పట్నా: బిహార్ ముఖ్యమంత్రి పీఠం యువనేతకు దక్కుతుందా? లేక ప్రస్తుత సీఎం, అధికార జేడీయూ–బీజేపీ కూటమి నేత నితీశ్ కుమార్(69)కే మళ్లీ సొంతమవుతుందా? అనే సందేహం నేడు పటాపంచలు కానుంది. నితీశ్ వయస్సులో సగం కంటే తక్కువగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)యువ నేత తేజస్వీయాదవ్(31) నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌కు అధికారం ఖాయమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో ఈ ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు 38 జిల్లాల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 55 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కాగా, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎమ్మెల్సీ కావడంతో ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు.
భారీగా బందోబస్తు
ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద 19 కంపెనీల కేంద్రసాయుధ బలగాల తోపాటు, రాష్ట్ర పోలీసులను బందోబస్తుకు ఏర్పాటు చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి హెచ్‌ఆర్ శ్రీవాస్తవ వెల్లడించారు. మంగళవారం ఉదయం పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతే ఈ స్ట్రాంగ్ రూంలను తెరుస్తామని చెప్పారు. కోవిడ్–19 మహ మ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో లెక్కింపు కేంద్రాల వద్ద గుమికూడ వద్దని రాజకీయ పార్టీల శ్రేణులకు ఆయన విజ్ఞప్తి చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీలకు కనెక్ట్ చేసిన డిస్‌ప్లే స్క్రీన్లను సీనియర్ అధికారులు పరిశీలిస్తూ అవసరమైన ఆదేశాలిస్తారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేంద్ర కుమార్ చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణకు మరో 59 కంపెనీ(వంద మంది చొప్పున)ల బలగాలను రంగంలోకి దించామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం పెద్ద సంఖ్యలో గుమి కూడకుండా నిషేధాజ్ఞలు విధించామన్నారు.
ఉప ఎన్నికల ఫలితాలు కూడా..
బిహార్‌లోని వాల్మీకినగర్ లోక్‌సభ స్థానం తోపాటు మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని 28 స్థానాలు, ఇతర పది రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెల్లడి కానున్నాయి.
రఘోపూర్‌పైనే అందరి కళ్లూ
రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 28వ తేదీ మొదలుకొని నవంబర్ 7వ తేదీ వరకు మూడు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సీట్లలో తేజస్వీ యాదవ్ మరోసారి ఎన్నికయ్యేందుకు బరిలో నిలిచిన వైశాలి జిల్లాలోని రఘోపూర్‌పైనే అందరి దృష్టీ ఉంది. గతంలో ఈ స్థానం నుంచి తేజస్వీ తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్ యాదవ్, రబ్రీదేవి పోటీ చేశారు. తేజస్వీ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సమస్తిపూర్ జిల్లా హసన్‌పూర్ నుంచి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పలువురు కేబినెట్ మంత్రుల భవితవ్యం తేలనుంది. వీరిలో ప్రముఖులు నంద్‌కిశోర్ యాదవ్(పట్నా సాహిబ్), ప్రమోద్ కుమార్(మోతిహరి), రాణా రణ్‌ధీర్(మధుబన్), సురేశ్ శర్మ(ముజఫర్‌పూర్), శ్రావణ్ కుమార్(నలందా), జైకుమార్ సింగ్(దినారా), కృష్ణనందన్ ప్రసాద్ వర్మ(జెహనాబాద్) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment