 125 సాధించింది. అందులో బీజేపీకి 74, జేడీయూకు 43, వికాశిల్ ఇసాన్ పార్టీకి 4, హిందుస్తానీ అవాం మోర్చాకి 4 సీట్లు వచ్చాయి. ప్రత్యర్ధి మహాఘట్ బంధన్ కి 110 సీట్లు రాగా, వీటిలో ఆర్జేడీ 75 , కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలకు 16 సీట్లు సాధించాయి. ( చదవండి: ఫలితాలపై తేజస్వీ సంచలన ఆరోపణలు )
Comments
Please login to add a commentAdd a comment