Results of Election
-
స్ట్రాంగ్ రూమ్‌లో అభ్యర్థుల భవితవ్యం.. మూడంచెల భద్రత (ఫొటోలు)
-
నేతల ఇలాకాల్లోనూ పరాభవమే
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ అసెంబ్లీ ఎన్నికల కంటే ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. 13 జిల్లాల్లో ఎక్కడా ప్రభావం చూపలేక చేతులెత్తేసింది. 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీల ఫలితాల్లో ఒక్కచోట (తాడిపత్రి) మినహా అన్నిచోట్లా మట్టికరిచింది. 11 కార్పొరేషన్లలో 9 చోట్ల సింగిల్ డిజిట్ డివిజన్లు, 75 మున్సిపాల్టీల్లో 58 చోట్ల సింగిల్ డిజిట్ వార్డులకే పరిమితమైందంటే టీడీపీ ఓటమి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సింగిల్ డిజిట్ నెంబర్లోనూ అనేక చోట్ల దక్కింది ఒకటి, రెండు వార్డులే. 12 మున్సిపాల్టీల్లో ఆ పార్టీ అసలు ఖాతా తెరవలేదు. చంద్రబాబు ఎన్నో ప్రగల్భాలు పలికి వ్యక్తిగత విమర్శలకు దిగినా ఈ ఎన్నికల్లో కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఎంత దుష్ప్రచారం చేసినా టీడీపీని రాష్ట్ర ప్రజలు ఏమాత్రం నమ్మడం లేదని మరోసారి స్పష్టమైంది. చంద్రబాబు చెప్పే మాటలు, చేసే పనులన్నీ మీడియా కోసమేనని, ఆయనకు ఏమాత్రం ప్రజాదరణ లేదని ఈ ఫలితాలు తేటతెల్లం చేశాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మున్సిపాల్టీల్లో సైకిల్ పల్టీ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సొంత మున్సిపాల్టీ తునిలో ఒక్క వార్డును కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని పెద్దాపురం, సామర్లకోట మున్సిపాల్టీల్లోనూ ఓటమి పాలైంది. ఎన్నో ఏళ్లుగా టీడీపీ గెలుస్తున్న, ప్రస్తుతం ఆ పార్టీ ఎమ్మెల్యే ఉన్న మండపేటలోనూ నెగ్గలేకపోవడం గమనార్హం. పశ్చిమ గోదావరిలో ఎన్నికలు జరిగిన నాలుగు మున్సిపాల్టీలకు గానూ ఒక్క చోట కూడా డబుల్ డిజిట్ వార్డులు సాధించలేకపోయింది. తూర్పు గోదావరిలో ఎన్నికలు జరిగిన పది మున్సిపాల్టీల్లోనూ సింగిల్ డిజిట్ వార్డులకే పరిమితమైంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని మున్సిపాల్టీల్లో టీడీపీ నామరూపాలు లేకుండాపోయింది. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ రేపల్లె మున్సిపాల్టీని గెలిపించుకోలేకపోయారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీని కాపాడలేకపోయారు. చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో టీడీపీ చతికిలపడింది. టీడీపికి చెందిన మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, అమర్నాథ్రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, గంటా శ్రీనివాసరావు, కాల్వ శ్రీనివాస్ తదితరులు సొంత నియోజకవర్గాల్లోని మున్సిపాల్టీల్లోనూ ప్రభావం చూపలేకపోయారు. డోన్, వెంకటగిరి, ధర్మవరం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, యర్రగుంట్ల, కనిగిరి, పులివెందుల, పిడుగురాళ్ల, మాచర్ల, పుంగనూరు మున్సిపాల్టీల్లో టీడీపీ గుడ్లు తేలేసింది. మొత్తంగా మున్సిపల్ ఎన్నికలు టీడీపీకి శరాఘాతంలా మారాయి. పార్టీ గుర్తు లేకుండా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తామే విజయం సాధించామని శ్రేణుల్ని మభ్యపుచ్చిన చంద్రబాబు అసలు రంగు ఈ ఎన్నికల్లో బయటపడిందని పేర్కొంటున్నారు. కర్నూలులో బడా నేతలకు షాక్ కర్నూలు(అర్బన్): టీడీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఒక వెలుగు వెలిగిన నేతలకు ప్రస్తుత మునిసిపల్ ఎన్నికల్లో ‘ఫ్యాన్’ షాక్ ఇచ్చింది. టీడీపీ హయాంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగిన కేఈ కృష్ణమూర్తి, ఆయన సోదరుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత టీజీ వెంకటేష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు నివాసాలు కర్నూలు నగరంలోని 49వ డివిజన్ పరిధిలో ఉన్నాయి. అయితే ఈ డివిజన్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కృష్ణకాంత్‌రెడ్డి విజయకేతనం ఎగురవేశారు. కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి నివాసముంటున్న 13వ డివిజన్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం.విజయలక్ష్మి విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి నివాసం ఉంటున్న 20వ డివిజన్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఏ నాగలక్ష్మిరెడ్డి గెలుపొందారు. నంద్యాలలో మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నివాసమున్న 10వ డివిజన్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి అబ్దుల్‌మజీద్ విజయం సాధించారు. ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నివాసమున్న 8వ డివిజన్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మోబీన్ గెలుపొందారు. ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి నివాసమున్న 27వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ రఘు గెలుపొందారు. సీపీఎం తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది. ఎవరూ నిరుత్సాహపడొద్దు మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో దారుణ పరాజయం నేపథ్యంలో ఆయన హైదరాబాద్ నుంచి ఈ ట్వీట్ చేశారు. రౌడీయిజం, బెదిరింపులు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలున్నా గట్టిగా పోరాడినట్టు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర భవిష్యత్తే లక్ష్యంగా ముందుకు సాగుదామని, ఇదే స్ఫూర్తితో పనిచేస్తే రానున్న రోజుల్లో విజయం మనదేనని తెలిపారు. పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని, కొన్ని చోట్ల ప్రాణాలు సైతం పణంగా పెట్టారని, అందరి పోరాట స్ఫూర్తికి వందనాలు తెలిపారు. -
ఫలితాలు నేడే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పురపాలక ఎన్నికల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఏలూరు నగర పాలక సంస్థ మినహా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించిన నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఆదివారం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరులో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రస్తుతం చేపట్టడం లేదు. ఓట్ల లెక్కింపు కోసం పురపాలక శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ చేపట్టిన 12 నగర పాలక సంస్థల్లోని 671 డివిజన్లలో 91 ఏకగ్రీవమయ్యాయి. దాంతో 580 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. వాటిలో ఏలూరులో ఎన్నికలు నిర్వహించిన 47 డివిజన్లలో ఓట్ల లెక్కింపు ప్రస్తుతం చేపట్టడం లేదు. మిగిలిన 533 డివిజన్లలో పోలైన ఓట్లను ఆదివారం లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్రంలో 71 పురపాలక సంఘాలు / నగర పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. వాటిలో పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని డివిజన్లు (మొత్తం 128) ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో కూడా 362 డివిజన్లు, వార్డులు ఏకగ్రీవమవడంతో మొత్తం ఏకగ్రీవ డివిజన్లు, వార్డుల సంఖ్య 490కు చేరింది. దాంతో ఎన్నికలు నిర్వహించిన మిగిలిన 1,633 డివిజన్లు, వార్డుల్లో పోలైన ఓట్లను ఆదివారం లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. పురపాలక శాఖ పటిష్ట ఏర్పాట్లు ఓట్ల లెక్కింపు కోసం పురపాలక శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు చేపట్టనున్న 11 నగర పాలక సంస్థల్లో మొత్తం 2,204 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 7,412 మంది కౌంటింగ్ సిబ్బంది, 2,376 మంది కౌంటింగ్ సూపర్వైజర్లను నియమించారు. ► ఓట్ల లెక్కింపు చేపట్టనున్న 71 పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 1,822 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 5,195 మంది కౌంటింగ్ సిబ్బంది, 1,941మంది కౌంటింగ్ సూపర్వైజర్లను నియమించారు. ► ఓట్ల లెక్కింపు టేబుళ్ల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొత్తం వీడియో తీయనున్నారు. ► ఓట్ల లెక్కింపు సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా డిస్కం అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా జనరేటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం విజయవాడలోని లయోలా కాలేజీలో చేసిన ఏర్పాట్లు రెండు గంటల్లో తొలి ఫలితాలు ► ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను, తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కిస్తారు. ► వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లను 25 చొప్పున కట్టలు కడతారు. ఒక్కో టేబుల్‌కు 40 ఓట్ల కట్టలు చొప్పున విభజించి ఓట్లు లెక్కింపు ప్రారంభిస్తారు. ► ఓట్ల లెక్కింపు వివరాలు ప్రకటించేందుకు పోలింగ్ కేంద్రాల్లో డిజిటల్ తెరలు ఏర్పాటు చేశారు. వార్డుల వారీగా, రౌండ్ల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు ఎప్పటికప్పుడు డిజిటల్ తెరలపై వెల్లడిస్తారు. ► ఓట్ల లెక్కింపు ప్రారంభమైన రెండు గంటలకు తొలి ఫలితాలు వెలువడతాయని అధికారులు భావిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి నగర పంచాయతీల తుది ఫలితాలు ప్రకటించగలమని చెబుతున్నారు. ► విశాఖపట్నం మినహా మిగిలిన అన్ని చోట్లా ఆదివారం సాయంత్రానికి ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. అత్యధికంగా 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నంలో తుది ఫలితాలు వెలువడేందుకు మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు. -
బిహార్ పీఠం కొత్త తరానిదేనా?
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి పీఠం యువనేతకు దక్కుతుందా? లేక ప్రస్తుత సీఎం, అధికార జేడీయూ–బీజేపీ కూటమి నేత నితీశ్ కుమార్(69)కే మళ్లీ సొంతమవుతుందా? అనే సందేహం నేడు పటాపంచలు కానుంది. నితీశ్ వయస్సులో సగం కంటే తక్కువగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)యువ నేత తేజస్వీయాదవ్(31) నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌కు అధికారం ఖాయమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో ఈ ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు 38 జిల్లాల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 55 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కాగా, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎమ్మెల్సీ కావడంతో ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. భారీగా బందోబస్తు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద 19 కంపెనీల కేంద్రసాయుధ బలగాల తోపాటు, రాష్ట్ర పోలీసులను బందోబస్తుకు ఏర్పాటు చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి హెచ్ఆర్ శ్రీవాస్తవ వెల్లడించారు. మంగళవారం ఉదయం పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతే ఈ స్ట్రాంగ్ రూంలను తెరుస్తామని చెప్పారు. కోవిడ్–19 మహ మ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో లెక్కింపు కేంద్రాల వద్ద గుమికూడ వద్దని రాజకీయ పార్టీల శ్రేణులకు ఆయన విజ్ఞప్తి చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీలకు కనెక్ట్ చేసిన డిస్ప్లే స్క్రీన్లను సీనియర్ అధికారులు పరిశీలిస్తూ అవసరమైన ఆదేశాలిస్తారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేంద్ర కుమార్ చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణకు మరో 59 కంపెనీ(వంద మంది చొప్పున)ల బలగాలను రంగంలోకి దించామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం పెద్ద సంఖ్యలో గుమి కూడకుండా నిషేధాజ్ఞలు విధించామన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు కూడా.. బిహార్‌లోని వాల్మీకినగర్ లోక్‌సభ స్థానం తోపాటు మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని 28 స్థానాలు, ఇతర పది రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెల్లడి కానున్నాయి. రఘోపూర్‌పైనే అందరి కళ్లూ రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 28వ తేదీ మొదలుకొని నవంబర్ 7వ తేదీ వరకు మూడు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సీట్లలో తేజస్వీ యాదవ్ మరోసారి ఎన్నికయ్యేందుకు బరిలో నిలిచిన వైశాలి జిల్లాలోని రఘోపూర్‌పైనే అందరి దృష్టీ ఉంది. గతంలో ఈ స్థానం నుంచి తేజస్వీ తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్ యాదవ్, రబ్రీదేవి పోటీ చేశారు. తేజస్వీ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సమస్తిపూర్ జిల్లా హసన్పూర్ నుంచి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పలువురు కేబినెట్ మంత్రుల భవితవ్యం తేలనుంది. వీరిలో ప్రముఖులు నంద్‌కిశోర్ యాదవ్(పట్నా సాహిబ్), ప్రమోద్ కుమార్(మోతిహరి), రాణా రణ్‌ధీర్(మధుబన్), సురేశ్ శర్మ(ముజఫర్‌పూర్), శ్రావణ్ కుమార్(నలందా), జైకుమార్ సింగ్(దినారా), కృష్ణనందన్ ప్రసాద్ వర్మ(జెహనాబాద్) ఉన్నారు. -
ఎన్నికల ఫలితాలు, గణాంకాలు కీలకం
బిహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ వారం మార్కెట్‌పై ఉంటుందని నిపుణులంటున్నారు. ఈ వారంలో వెలువడే పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు, ప్రపంచ రాజకీయ పరిణామాలు కూడా తగినంతగా ప్రభావం చూపుతాయని వారంటున్నారు. వీటితో పాటు డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ, కరోనా కేసులు, కరోనా టీకా సంబంధిత పరిణామాలు కూడా కీలకమేనని విశ్లేషకులంటున్నారు. చివరి దశకు క్యూ2 ఫలితాలు.... మూడు దశల్లో జరిగిన బిహార్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 10న(మంగళవారం) వెలువడతాయి. ఇక గురువారం (ఈ నెల 12న) సెప్టెంబర్ నెల పారిశ్రామికోత్పత్తి, అక్టోబర్ నెల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడతాయి. కంపెనీల ఆర్థిక ఫలితాలు చివరి దశకు వచ్చాయి. ఈ వారంలో మొత్తం 2,600 కంపెనీలు తమ తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. టాటా స్టీల్, ఓఎన్జీసీ, హిందాల్కో, హిందుస్తాన్ కాపర్, ఐడీఎఫ్సీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆయిల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ, అరబిందో ఫార్మా, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, గెయిల్ కంపెనీలు క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. కొత్త శిఖరాలకు స్టాక్ సూచీలు...! ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీని సూచిస్తున్నాయని, ఇది మార్కెట్‌కు ప్రతికూలాంశమని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకులు హేమాంగ్ జని పేర్కొన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడిగా జో బైడన్ గెలవడం సానుకూలాంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్ జోరుగా పెరిగితే ఈ వారంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త శిఖరాలకు ఎగబాకే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఐదు రోజుల్లో రూ.8,381 కోట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటివరకూ జరిగిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో రూ.8,381 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం, వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా రికవరీ అవుతాయనే అంచనాలు, డాలర్ బలహీనపడటం, కరోనా కేసులు తగ్గుతుండటం...ఈ కారణాల వల్ల విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు పెరుగుతోందని నిపుణులంటున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ.6,564 కోట్లు, డెట్ సెగ్మెంట్లో రూ.1,817 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. కాగా గత నెలలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ.22,033 కోట్లుగా ఉన్నాయి. అమెరికా ఎన్నికలు ముగిసినందున సెంటిమెంట్ మరింత స్థిరంగా ఉండనున్నదని విశ్లేషకులంటున్నారు. ఎమ్ఎస్సీఐ అంతర్జాతీయ సూచీల్లోని భారత షేర్లలో విదేశీ ఇన్వెస్టర్ల యాజమాన్య పరిమితుల పునర్వవ్యస్థీకరణ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని వారంటున్నారు. అక్టోబర్‌లో ఈక్విటీల నుంచి ఫండ్స్ భారీ ఉపసంహరణలు... వరుసగా ఐదోసారి ఈక్విటీల నుంచి మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) భారీ మొత్తాన్ని విత్‌డ్రా చేశాయి. అక్టోబర్ నెలలో రూ.14,344 కోట్ల మొత్తాన్ని ఉపసంహరించుకున్నాయి. దీంతో కలిపి జూన్ నుంచి ఎంఎఫ్‌లు ఉపసంహరణ చేసిన మొత్తం రూ.37,498 కోట్లు. ఫండ్ మేనేజర్లు రెస్క్యూ స్టాక్స్‌ను విక్రయించడమే విత్‌డ్రాకు ప్రధాన కారణం. ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య ఎంఎఫ్‌లు స్టాక్ మార్కెట్లో రూ.40 వేల కోట్ల పైనే పెట్టుబడులు పెట్టారని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) డేటా వెల్లడించింది. అమెరికా ఎన్నికలపై ఆందోళన, మందగించిన దేశీయ ఆర్థ్ధిక వ్యవస్థ వంటి కారణాలతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నిరంతర ప్రవాహాన్ని గమనించామని ఫినాలజీ సీఈఓ ప్రంజల్ కమ్రా తెలిపారు. అయితే ఆర్థ్ధిక సంవత్సరం ముగియనుండటం, మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగా మారుతుండటంతో ఇన్‌ఫ్లోలో పెరుగుదల కనబడుతోందని కమ్రా తెలిపారు. సెప్టెంబర్ త్రైరమాసికంలో ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ రూ.7,200 కోట్ల ఔట్‌ఫ్లో ఉందని, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) నుంచి ఔట్‌ఫ్లో తగ్గిపోయిందని తెలిపారు. ‘ ‘ఇది అనిశ్చితి కాలంలో కనిపించే ఒక సాధారణ ప్రక్రియ. క్రాష్ తర్వాత మార్కెట్లు కోలుకున్నప్పుడు, పెట్టుబడిదారులు బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్నప్పుడు ఉపసంహరణ సహజమని’’ గ్రోవ్ కో–ఫౌండర్ అండ్ సీఓఓ హర్‡్ష జైన్ అన్నారు. వ్యక్తిగతంగా ఎంఎఫ్‌లు విత్‌డ్రా చేసిన మొత్తం నెలల వారీగా చూస్తే.. సెప్టెంబర్‌లో రూ.4,134 కోట్లు, ఆగస్టులో రూ.9,213 కోట్లు, జూలైలో రూ.9,195 కోట్లు, జూన్‌లో రూ.612 కోట్లుగా ఉన్నాయి. మార్చిలో మార్కెట్ పతనం తర్వాత ఎంఎఫ్ ఇన్వెస్టర్లు తమ నికర ఆస్తి విలువ (ఎన్ఏవీ)లో గణనీయమైన నష్టాలను చవిచూశారు. ఎన్ఏవీలు కోలుకున్న తర్వాత తమ పెట్టుబడుల నుంచి నిష్క్రమించడం వల్లే ఉపసంహరణ జరగిందని క్వాంటమ్ ఏఎంసీ ఫండ్ మేనేజర్ నీలేష్ శెట్టి తెలిపారు. -
‘పరిషత్’పై పరేషాన్!
ప్రాదేశిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. తాజాగా వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కొన్ని పార్టీల్లో ఆశలు పెంచగా, మరికొన్నింటిలో మాత్రం నిరాశను మిగిల్చాయి. మొన్నటి అసెంబ్లీ నుంచి లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి ఓటరు నాడీ మారింది. ఆయా శాసనసభ సెగ్మెంట్ల పరిధిలో కొన్ని పార్టీలు గణనీయంగా ఓటర్ల సంఖ్యను పెంచుకోగా.. ఇంకొన్ని స్థానాల్లో అదే స్థాయిలో కోల్పోయాయి. ఈ పరిణామం ఇప్పుడు రాజకీయ పార్టీల నేతల్లో కలవరం పుట్టిస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత మూడు విడతలుగా జరిగిన ప్రాదేశిక పోరులో ఓటర్లు ఎటు వైపు జై కొట్టారో అంచనా వేయడంలో నేతలు తలమునకలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా తీర్పు ఉండనుందా.. లేదంటే లోక్‌సభ తరహాలో ఓట్ల బదలాయింపు జరిగిందా? అనే అంశాలపై విస్తృత స్థాయిలో రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోంది. దీని ద్వారా జెడ్పీ చైర్పర్సన్ స్థానంపై ఆశలు పెట్టుకుంటున్నారు. జిల్లాలో 248 ఎంపీటీసీ, 21 జెడ్పీటీసీ స్థానాలకు మూడు దశల్లో ఈ నెల 6, 10, 14 తేదీల్లో ప్రాదేశిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ మొదలైంది. బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం జూన్ రెండో వారంలో జరిగే ఓట్ల లెక్కింపుతో తేలనుంది. పోలింగ్ అనంతరం అభ్యర్థులు గ్రామాల వారీగా లెక్కలు వేసుకొని తమదే గెలుపు అని ధీమాగా ఉన్నారు. అభ్యర్థులు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడని వరకు విజయంపై ఎవరికి వారు భరోసాగా ఉన్నారు. అయితే, లోక్‌సభ ఫలితాల వెల్లడితో ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ రేసుల్లో ఉన్న ఆశావహులు మళ్లీ తమ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి.. తమకు అధ్యక్ష యోగం ఉందా లేదా అని పునః సమీక్షలోపడ్డారు. ఆందోళనలో గులాబీ నేతలు అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికల్లో జిల్లాలో టీఆర్ఎస్ సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో గులాబీ పార్టీ గెలుపొందినప్పటికీ ఓట్ల శాతం భారీగా తగ్గింది. టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి చేవెళ్ల స్థానం నుంచి స్వల్ప ఓట్లతో నెగ్గారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన ఐదు నెలల్లోనే జిల్లాలో టీఆర్ఎస్కు అమాంతంగా ఓట్ల సంఖ్య పడిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు అంతఃర్మథనంలో పడ్డాయి. పార్లమెంటు ఎన్నికలు ముగియగానే పరిషత్ ఎన్నికలు జరిగాయి. పార్లమెంటు ఎన్నికల్లో జిల్లా ఓటర్లకు టీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత వెల్లడైంది. ఇదే వ్యతిరేకత పరిషత్ ఎన్నికల్లో ఉందా లేదా అనే అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే.. లోక్‌సభ ఫలితాల్లో టీఆర్ఎస్ భారీగా ఓట్లను కోల్పోయింది. వీటి పరిధిలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లోనూ ఓటర్లు ఇదే తీర్పునకు కట్టుబడి ఉంటారా.. లేదా అని టీఆర్ఎస్ శ్రేణులు లెక్కలు వేస్తున్నాయి. ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే అనుకున్న స్థాయిలో పరిషత్‌లు దక్కకపోవచ్చన్న ఆందోళన నెలకొంది. మహేశ్వరం, కల్వకుర్తి సెగ్మెంట్లోకి మన జిల్లా నుంచి వెళ్లే నాలుగు మండలాల్లో టీఆర్ఎస్ కాస్త బలపడింది. ఒకింత ఇది నాయకులకు ఊరటనిచ్చే అంశమిది. హస్తంలో కొంత ఉత్సాహం అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కొంత బలపడినట్లు తెలుస్తోంది. చేవెళ్ల, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్‌కు మెజార్టీ రావడం కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇబ్రహీంపట్నంలో 8 వేల పైచిలుకు, చేవెళ్లలో ఇంచుమించు 16 వేల ఆధిక్యం రావడంతో స్థానిక సంస్థల ఫలితాలపై ఈ పార్టీలో అంచనాలు పెరిగాయి. లోక్‌సభ మాదిరిగా ట్రెండ్ కొనసాగితే జెడ్పీ స్థానం తమదేనన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే, షాద్‌నగర్, కల్వకుర్తిలో మాత్రం పరిస్థితి కొంతమేర దిగిజారిపోయింది. ముఖ్యంగా షాద్‌నగర్ సెగ్మెంట్లో 11 వేల మంది పైచిలుకు మంది ఓటర్లు దూరమయ్యారు. కమలదళంలో నూతనోత్తేజం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ కొండంత బలాన్నిచ్చాయి. ఈ ఎన్నికల్లో గణనీయంగా ఓట్ల సంఖ్య పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో మండల, జిల్లా ప్రాదేశిక స్థానాలపై ఆ పార్టీలో ఆశలు చిగురిస్తున్నాయి. కనీసం నాలుగు జెడ్పీటీసీల్లోనైనా నెగ్గుతామన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మహేశ్వరం, చేవెళ్ల, షాద్‌నగర్‌లో గణనీయంగా ఓటు బ్యాంకును పెంచుకుంది. ముఖ్యంగా షాద్‌నగర్ సెగ్మెంట్లో అసెంబ్లీతో పోల్చితే ఏకంగా 35 వేల ఓట్లు అధికంగా ఈ పార్టీకి దక్కడం విశేషం. అయితే, మరోపక్క కల్వకుర్తిలో గణనీయంగా ఓట్లు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ 62 శాతం ఓట్లను పోగొట్టుకుంది. వచ్చే నెలలో ఫలితాలు! మండల, జిల్లా పరిషత్ ఓట్ల లెక్కింపు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న జరగాల్సి ఉంది. రాజకీయ పార్టీల నాయకుల అభ్యర్థన మేరకు లెక్కింపును వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జూన్ మొదటì, లేదా రెండో వారంలో పరిషత్ ఓట్ల లెక్కిపు నిర్వహించనున్నట్లు తెలిసింది. కానీ తేదీని మాత్రం అ«ధికారికంగా ప్రకటించలేదు. అయితే, లెక్కింపును వాయిదా వేయడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. -
అందరి చూపు.. బందరు వైపు!
సాక్షి, మచిలీపట్నం: సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపునకు సమయం ఆసన్నమైంది. రాజకీయ పార్టీల నేతలు, ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో బందరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ, ఏలూరు పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఈనెల 23న బందరులోని కృష్ణా యూనివర్సిటీలో జరగనుంది. కౌంటింగ్‌కు ముందురోజే జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి అటు అధికారులు, ఇటు సిబ్బంది.. ఇటు అన్ని పార్టీల నేతలు, వారి అనుయాయులు సిద్ధమవుతున్నారు. దీంతో బందరులో వీరి వసతి ఏర్పాట్ల వ్యవహారం పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. అధికారులకు సంబంధించి ఇప్పటికే ఈ ఏర్పాట్లు పూర్తి కాగా.. పార్టీలపరంగా ఎవరికి వారు తమతో వచ్చేవారి కోసం వసతి సౌకర్యానికి మల్లగుల్లాలు పడుతున్నారు. విందు కోసం ఆయా పార్టీల కార్యాలయాలల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. లాడ్జీలన్నీ ఫుల్! బందరులో కౌంటింగ్ జరగనున్న 9 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు బందరులో ఒక రోజు ముందుగానే మకాం వేసేందుకు సిద్ధం అవుతున్నారు. వీరితో పాటు అనుచరులను సైతం వెంటబెట్టుకుని రానుండటంతో ఏసీ గదులున్న లాడ్జిలు ఏమున్నాయని వెతుకులాటలో కొందరు పడగా.. మరి కొందరు మాత్రం ఇప్పటికే గదులు రిజర్వు చేసుకున్నారు. బందరు పట్టణంలో సుమారు 10 లాడ్జీలు ఉన్నాయి. వాటి పరిధిలో 250 నుంచి 300ల వరకు గదులు అందుబాటులో ఉన్నాయి. రూ.100 నుంచి రూ.5000ల వరకు ధర పలుకుతున్నాయి. అయినా డబ్బుకు ఎవరూ వెనకాడటం లేదు. దీంతో ఈనెల 22, 23వ తేదీల్లో అన్ని లాడ్జిల్లోని గదులన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి. విందులు.. చిందులు! ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం తమ అనుచరులకు విందు ఏర్పాటు చేసేందుకు సైతం ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఆయా పార్టీల కార్యాలయాల్లో కొందరు, లాడ్జీల్లో కొందరు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. గెలిచిన అభ్యర్థులను జిల్లా కేంద్రం నుంచి తమ నియోజకవర్గం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. లెక్కింపునకు ఏర్పాట్లు.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో ముఖ్య అధికారులకు ఎన్నికల ఓట్ల లెక్కింపుపై జరిగింది. అంతేగాక అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు సైతం శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై వారికి అవగాహన కల్పించారు. నిబంధనలపై ప్రశ్నావళి ఇచ్చి వారి అవగాహన స్థాయిని అంచనా వేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అక్కడి పరిస్థితులను బట్టి కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లకు ఒక టేబుల్‌ను కేటాయిస్తున్నారు. -
నాయకులు @ బెజవాడ
సాక్షి, అమరావతి బ్యూరో : కౌంటింగ్‌కు కేవలం మూడు రోజులు మాత్రమే గడువుంది. పోలింగ్‌కు కౌంటింగ్‌కు 43 రోజుల సుధీర్ఘ విరామం రావడంతో అందరి దృష్టి ఫలితాలపై పడింది. గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తిని ఈ ఎన్నికలు రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోనూ అలాగే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.? ఏ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమవుతుంది అనే కుతూహలం అందరిలోనూ ఏర్పడింది. విజయవాడలో మకాం.. మే 23న కౌంటింగ్ 8 గంటలకే ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్లు ఉదయం 5 గంటలకే అక్కడికి చేరుకోవాల్సి ఉంది. దీంతో ఆయా రాజకీయ పార్టీలు ఏజెంట్లను ఇతర పార్టీ నాయకులు అపహరించకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మూడురోజుల ముందు నుంచి వారికి సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. జిల్లాకు సంబంధించి మచిలీపట్నం పార్లమెంట్‌కి సంబంధించి కృష్ణా యూనివర్సిటీలో, విజయవాడ పార్లమెంట్‌కు పెనమలూరులోని ధనేకుల ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. లాడ్జీలు, హోటళ్లలో గదులు నిల్.. నాయకులు వారి అనుచరులు, పార్టీ కార్యకర్తలు కౌంటింగ్ రోజు విజయవాడలో ఉండేట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలైన వైఎస్సార్ సీపీ, టీడీపీ కార్యాలయాలు ఇక్కడే ఉండడంతో ఇప్పటికే కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు విజయవాడకు చేరుకున్నారు. నగరంలోని లాడ్జీలు, హోటళ్లు, పలు గెస్ట్ హౌస్‌లు ముందస్తు బుకింగ్ చేసుకున్నారు. ఎన్నికల ఫలితాలకు శుభకార్యాలు తోడవడంతో లాడ్జీల యజమానులు పండుగ చేసుకుంటున్నారు. పనిలో పనిగా డిమాండ్ భారీగా ఉండడంతో అద్దెలు కూడా పెంచేస్తున్నారు. పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లలోని కాన్ఫరెన్స్ హాళ్లలో పెద్ద పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. స్నేహితులంతా ఒక చోట చేరి ఫలితాలు వీక్షించేందుకు అనువుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే పందెం రాయుళ్లు కూడా ఫలితాల వీక్షణపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, యువకులు, రైతులు, వ్యాపారస్తులు ఇలా అన్ని వర్గాల వారు ఫలితాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. పండుగ చేసుకునేందుకు.. కౌంటింగ్ పూర్తయ్యి మధ్యాహ్నం రెండు గంటల సమయానికి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో స్పష్టంగా తెలియనుంది. అలాగే కేంద్రంలో ఏ పార్టీ అధికారం హస్తగతం చేసుకుంటుందో వెల్లడికానుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు గెలుపు సంబరాలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
టీడీపీలో టెన్షన్...టెన్షన్
సాక్షి, కడప: జమ్మలమడుగు నియోజవర్గం టీడీపీకి 1983 నుంచి 2004 వరకు కంచుకోటగా నిలిచింది. వరుసగా ఐదు పర్యాయాలు పొన్నపురెడ్డి కుటుంబీకులకు మద్దతుగా ప్రజలు నిలిచారు. ఆ కుటుంబ ప్రత్యర్థులుగా ఉన్న దేవగుడి కుటుంబం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అండదండలతో 2004లో విజయకేతనం ఎగురవేసింది. వైఎస్ కుటుంబం నీడలో వరుసగా మూడుసార్లు విజయం సాధించినా 2016లో టీడీపీ చెంతకు చేరిపోయింది. ఆపై టీడీపీలో మంత్రి పదవిని దక్కించుకుంది. అప్పటి వరకూ జమ్మలమడుగులో ప్రత్యక్షంగా వైరివర్గీయులుగా ఫ్యాక్షన్‌కు ఆధ్యులుగా నిలిచిన ఆ రెండు కుటుంబాలు ఎన్నికల్లో ఏకమయ్యాయి. ప్రజలు వీరి కలయికను ఏవగించుకుకున్నా, తమకు ఎదురులేదని, తమ కుటుంబాలు ఒక్కటయ్యాక ఓడించే సత్తా ఎవ్వరికీ లేదని వారు ప్రగల్బాలు పలికారు. పోలింగ్ సందర్భంగా వారి అంచనాలు తలకిందులయ్యాయి. దేవగుడి, గుండ్లకుంట కుటుంబాలకు ఊహాలు పటాపంచలైయ్యాయి. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ ఏజెంట్లు నిలవరని భావించిన ఆ రెండు కుటుంబాలకు చేదు అనుభవం ఎదురయ్యింది. వేగంగా మారిన రాజకీయ సమీకరణలు..... వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన దేవగుడి ఆదినారాయణరెడ్డి ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. వైరివర్గంగా ఉన్న గుండ్లకుంట రామసుబ్బారెడ్డి ఈయన చేరికను తీవ్రంగా అడ్డగించి విఫలమయ్యారు. ఇరువురు ఏకమయ్యాక జమ్మలమడుగులో తమకు ఎదురే లేదని వారు భావించారు. ప్రజాజీవితంలో మమేకమైన డాక్టర్ మూలే సుధీర్‌రెడ్డికి 2016లో వైఎస్సార్సీపీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. ఆపై వైఎస్ కుటుంబం జమ్మలమడుగుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దానికి తోడు ఆ పార్టీ ప్రవేశపెట్టిన ‘గడపగడపకుౖ వెఎస్సార్’, ‘రావాలి జగన్... కావాలి జగన్’ కార్యక్రమాలతో ప్రజల మధ్యకు వెళ్లారు. నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. క్రమేపీ రాజకీయ సమీకరణలు మారిపోయాయి. టీడీపీనాయకులు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలకు సుధీర్ దీటుగా నిలిచారు. వారి ఎత్తుగడలను పసిగడుతూ నిర్ణయాలు తీసుకోసాగారు. రోజురోజుకూ పార్టీని బలోపేతం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఆ రెండు కుటుంబాల వారు కలిసికట్టుగా ప్రచారం నిర్వహించడంపై ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పటి వరకూ ఫ్యాక్షన్ మూలంగా ఎందరో ప్రాణాలు కోల్పోవడం, ఫ్యాక్షన్‌ను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సహించిన చరిత్రవారికే ఉండడమే అందుకు కారణం. ఈ పరిస్థితుల మూలంగా టీడీపీ నాయకులు ప్రవర్తన పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతూ వ చ్చింది. అప్పటివరకూ ఏకపక్షంగా పోలింగ్ నిర్వహిస్తున్న గ్రా మాల్లో పోలింగ్ ఏజెంట్లును ఏర్పాటు చేయడం వైఎస్సార్సీపీ కి అదనపు బలం చేకూరిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆ రెండు మండలాలపై బేరిజు... నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ప్రధాన భూమిక పొషించేవి జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మండలాలే. ఈ రెండు మండలాల్లో లక్షా ఇరవైవేల ఓట్లు ఉన్నాయి. యర్రగుంట్ల డాక్టర్ సుధీర్‌రెడ్డికి సొంత మండలం. దీంతో ఆయన దృష్టింతా జమ్మలమడుగుపై పెట్టారు. పోలింగ్ సందర్భంగా 85.40శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎవరు ఎవరికి ఓటు వేశారో అన్న సందేహాలు నాయకుల్లో వ్యక్తం అవుతున్నాయి. జమ్మలమడుగు రూరల్ మండలంలో టీడీపీ అంచనాలు తలకిందులయ్యాయి. రెండు దశాబ్దాలుగా పోలింగ్‌కు అవకాశం లేకుండా ఏకపక్షంగా నిర్వహించే ఓటింగ్‌కు కట్టడి ఏర్పడింది. ప్రజలు స్వేచ్ఛగా ఓటేశారు. ఈ పరిస్థితి టీడీపీకి మింగుడుపడటం లేదు. మున్సిపాలిటిలో టీడీపీకి మెజార్టీ వచ్చిన దాఖలాలు లేవు. దేవగుడి, గుండ్లకుంట వర్గీయులు ఏకమైనా అక్కడ వైఎస్ కుటుంబాన్ని అభిమానించే వారు ఎక్కువగా ఉన్నారు. పైగా జమ్మలమడుగులో వైఎస్ వైద్యునిగా సేవలు అందించారు. సామాన్య ప్రజానీకం వైఎస్సార్సీపీ వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయని పలువురు వివరిస్తున్నారు. టీడీపీ నాయకులు మాత్రం ఈసారి మెజార్టీ తమకే వస్తుందని అంచనాల్లో మునిగితేలుతున్నారు. ఎర్రగుంట్ల మండలంలో వైఎస్సార్సీపీ మెజార్టీ గణనీయంగా ఉంటోందని టీడీపీ నేతలే స్వయంగా వివరిస్తున్నారు. ఈ రెండు మండలాలల్లో టీడీపీ అంచనాలు తలకిందులు కావడంతో ఆ పార్టీ నేతలల్లో ఫలితంపై టెన్షన్ నెలకొందని భావిస్తున్నారు. బెట్టింగ్‌ల జోరు... జమ్మలమడుగులో వైఎస్సార్సీపీ గెలుస్తుందంటూ భారీగా బెట్టింగ్‌లు కాస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొంది. ఎన్నికలకు ముందు టీడీపీ గెలుస్తుం దంటూ బెట్టింగ్‌లు నిర్వహించగా ఆ తర్వాత బెట్టింగ్ నిర్వాహకులు వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపారు. జమ్మలమడుగుపై రకరకాలు బెట్టింగులు తెరపైకి వచ్చాయి. జమ్మలమడుగు మండలం కంటే యర్రగుంట్ల మండలంలో వైఎస్సార్సీపీకి అధికంగా ఓట్లు వస్తాయని, పెద్దముడియం మండలంలో వైఎస్సార్సీపీ ఒక్క ఓటైనా అధికంగా సాధిస్తుందని, గెలుపు వైఎస్సార్‌సీపీదేనని ఇలా రకరకాలు తెరపైకి వచ్చాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ కాస్త ఢీలా పడినా గెలుస్తామనే ధీమాను ప్రదర్శిస్తుంటే, వైఎస్సార్సీపీ నాయకులు మాత్రం తమకు యువత, వృద్దులు, దళితులు, మైనార్టీలు, రైతులు ఓట్లుతో పాటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కలిసివచ్చిందని జోష్ మీదున్నారు. ఇవన్నీ కాకుండా ఆ రెండు కుటుంబాలు కలిసికట్టుగా ప్రచారం నిర్వహించడం కూడా అదనపు ప్రయోజనమే అయ్యిందని వారు పేర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జమ్మలమడుగు ఫలితంపై చర్చ కొనసాగడం విశేషం. -
మెజార్టీ గీతకు దగ్గరలో బీజేపీ..!
ఏడు దశల సార్వత్రిక ఎన్నికల ఘట్టం చరమాంకానికి చేరింది. ఇంకో రెండు రోజుల్లో 59 లోక్‌సభ స్థానాలకు తుది దశ ఎన్నికలు జరగనున్నాయి! మే 23న జరిగే కౌంటింగ్‌తో ఏ పార్టీ భవితవ్యం ఏమిటో స్పష్టం కానుంది కూడా. అయితే ఇప్పటికే పోలింగ్ పూర్తయిన 480 పైచిలుకు స్థానాల ఓటింగ్ సరళిని గమనిస్తే.. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటర్ల నాడి పసిగట్టడం కష్టమైనప్పటికీ.. వచ్చిన స్పందనలు అరకొరగానే ఉన్నప్పటికీ ఎన్డీయే కూటమి ప్రభుత్వ పనితీరు, ప్రజాదరణ సూచీల్లో నేతల రేటింగ్స్, ఓటర్లపై సంక్షేమ పథకాల ప్రభావం వంటి అంశాలను పరిగనలోకి తీసుకుంటే విజేత ఎవరన్నది చూచాయగానైనా స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో దేశంలోని భిన్న ప్రాంతాల తీరుతెన్నులు ఎలాగున్నాయంటే...? దక్షిణాదిలో కాషాయానికి ఒక్క రాష్ట్రంలోనే ఆసరా... గత ఎన్నికల్లో దక్షిణాది మొత్తానికి బీజేపీ ఎక్కువగా లాభపడిన రాష్ట్రం కర్ణాటక మాత్రమే. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 112 లోక్‌సభ స్థానాలు ఉండగా.. కేవలం 21 మాత్రమే దక్కించుకోగలిగింది కాషాయ పార్టీ. ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అంచుల్లో ఉన్న అంచనాలు బలపడుతున్న తరుణంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నెపం ఈవీఎంలపై నెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్డీయే నుంచి బయటకు రావడం, పవన్ కల్యాణ్ జనసేన పార్టీ జట్టు కట్టేందుకు నిరాకరించడంతో ఢిల్లీలో చక్రం తిప్పుదామనుకున్న చంద్రబాబు ఆశలకూ గండిపడినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి పదవి రేసులో తాను లేనని ప్రకటించడం ద్వారా బాబు తన ఓటమిని పరోక్షంగా అంగీకరించినట్లయింది. ఈ నేపథ్యంలో అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ ఎన్నికల్లోనూ వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ విజయ దుందుభి మోగించనుందని స్పష్టమవుతోంది. ఇంకో పార్టీ మద్దతుతో తన ఉనికిని చాటుకోవాల్సిన అవసరం ఏర్పడటం బీజేపీకి కేవలం తమిళనాడులోనే కనిపిస్తుంది. ద్రవిడ దిగ్గజాలు జయలలిత, కరుణానిధిల మరణం తరువాత జరుగుతున్న తొలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తోపాటు కొన్ని చిన్న పార్టీలతో జట్టు కట్టడం ద్వారా డీఎంకే కొంత అడ్వాంటేజ్ సాధించిందని చెప్పాలి. మరోవైపు బీజేపీ ఏఐఏడీఎంకే, చిన్నా చితకా పార్టీలతో కూటమి ఏర్పాటు చేసుకుంది. ఈ రెండు కూటములను సినీనటుడు కమల్‌హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం, టీటీవీ దినకరన్ పార్టీ ఏఎంఎంకేలు సవాలు చేస్తున్నాయి. అయితే పోలింగ్ సరళిని బట్టి చూస్తే డీఎంకే కూటమికి ఎక్కువ సీట్లు లభించే అవకాశం కనిపిస్తోంది. కానీ ఏఐఏడీఎంకే కూటమి కూడా చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయం సాధించవచ్చు. బీజేపీ దక్షిణాదిలో అడుగుపెట్టేందుకు వేదికగా నిలిచిన కర్ణాటకలో ఈసారి కూడా ఆ పార్టీ గణనీయమైన సంఖ్యలో స్థానాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ జేడీఎస్ కూటమిలోని లుకలుకలు బీజేపీకి కలిసి వచ్చే అవకాశముంది. ఇరు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు ఎంత సమర్థంగా జరిగిందన్న అంశంపై బీజేపీ సాధించబోయే సీట్ల సంఖ్య ఆధారపడి ఉంది. కర్ణాటకకు పొరుగున ఉన్న తెలంగాణలో మాత్రం తమకు అదనంగా సీట్లు వచ్చే అవకాశం లేదని బీజేపీ భావిస్తోంది. శబరిమల అంశం కారణంగా కేరళలో ఒకట్రెండు స్థానాలు గెలుచుకోగలమని ఆశిస్తోంది కూడా. తూర్పు... ఈశాన్య రాష్ట్రాలు... దేశ తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లోని మొత్తం పది రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ ఈ 88లో గెలుచుకున్నది కేవలం 11 మాత్రమే. బెంగాల్‌లోని 42 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ 34 దక్కించుకోగా కాంగ్రెస్, నాలుగు, లెఫ్ట్‌ఫ్రంట్, బీజేపీలు రెండు చొప్పున గెలుచుకున్నాయి. బెంగాల్లో 17 శాతం ఓట్లు సాధించిన బీజేపీ... తృణమూల్‌ల మధ్య గత ఐదేళ్లలో పలు ఘర్షణలు జరిగాయి. 2016లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా 294 స్థానాలకు గాను తృణమూల్ 211 దక్కించుకుంది. లోక్‌సభ ఎన్నికల కంటే ఐదు శాతం ఎక్కువ ఓట్లు సాధించడం గమనార్హం. ఈ ఎన్నికల్లో కనీసం 22 స్థానాలు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. మధ్యతరగతి హిందువులు తమకు అండగా ఉంటారని బీజేపీ అంచనా వేస్తోంది. వీరితోపాటు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారు తమ వెంటే ఉంటారని బీజేపీ ఆశిస్తూండగా.. తృణమూల్ కాంగ్రెస్ గ్రామీణ ప్రాంత పేదలు, ముస్లింలు, దళితుల సాయంతో 35కుపైగా సీట్లు గెలుచుకునే ప్రయత్నం చేస్తోంది. మోదీ, దీదీల ఎన్నికల ప్రచారం వ్యక్తిగత స్థాయికి పడిపోవడంతో పోలింగ్ చివరిదశ సమయానికి రాష్ట్రంలో హింస పెచ్చరిల్లింది. పోలైన ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బీజేపీకి అనుకూలత పెరిగినప్పటికీ మమత ప్రభావం కొనసాగనుందని తెలుస్తోంది. బీజేపీ రెండంకెల స్థాయి సీట్లు సాధిస్తుందా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒడిశాలో 2014 నాటి లోక్‌సభ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ మోదీ హవాను తోసిరాజని మొత్తం 24 స్థానాలకుగాను 21 గెలుచుకుంది. బీజేపీకి 22 శాతం ఓట్లు దక్కినప్పటికీ గెలిచిన స్థానం మాత్రం ఒక్కటే. అలాగే 26 శాతం ఓట్లున్నా కాంగ్రెస్ ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది. బీజేడీ మాత్రం 45 శాతం ఓట్లతో 20 స్థానాలు గెలుచుకోగలిగింది. అయితే 2017 నాటి పంచాయతీ ఎన్నికల్లో 297 స్థానాలు గెలుచుకోవడంతో బీజేపీ ఆశలు మళ్లీ చిగురించాయి. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వంటి కారణాలతో ఈ ఎన్నికల్లో బీజేడీ కొన్ని సీట్లు కోల్పోనుందని అంతమేరకు బీజేపీ లాభపడనుందని అంచనా. ఈశాన్య రాష్ట్రాల విషయానికొస్తే.. 2014లో బీజేపీ అస్సాంలో ఏడు, అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక స్థానం గెలుచుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని మొత్తం 25 స్థానాల్లో బీజేపీ 11 గెలుచుకుంది. ప్రతి రాష్ట్రంలోనూ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీనే ఈశాన్య రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీ ఈ ప్రాంతంలో 20కిపైగా స్థానాలు గెలుచుకోవచ్చునని అంచనా. మహారాష్ట్ర, గుజరాత్, గోవా... దేశం పశ్చిమ దిక్కున ఉండే గుజరాత్, మహారాష్ట్ర, గోవాల్లో మొత్తం 74 లోక్‌సభ స్థానాలు ఉండగా.. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ అత్యధిక స్థానాలు సాధించింది. మహారాష్ట్రలో శివసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ మొత్తం 48 స్థానాలకుగాను 23 సాధించిన విషయం తెలిసిందే. మిగిలిన స్థానాల్లో శివసేన 20, కాంగ్రెస్ –ఎన్సీపీలు ఐదు స్థానాలు గెలుచుకన్నాయి. అయితే బీజేపీ – శివసేనల మధ్య ఎడం రావడం, నాలుగేళ్లపాటు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ చివరి నిమిషంలో మళ్లీ కలిసి పోటీకి సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షో భంపై తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు రైతులు రాజధాని ముంబైకి చేసిన మహా ప్రదర్శన చెబుతోంది. తరచూ రాష్ట్రాన్ని పలకరించిన కరువు మాత్రం ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తూ వచ్చింది. తాజా ఎన్నికల్లో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే వరుస ర్యాలీలు నిర్వహించి శివసేనపై విమర్శల వర్షం కురిపించడం బీజేపీ – శివసేన కూటమికి నష్టం చేకూర్చే అవకాశం ఉంది. మెజార్టీ సీట్లు సాధించినా.. చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు తగ్గే అవకాశమూ లేకపోలేదు. గుజరాత్లో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గణనీయమైన వృద్ధి సాధించిన నేపథ్యంలో తాజా ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అయినప్పటికీ కాంగ్రెస్ కంటే బీజేపీ ఎనిమిది శాతం ఎక్కువ ఓట్లు సాధించడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల తరువాత సౌరాష్ట్ర, కచ్ ప్రాంతానికి చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీవైపు మొగ్గడం, కాంగ్రెస్‌లో చేరిన హార్దిక్ పటేల్ పోటీకి సుప్రీంకోర్టు నో చెప్పడం.. ఇంకోవైపు ఓబీసీల నేత అల్పేశ్ ఠాకూర్ కాంగ్రెస్‌ను వీడటం వంటి కారణాలన్నీ బీజేపీ మరోసారి అధిక స్థానాలు సాధిస్తుందనేందుకు సూచికలుగా మారాయి. ఇక గోవా విషయానికొస్తే.. ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ మరణం నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఏఏపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. పంజాబ్‌లో బీజేపీ –అకాలీదళ్ కూటమి గత ఎన్నికల్లో సాధించిన సీట్లను మళ్లీ నిలుపుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ బలహీన పడటం, తన నిర్ణయాలతో కాంగ్రెస్ చేసుకున్న సెల్ఫ్ గోల్స్ ఇందుకు కారణమవుతున్నాయి. జమ్మూలో బీజేపీ గతంలో సాధించిన మూడు స్థానాలను నిలుపుకునే అవకాశం ఉండగా.. కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ పెద్దగా మార్పులు ఉండవు. ఏతావాతా.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హిందీ బెల్ట్, పశ్చిమ దిక్కున ఉన్న రాష్ట్రాలో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు కోల్పోతున్నప్పటికీ ఈశాన్య, తూర్పు ప్రాంతాల్లో కొత్తగా సాధించే సీట్లతో లోటును భర్తీ చేసుకోగలదన్న అంచనాలు బలపడుతున్నాయి. ఫలితంగా ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి మెజార్టీకి చేరువయ్యే సాధ్యత ఎక్కువ. ఒకవేళ మెజార్టీకి కొన్ని సీట్ల దూరంలో ఆగిపోతే.. ప్రభుత్వ ఏర్పాటుకు వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీల అవసరం రావచ్చు. దీంతోపాటు ఇంకో అవకాశం ఏమిటంటే.. బీజేపీకి లోలోపలే మద్దతు పెరిగిపోవడం ద్వారా ఆ పార్టీకి, మొత్తమ్మీద ఎన్డీయే కూటమికి 350కుపైగా స్థానాలు రావడం. హిందీ రాష్ట్రాల్లో పరిస్థితి.... భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో అత్యధికంగా లాభం గడించిన ప్రాంతం ఇదే. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, çహరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌లతో కూడిన హిందీబెల్ట్‌లో మొత్తం 225 స్థానాలకు గాను బీజేపీ 190 గెలుచుకోగలిగింది. ఒక్క యూపీలోనే ఉన్న 80 స్థానాల్లో 71 గెలుచుకున్న బీజేపీ ఈసారి మాత్రం కొంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎస్పీ –బీఎస్పీ –ఆర్ఎల్డీలు మహాగఠ్‌బంధన్‌గా బరిలో ఉండటం.. వారి ఉమ్మడి ఓటుబ్యాంకు బీజేపీ కంటే ఎక్కువగా 42.7 శాతంగా ఉంది. ప్రతిపక్ష కూటమి తమ సంప్రదాయ ఓటు బ్యాంకుకు ముస్లిం ఓట్లను కూడా కలుపుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేశాయి. మరోవైపు బీజేపీ అగ్రవర్ణ, యాదవేతర బీసీలు, జాటవేతర ఎస్సీలు, ఓబీసీల ఓట్లను స్థిరపరచుకోగలిగింది. అయితే కాంగ్రెస్ వైపు మొగ్గడం ద్వారా ముస్లింలు తమ ఓటు వృథా చేసుకోరాదన్న మాయావతి ప్రకటన... బీజేపీ ఇతర వర్గాల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు దోహద పడింది. అంతేకాకుండా కాంగ్రెస్‌ను దూరం పెట్టాలన్న నిర్ణయమూ మహాగఠ్‌బంధన్ ఓట్లను తగ్గించనున్నాయి. ఎస్పీ ప్రభావం పెద్దగా లేకపోవడం కూడా బీజేపీకి కలిసిరానుంది. మొత్తమ్మీద చూస్తే యూపీలో బీజేపీ ఈసారి 20 వరకూ లోక్‌సభ స్థానాలను కోల్పోనుందని చెప్పవచ్చు. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌కి ప్రతికూలమా.. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని ఆలోచిస్తూండగా పరిస్థితలు మాత్రం అంత సానుకూలంగా ఏమీ లేవు. ముఖ్యమంత్రి వసుంధరా రాజేపై ఉన్న వ్యతిరేకతను ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల ద్వారా వ్యక్తం చేశారని, ఇప్పుడు ఆ కోపం ఉండదన్నది బీజేపీ అంచనా. అంతేకాకుండా సచిన్ పైలట్‌ను కాదని అశోక్ గహ్లోత్‌కు కాంగ్రెస్ ముఖ్యమంత్రి పీఠం అప్పగించడం కాంగ్రెస్ శ్రేణుల్లో ముఖ్యంగా గుజ్జర్ సామాజిక వర్గంలో చీలిక తేవడం కూడా బీజేపీకి కలిసివచ్చే అంశం. బిహార్ విషయానికొస్తే.. బీజేపీ, జేడీయూ, ఎల్జేపీలు జట్టుకట్టి పోటీ చేస్తున్నాయిక్కడ. గత ఎన్నికల్లో ఈ మూడు పార్టీలకు ఉమ్మడిగా 55 శాతం ఓట్లు దక్కాయి. ఈసారి రాష్ట్రంలోని మైనార్టీలందరూ కూటమికి దూరంగా ఉంటారని అంచనా వేసుకున్నా ఆర్జేడీ, కాంగ్రెస్, ఆర్ఎల్ఎస్పీ, హెచ్ఏఎం కూటమి కంటే బీజేపీ కూటమి ఎక్కువ సీట్లు సాధిస్తుంది. మధ్యప్రదేశ్‌లో 2014 స్థాయిలో మోదీ హవా లేకున్నా కాంగ్రెస్ కంటే కొంచెం ఎక్కువ ఓట్లు రాబట్టుకోవడం బీజేíపీకి సానుకూల అంశంగా చూడవచ్చు. పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాత్రమే ఉన్నా బీఎస్పీ, ఎస్పీ, గోండ్వానా గణతంత్ర పార్టీల కూటమి కొన్నిచోట్ల ప్రధాన పార్టీలను చికాకుపెట్టవచ్చు. మోదీ ప్రభుత్వ వైఫల్యాలు, నిరుద్యోగ సమస్యలను కాంగ్రెస్ తన ప్రచార అస్త్రాలుగా మార్చుకోగా, బీజేపీ మోదీ మ్యాజిక్, సంక్షేమ పథకాలను నమ్ముకుంది. ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం హిందూ ఓట్ల ఏకీకరణకు చిహ్నంగా బీజేపీ భావిస్తోంది. ఇది తమకు లాభిస్తుందని అంచనా వేస్తోంది. ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్లలో బీజేపీకి గడ్డు పరిస్థితా.. గత ఎన్నికల్లో గణనీయమైన విజయాలు సాధించినా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ చేతిలో ఓటమి చవిచూసింది. ఛత్తీసగఢ్‌లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 68 కాంగ్రెస్ దక్కించుకోవడం. వరికి కేంద్రం మద్దతు ధరకు రాష్ట్రం తరఫున కొంత జోడించి చెల్లించడం.. అధికారంలోకి వస్తే అమలు చేయబోయే న్యాయ్ పథకంపై ప్రచారం వంటి అంశాలు కాంగ్రెస్‌కు అనుకూల అంశాలుగా మారాయి. మరోవైపు ఝార్ఖండ్‌లోనూ బీజేపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. జేవీఎం, జేఎంఎం, ఆర్జేడీల కూటమి గట్టిపోటీ ఇస్తూండగా.. గిరిజనుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా బీజేíపీకి నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో గతంలో కాషాయ పార్టీ సాధించిన 12 స్థానాలు మళ్లీ నిలబెట్టుకోవడం కష్టమే. ఉత్తరాఖండ్, ఢిల్లీ, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఎన్నికల ఫలితాలు గత ఎన్నికలకు దగ్గరగా ఉండనున్నాయి. మోదీ రేటింగ్ 43 శాతం 2014లో మోదీ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం స్థిరంగా ఉండటం, దాయాది పాకిస్తాన్‌పైకి జరిపిన సర్జికల్ దాడులు, స్వచ్ఛ భారత్, ఉజ్వల, ఆయుష్మాన్ భారత్ వంటి సంక్షేమ పథకాల ప్రభావం కారణంగా మోదీ ప్రభుత్వ రేటింగ్ 43 శాతంగా ఉందని ఇటీవలే జరిగిన సీఎస్డీఎస్ సర్వే ఒకటి తేల్చింది. ఈ లెక్కన చూసినప్పుడు యూపీఏ –1 కంటే ఎన్డీయే –2 పాలనకు ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు స్పష్టమవుతుంది. మరి.. ఎన్నికల ఫలితాలు కూడా ఇందుకు తగ్గట్టుగానే ఉంటాయా? చెప్పడం కష్టమే. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ జట్టు కట్టడం 2009లో కాంగ్రెస్ ఎదుర్కొన్న దాని కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఓ పదేళ్లు వెనక్కు వెళదాం.... 2009 ఎన్నికలు ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ కూటమి మధ్యే నడిచింది. మన్మోహన్ – సోనియా – రాహుల్ గాంధీల నేతృత్వం, మెరుగైన పాలన వంటి అంశాలే ఎజెండాగా కాంగ్రెస్ బరిలోకి దూకింది. ప్రధానమంత్రి అభ్యర్థిగా మన్మోహన్సింగ్ రేటింగ్ 35 శాతం (సీఎస్డీఎస్ సర్వే) వరకూ ఉండగా ప్రధాన ప్రతిపక్ష నేత ఎల్కే ఆడ్వాణీ రేటింగ్ 21 శాతం మాత్రమే ఉండింది. ఉపాధి హామీ వేతనాలు లబ్ధిదారులకే నేరుగా చెల్లించడం, భారత్ నిర్మాణ్, రైతు రుణమాఫీ, అధికారపక్షంపై ఉన్న సానుకూలత వంటి అనేక కారణాలతో కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో 206 సీట్లు సాధించుకోగలిగింది. యూపీఏ–2గా మళ్లీ అధికారాన్ని కట్టబెట్టింది. అయితే ఆ తరువాతి కాలంలో వెలుగులోకి వచ్చిన పలు అవినీతి కేసులు, విధానపరమైన స్తబ్ధతలు 2014 నాటి ఎన్నికల్లో ప్రభావం చూపాయి. గుజరాత్ ముఖ్యమంత్రి స్థానం నుంచి ప్రధాని అభ్యర్థిగా ఎదిగిన నరేంద్రమోదీ హవా కూడా తోడవడంతో కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ స్థానాలకు పరిమితమైంది. ప్రవీణ్ రాయ్ రాజకీయ విశ్లేషకులు, సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ. -
డిపాజిట్ దక్కితేనే గౌరవం..!
సాక్షి, మచిలీపట్నం : ఒక్క ఓటు తక్కువైనా పర్లేదు.. డిపాజిట్ మాత్రం వచ్చేటట్టు చూస్కో.. అన్నట్లుంది బరిలోకి దిగే అభ్యర్థుల పరిస్థితి. సార్వత్నిక ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలు ఇరు ప్రధాన పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారడంతో విజయం సాధించేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇండిపెండెంట్, ఇతర పార్టీల నుంచి అధిక మంది బరిలోకి దిగారు. ఈ సారి పోటీ ప్రధాన పార్టీల మధ్యే ఉండటంతో.. అంతగా ప్రజాదరణ లేని పార్టీల తరపున, ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేసిన వారు ఓట్లు రాబట్టుకుని ఎలాగైనా డిపాజిట్ మొత్తం వెనక్కు తీసుకునే ప్రయత్నాలు సైతం చేస్తుండగా.. మరి కొందరు తాము పోటీ చేశామన్న ప్రఖ్యాతి గడించేందుకు ఉర్రూతలు ఊగుతున్నారు. మరికొంత మంది తమకు డిపాజిట్లు దక్కకపోతే ప్రజల్లో శృంగభంగం తప్పదన్న భావనలో ఉన్నారు. బరిలో 232 మంది అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ సైతం ఇప్పటికే ముగిసింది. దీన్ని బట్టి చూస్తే జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలకు 27 మంది, 16 అసెంబ్లీకు 205 మంది పోటీలో నిలిచారు. పార్లమెంట్‌కు రూ.25 వేలు, అసెంబ్లీకి రూ.10 వేలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొంత నగదు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే ఒక్కో అభ్యర్థి రూ.25 వేలు, అసెంబ్లీ అభ్యర్థి రూ.10 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంది. ఎస్సీలకు రిజర్వు చేయడంతో అక్కడ మాత్రమే అభ్యర్థి కేవలం రూ.5 వేలు డిపాజిట్ చెల్లించారు. అయితే పోలైన ఓట్లలో కనీసం 1/6 వంతు ఓట్లు పొందితేనే డిపాజిట్లు ఇస్తారు. లేకపోతే ఆ డబ్బులన్నీ ఖజానాలోకి చేరుతాయని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదంతా ఎన్నికల ఫలితాల అనంతరం పోలైన ఓట్లలో డిపాజిట్లు పొందిన వారికి మాత్రమే తిరిగి వస్తుంది. దీంతో గౌరవప్రదంగా డిపాజిట్ దక్కించుకునేలా ఓట్లు పొందాలని నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల విషయానికొస్తే.. ఎస్సీ, ఎస్టీలు మాత్రమే అసెంబ్లీకు, పార్లమెంట్‌కు సగం డిపాజిట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే తిరువూరు, పామర్రు, నందిగామ నియోజకవార్గల్లో పోటీ చేసే అభ్యర్థులు గెలిచినా, ఓడినా డిపాజిట్ నగదు వెనక్కు వస్తుంది. రూ.26.95 లక్షల డిపాజిట్ త్వరలో జరగబోయే ఎన్నికలకు డిపాజిట్ నగదు పారింది. జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలకు 27 మంది బరిలో ఉండగా.. వారి ద్వారా రూ.6.75 లక్షలు, 16 శాసనసభ స్థానాలుండగా.. అందులో 3 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలున్నాయి. 13 నియోజకవర్గాల పరిధిలో 172 మంది బరిలో ఉండగా..రూ.17.20 లక్షలు, మూడు ఎస్సీ నియోజకవర్గాల పరిధిలో 33 మంది అంటే.. రూ.1.65 లక్షలు సెక్యురిటీ డిపాజిట్‌గా ఎన్నికల అధికారులు సేకరించారు. -
కొత్త గురువులొస్తున్నారు..
కడప ఎడ్యుకేషన్ : ఏళ్ల తరబడి నాన్చుతూ వచ్చిన డీఎస్సీ ఫలితాలు ఎట్టకేలకు విడదలయ్యాయి.. రాష్ట్రంలోనే అతి తక్కువ పోస్టులున్న మన జిల్లాలో పెద్దసంఖ్యలో అభ్యర్థులు పోటీపడ్డారు. పోస్టులు తక్కువ.. అభ్యర్థులు ఎక్కువ. ఇంత క్లిష్టపరిస్థితుల్లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో పాటు కొన్ని సబ్జెక్టుల్లో రాష్ట్రంలోనే ప్రథములుగా నిలిచారు. గ్రామీణ అభ్యర్థులు జిల్లాస్థాయిలో సత్తాచాటి ర్యాంకులు సాధించారు. తద్వారా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగాలను కైవసం చేసుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల్లో పలువురు అభ్యర్థులు సత్తాచాటారు. జిల్లా నుంచి నలుగురు రాష్ట్రస్థాయిలో టాపర్స్‌గా నిలిచారు. జిల్లావ్యాప్తంగా గతేడాది డిసెంబర్ 24 నుంచి 28 వరకు తొలి విడత డీఎస్సీ పరీక్ష ఆన్లైన్లో జరిగిన సంగతి తెలిసిందే. మొదటి విడతలో 148 పోస్టులకు 7739 మంది పరీక్షలు రాశారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్ నాన్‌లాంగ్వేజ్, లాంగ్వేజ్, పిజీటీ, టీజీటీ, పీఈటీ, ప్రిన్సిపాల్స్, మ్యూజిక్, క్రాఫ్ట్, డ్రాయింగ్ పోస్టులకు ఆన్లైన్లో పరీక్షలు జరిగాయి. రెండవ విడతలో ఎస్జీటీలకు జనవరి 18 నుంచి 31 వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. రెండో విడత డీఎస్సీకి కడప, పొద్దుటూరు, రాజంపేటలలోని 8 కేంద్రాలలో పరీక్షను నిర్వహించారు. ఇందులో 78 పోస్టులకు 15, 278 మంది పరీక్షలను రాశారు. రెండు విడతలు కలుపుకుని 226 పోస్టులకు 23,017 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. డీఎస్సీ పరీక్షల్లో వైఎస్సార్‌జిల్లా నుంచి నలుగురు అభ్యర్థులు రాష్ట్రస్థాయిలో మెరిశారు. ఉర్దూ విభాగంలో స్కూల్‌అసిస్టెంట్ సోషల్‌లో షేక్సుల్తానా 65.69 శాతం, ఎస్జీటీలో షేక్ హర్షద్‌బాషా 82.53 శాతం మార్కులను సాధించారు. పీజీటీ తెలుగులో కదిరి బాలాజీ 70.50 శాతం, íపీజీటీ బోటనీలో షేక్ నూర్ మహమ్మద్ 69.50 శాతం మార్కులు పొందారు. ఎస్జీటీలో మహమ్మద్ 83.4 శాతంతో ప్రథమ. లక్ష్మి ప్రసన్న 81.7 శాతం మార్కులతో రెండోర్యాంకు, సాయిలక్ష్మి 80.6 శాతం మార్కులతో మూడో ర్యాంకు పొందింది. çస్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీస్‌లో కలకత్తా గౌస్‌పీర్ 81.8 శాతం, మునగా యశ్వంత్ 78.3 శాతం,తిరుపతి శ్రీనివాస్ 77.9 మార్కులు పొందారు. జిల్లాలో 226 పోస్టులకు పోస్టుల వివరాలు ఇలా.. ఎల్పీ తెలుగు–2, ఎల్పీ హిందీ–1, మ్యూజిక్ – 5, పిఈటీ తెలుగు– 13. ఎస్ఏ తెలుగు మీడియంకు సంబంధించి : స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్–5, స్కూల్ అసిస్టెంట్ తెలుగు – 24, స్కూల్ అసిస్టెంట్ హిందీ – 14, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్–7, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు– 6, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ–12, స్కూల్ అసిస్టెంట్ సోషియల్ స్టడీస్–21, తెలుగు మీడియం ఎస్జీటీ – 34 ఎల్పీ ఉర్దూ మీడియంకు సంబంధించి : లాంగ్వేజ్ పండింట్ – 4, పీఈటీ– 8, స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ –2, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్–4, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు– 4, స్కూల్ అసిస్టెంట్ సోసియల్ స్టడీ– 3, ఉర్దూ మీడియం ఎస్జీటీ – 18 మున్సిపాలిటీలకు సంబంధించి : లాంగ్వేజ్ పండిట్(తెలుగు)–1, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్–2, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు–1,స్కూల్ అసిస్టెంట్ సోసియల్ స్టడీస్– 2, స్కూల్‌అసిస్టెంట్ ఇంగ్లిష్–1, స్కూల్ అసిస్టెంట్ సంస్కృతం–1, ఎస్జీటీ – 26; ఉర్దూ మీడియంకు సంబంధించి.. ఎల్పీ ఉర్దూ –1, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ –1, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు– 1, స్కూల్ అసిస్టెంట్ సోసియల్ స్టడీ– 2 మెరిసిన గాలివీడు ఆణిముత్యం గాలివీడు : మండలంలోని అరవీడు గ్రామానికి చెందిన అర్షద్ బాషా డీఎస్పీ ఏస్టీజీ ఉర్దూ విభాగంలో అత్త్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఇతడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. అరవీడు కస్బాలో ఉంటున్న అన్వర్‌బాష, ఆయేషా దంపతులకు నలుగురు సంతానం. వీరిలో ఇద్దరు కుమార్తెలు ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. తాజా డీఎస్పీ ఫలితాల్లో రెండో కుమారుడైన బాషా స్టేట్ ఫ్టస్ ర్యాంక్సాధించడం పట్ల కుటంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుండి చదువులో చురుగ్గా రాణించేవాడు. పదవ తరగతి కడప ఏపీ రెసిడెన్సియల్ పాఠశాలలో టాపర్‌గా నిలిచాడు. టీటీసీ ప్రవేశపరీక్షలో కూడా స్టేట్ఫస్ట్గా నిలిచాడు. తాజాగా డీఎస్పీ ఫలితాల్లో కూడా అత్యుత్తమ ప్రతిభ సాధించాడు. సరస్వతీ ప్రసన్నురాలు పెనగలూరు: డీఎస్సీ ఫలితాల్లో ఎస్జీటీలో పెనగలూరుకు చెందిన పాళెంపల్లె రెడ్డిలక్ష్మీ ప్రసన్న జిల్లాస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. ఈమె తల్లి సర్వసతీ అంగన్వాడీ కార్యకర్త, తండ్రి నరసింహులు శెట్టి పోస్టల్ ఏజెంటుగా ఉంటున్నారు. వీరి ఏకైక పుత్రిక లకీŠ?ష్మప్రసన్న 10వ తరగతిలో 558 మార్కులతో మండల టాపర్‌గా నిలిచింది. ఇంటర్మీడియట్లో 971 మార్కులు సాధించింది. రాయచోటిలో శిక్షణలో కూడా టాప్‌ర్యాంకర్‌గా నిలిచింది. కేంద్రీయ విధ్యాలయ సెంట్రల్స్కూల్లో పని చేయాలనేది తన కోరిక అని అందుకుకూడా అర్హత సాధించినట్లు లక్ష్మీ ప్రసన్న తెలిపింది. తెలంగాణలో నాన్‌లోకల్ కింద డీఎస్సీలో ఎస్జీటీలో 5వ ర్యాంకు సాధించిందీమె. -
21 నుంచి కాంగ్రెస్ జిల్లా స్థాయి సమీక్షలు
* రైతులకు ప్రత్యామ్నాయం చూపాలి * డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి ఎదులాపురం : ఎన్నికల ఫలితాలపై, భవిష్యత్తు రాజకీయాలపై చర్చించేందుకు జిల్లా స్థాయి సమీక్షలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రయత్నాలు ప్రారంభించిందని డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 21 నుంచి హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో ఆదిలాబాద్ జిల్లా సమీక్ష సమావేశంతో ప్రారంభం కానున్నాయని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో ఈ సమావేశాలు జరుగుతాయన్నారు. జిల్లాలోని ప్రతీ నియోజకవర్గానికి 45 నిమిషాలపాటు సమావేశం ఉంటుందని తెలిపారు. ఉదయం 10.00 గంటలకు సిర్పూర్ నియోజకవర్గ సమీక్ష సమావేశంతో ప్రారంభవుతాయని అన్నారు. తర్వాత వ రుసగా చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయని వివరించారు. అన్ని నియోజకవర్గ సమీక్షలో డీసీసీ అధ్యక్షులతోపాటు మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ డీసీసీ అధ్యక్షులు పాల్గొంటారని చెప్పారు. నియోజకవర్గ సమీక్షలో ఎమ్మెల్యే లేదా పోటీ చేసిన అభ్యర్థితోపాటు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, పీసీసీ, డీసీసీ, కార్యవర్గస్థాయి నాయకులు, పార్టీ ముఖ్య అనుబంధ సంఘాల నాయకులు పాల్గొంటారని సీఆర్ఆర్ వివరించారు. రైతులకు వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయం చూపాలి ప్రభుత్వం రైతాంగ సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సీఆర్ఆర్ పేర్కొన్నారు. రుణ మాఫీపై స్పష్టత లేక, ప్రకృతి సహకరించక రైతులు కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతులకు వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని కోరారు. గతంలో ప్రజాపథం కార్యక్రమంలో అధికారులందరూ పాల్గొనే వారని, మన ఊరు-మన ప్రణాళికలో ఆశా వర్కర్లు అప్లికేషన్లు తీసుకొంటున్నారని విమర్శించారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శి నరేష్ జాదవ్, నాయకులు యాసం నర్సింగ్‌రావ్, దిగంబర్‌రావ్ పాటిల్, అంబకంటి అశోక్ తదితరులు పాల్గొన్నారు.