దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. జేడీయూ అధినేత నితీష్ కుమార్‌ను కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ముందుగా ఇచ్చిన హామీకి కట్టుబడి నితీష్‌కే సీఎం పీఠం కట్టబెట్టేందుకు బీజేపీ పెద్దలు ఆమోదం తెలిపారు. దీంతో ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు నితీష్ కుమార్ సిద్ధమయ్యారు. గత 35 ఏళ్లుగా అసెంబ్లీ పోటీగా దూరంగా ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రిగా మాత్రం తన స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నారు. మూడు దశాబ్ధాలకు పైగా శాసనమండలికి ఎన్నికవుతూ.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తున్నారు.
పట్నా : నితీష్ కుమార్ ఇప్పటివరకు బిహార్ ముఖ్యమంత్రిగా ఆరుసార్లు ప్రమాణం చేశారు. 2000 (8 రోజులు), మరోసారి 11 రోజులు, 2005, 2010, 2015లో రెండుసార్లు ప్రమాణం చేశారు. 1977 లో తొలిసారిగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హర్నాట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓడిపోయారు. అనంతరం అదే స్థానం నుంచి 1985 లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఆరుసార్లు గెలిచారు. చివరగా 2004 లో నలంద పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి గెలిచారు. తొలిసారి 2000లో బిహార్ సీఎంగా ఎన్నికయినప్పటికీ ఎనిమిది రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత 2005లో మరోసారి సీఎంగా ప్రమాణం చేసే అవకాశం రావడంతో పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక అప్పటి నుంచి కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితమై.. బిహార్‌ను శాసిస్తున్నారు. తాజాగా ఏడోసారి సీఎంగా ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు.
2014-15లో తొమ్మిది నెలల స్వల్ప కాలం మినహా.. 2005 నవంబర్ నుంచి ఇప్పటి వరకు (2020) బిహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఏర్పడిన రాజకీయ విభేదాలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు సన్నద్దతలో భాగంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సమయంలో ఎస్సీ నేత జీతాన్‌రాం మాంజీ బిహార్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే మారిన రాజకీయ సమీకరణల కారణంగా నితీష్ కుమార్ 2015 లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పీఠం మరోసారి అధిష్టించారు. ఈ సారి ఎన్నికల్లో లాలూప్రసాద్‌తో పొత్తు పెట్టుకుని పూర్తిస్థాయి మెజార్టీ సాధించి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మరోసారి 2017 లో ఎన్డీయేతో మరోసారి జట్టుకట్టారు.
బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన బిహార్ అసెంబ్లీలోని ఏ సభలోనూ సభ్యుడు కాదు. దాంతో ఆయన పదవీకాలం ఎనిమిది రోజులు మాత్రమే కొనసాగింది. అప్పుడు ఆయన రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యే అవకాశం లేదు. 2005 నవంబర్‌లో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా ఆయన ఎమ్మెల్యే కాదు. ఆ తర్వాతి ఏడాది ప్రారంభంలో శాసనమండలికి ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా నితీష్ కుమార్ పదవీకాలం 2012 లో ముగియడంతో.. ఆయనను తిరిగి ఎగువ సభకు ఎన్నుకున్నారు.
‘తనకు ఎగువసభ అంటే అమితమైన గౌరవం, అందుకే ఎమ్మెల్సీగా ఉండటానికి ఇష్టపడతాను అంటూ నితీష్ పలు సందర్భల్లో చెప్పుకొచ్చారు. ఒక నియోజకవర్గంపై తన మొత్తం దృష్టిని పరిమితం చేయకూడదనుకుంటునానని, అందకే తాను అసెంబ్లీకి పోటీ చేయను అంటూ అని 2012 జనవరిలో శాసనమండలి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో నితీష్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుత ఆరేండ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికవుతాను అని నవ్వుతూ చెప్పారు. నితీష్ కుమార్ 2018 లో శాసనమండలికి వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2024లో ముగియనుంది. సీఎం పీఠాన్ని మార్చాలని బీజేపీ అనుకోకుంటే అప్పటి వరకు నితీష్ సీఎంగా కొనసాగనున్నారు.
బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయేకి 125 సీట్లు దక్కాయి. ఆర్జేడీ సారధ్యంలోని మహాకూటమికి 110 సీట్లకే పరిమితమైంది. ఎల్జేపీ 1, ఇతరులు 7 చోట్ల విజయం సాధించారు. పార్టీల వారీగా చూస్తే.. 75 సీట్లు గెలిచి ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 74 సీట్లు సాధించగా, జేడీయూ 43 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో విజయం సాధించింది. ఇక, సీపీఐఎంఎల్ 11, ఎంఐఎం 5, హెచ్ఏఎంఎస్ 4, వీఐపీ 4, సీపీఎం 3, సీపీఐ 2, ఎల్జేపీ ఒక స్థానంలో గెలిచాయి.
నితీష్ దారిలో ఠాక్రే, యోగీ..
కాగా నితీష్‌తో పాటు మరో రెండు రాష్ట్రాలకు సైతం ఇద్దరు సీఎంలు మండలి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. గోరఖ్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదు లోక్‌సభ ఎన్నికలలో గెలిచారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఎప్పుడూ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే, ఠాక్రే, యోగి ఆదిత్యనాథ్ ఇద్దరూ ఎగువసభ ద్వారా మొదటిసారి ముఖ్యమంత్రి కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment