ఏడు దశల సార్వత్రిక ఎన్నికల ఘట్టం చరమాంకానికి చేరింది. ఇంకో రెండు రోజుల్లో 59 లోక్‌సభ స్థానాలకు తుది దశ ఎన్నికలు జరగనున్నాయి! మే 23న జరిగే కౌంటింగ్‌తో ఏ పార్టీ భవితవ్యం ఏమిటో స్పష్టం కానుంది కూడా. అయితే ఇప్పటికే పోలింగ్ పూర్తయిన 480 పైచిలుకు స్థానాల ఓటింగ్ సరళిని గమనిస్తే.. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటర్ల నాడి పసిగట్టడం కష్టమైనప్పటికీ.. వచ్చిన స్పందనలు అరకొరగానే ఉన్నప్పటికీ ఎన్డీయే కూటమి ప్రభుత్వ పనితీరు, ప్రజాదరణ సూచీల్లో నేతల రేటింగ్స్, ఓటర్లపై సంక్షేమ పథకాల ప్రభావం వంటి అంశాలను పరిగనలోకి తీసుకుంటే విజేత ఎవరన్నది చూచాయగానైనా స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో దేశంలోని భిన్న ప్రాంతాల తీరుతెన్నులు ఎలాగున్నాయంటే...?
దక్షిణాదిలో కాషాయానికి ఒక్క రాష్ట్రంలోనే ఆసరా...
గత ఎన్నికల్లో దక్షిణాది మొత్తానికి బీజేపీ ఎక్కువగా లాభపడిన రాష్ట్రం కర్ణాటక మాత్రమే. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 112 లోక్‌సభ స్థానాలు ఉండగా.. కేవలం 21 మాత్రమే దక్కించుకోగలిగింది కాషాయ పార్టీ. ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అంచుల్లో ఉన్న అంచనాలు బలపడుతున్న తరుణంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నెపం ఈవీఎంలపై నెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్డీయే నుంచి బయటకు రావడం, పవన్ కల్యాణ్ జనసేన పార్టీ జట్టు కట్టేందుకు నిరాకరించడంతో ఢిల్లీలో చక్రం తిప్పుదామనుకున్న చంద్రబాబు ఆశలకూ గండిపడినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి పదవి రేసులో తాను లేనని ప్రకటించడం ద్వారా బాబు తన ఓటమిని పరోక్షంగా అంగీకరించినట్లయింది. ఈ నేపథ్యంలో అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ ఎన్నికల్లోనూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ విజయ దుందుభి మోగించనుందని స్పష్టమవుతోంది.
ఇంకో పార్టీ మద్దతుతో తన ఉనికిని చాటుకోవాల్సిన అవసరం ఏర్పడటం బీజేపీకి కేవలం తమిళనాడులోనే కనిపిస్తుంది. ద్రవిడ దిగ్గజాలు జయలలిత, కరుణానిధిల మరణం తరువాత జరుగుతున్న తొలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తోపాటు కొన్ని చిన్న పార్టీలతో జట్టు కట్టడం ద్వారా డీఎంకే కొంత అడ్వాంటేజ్ సాధించిందని చెప్పాలి. మరోవైపు బీజేపీ ఏఐఏడీఎంకే, చిన్నా చితకా పార్టీలతో కూటమి ఏర్పాటు చేసుకుంది. ఈ రెండు కూటములను సినీనటుడు కమల్‌హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం, టీటీవీ దినకరన్ పార్టీ ఏఎంఎంకేలు సవాలు చేస్తున్నాయి. అయితే పోలింగ్ సరళిని బట్టి చూస్తే డీఎంకే కూటమికి ఎక్కువ సీట్లు లభించే అవకాశం కనిపిస్తోంది. కానీ ఏఐఏడీఎంకే కూటమి కూడా చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయం సాధించవచ్చు.
బీజేపీ దక్షిణాదిలో అడుగుపెట్టేందుకు వేదికగా నిలిచిన కర్ణాటకలో ఈసారి కూడా ఆ పార్టీ గణనీయమైన సంఖ్యలో స్థానాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ జేడీఎస్ కూటమిలోని లుకలుకలు బీజేపీకి కలిసి వచ్చే అవకాశముంది. ఇరు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు ఎంత సమర్థంగా జరిగిందన్న అంశంపై బీజేపీ సాధించబోయే సీట్ల సంఖ్య ఆధారపడి ఉంది. కర్ణాటకకు పొరుగున ఉన్న తెలంగాణలో మాత్రం తమకు అదనంగా సీట్లు వచ్చే అవకాశం లేదని బీజేపీ భావిస్తోంది. శబరిమల అంశం కారణంగా కేరళలో ఒకట్రెండు స్థానాలు గెలుచుకోగలమని ఆశిస్తోంది కూడా.
తూర్పు... ఈశాన్య రాష్ట్రాలు...
దేశ తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లోని మొత్తం పది రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ ఈ 88లో గెలుచుకున్నది కేవలం 11 మాత్రమే. బెంగాల్‌లోని 42 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ 34 దక్కించుకోగా కాంగ్రెస్, నాలుగు, లెఫ్ట్‌ఫ్రంట్, బీజేపీలు రెండు చొప్పున గెలుచుకున్నాయి. బెంగాల్‌లో 17 శాతం ఓట్లు సాధించిన బీజేపీ... తృణమూల్‌ల మధ్య గత ఐదేళ్లలో పలు ఘర్షణలు జరిగాయి. 2016లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా 294 స్థానాలకు గాను తృణమూల్ 211 దక్కించుకుంది. లోక్‌సభ ఎన్నికల కంటే ఐదు శాతం ఎక్కువ ఓట్లు సాధించడం గమనార్హం. ఈ ఎన్నికల్లో కనీసం 22 స్థానాలు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. మధ్యతరగతి హిందువులు తమకు అండగా ఉంటారని బీజేపీ అంచనా వేస్తోంది. వీరితోపాటు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారు తమ వెంటే ఉంటారని బీజేపీ ఆశిస్తూండగా.. తృణమూల్ కాంగ్రెస్ గ్రామీణ ప్రాంత పేదలు, ముస్లింలు, దళితుల సాయంతో 35కుపైగా సీట్లు గెలుచుకునే ప్రయత్నం చేస్తోంది. మోదీ, దీదీల ఎన్నికల ప్రచారం వ్యక్తిగత స్థాయికి పడిపోవడంతో పోలింగ్ చివరిదశ సమయానికి రాష్ట్రంలో హింస పెచ్చరిల్లింది. పోలైన ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బీజేపీకి అనుకూలత పెరిగినప్పటికీ మమత ప్రభావం కొనసాగనుందని తెలుస్తోంది. బీజేపీ రెండంకెల స్థాయి సీట్లు సాధిస్తుందా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఒడిశాలో 2014 నాటి లోక్‌సభ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ మోదీ హవాను తోసిరాజని మొత్తం 24 స్థానాలకుగాను 21 గెలుచుకుంది. బీజేపీకి 22 శాతం ఓట్లు దక్కినప్పటికీ గెలిచిన స్థానం మాత్రం ఒక్కటే. అలాగే 26 శాతం ఓట్లున్నా కాంగ్రెస్ ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది. బీజేడీ మాత్రం 45 శాతం ఓట్లతో 20 స్థానాలు గెలుచుకోగలిగింది. అయితే 2017 నాటి పంచాయతీ ఎన్నికల్లో 297 స్థానాలు గెలుచుకోవడంతో బీజేపీ ఆశలు మళ్లీ చిగురించాయి. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వంటి కారణాలతో ఈ ఎన్నికల్లో బీజేడీ కొన్ని సీట్లు కోల్పోనుందని అంతమేరకు బీజేపీ లాభపడనుందని అంచనా.
ఈశాన్య రాష్ట్రాల విషయానికొస్తే.. 2014లో బీజేపీ అస్సాంలో ఏడు, అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక స్థానం గెలుచుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని మొత్తం 25 స్థానాల్లో బీజేపీ 11 గెలుచుకుంది. ప్రతి రాష్ట్రంలోనూ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీనే ఈశాన్య రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీ ఈ ప్రాంతంలో 20కిపైగా స్థానాలు గెలుచుకోవచ్చునని అంచనా.
మహారాష్ట్ర, గుజరాత్, గోవా...
దేశం పశ్చిమ దిక్కున ఉండే గుజరాత్, మహారాష్ట్ర, గోవాల్లో మొత్తం 74 లోక్‌సభ స్థానాలు ఉండగా.. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ అత్యధిక స్థానాలు సాధించింది. మహారాష్ట్రలో శివసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ మొత్తం 48 స్థానాలకుగాను 23 సాధించిన విషయం తెలిసిందే. మిగిలిన స్థానాల్లో శివసేన 20, కాంగ్రెస్ –ఎన్సీపీలు ఐదు స్థానాలు గెలుచుకన్నాయి. అయితే బీజేపీ – శివసేనల మధ్య ఎడం రావడం, నాలుగేళ్లపాటు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ చివరి నిమిషంలో మళ్లీ కలిసి పోటీకి సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షో భంపై తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు రైతులు రాజధాని ముంబైకి చేసిన మహా ప్రదర్శన చెబుతోంది. తరచూ రాష్ట్రాన్ని పలకరించిన కరువు మాత్రం ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తూ వచ్చింది. తాజా ఎన్నికల్లో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే వరుస ర్యాలీలు నిర్వహించి శివసేనపై విమర్శల వర్షం కురిపించడం బీజేపీ – శివసేన కూటమికి నష్టం చేకూర్చే అవకాశం ఉంది. మెజార్టీ సీట్లు సాధించినా.. చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు తగ్గే అవకాశమూ లేకపోలేదు.
గుజరాత్‌లో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గణనీయమైన వృద్ధి సాధించిన నేపథ్యంలో తాజా ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అయినప్పటికీ కాంగ్రెస్ కంటే బీజేపీ ఎనిమిది శాతం ఎక్కువ ఓట్లు సాధించడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల తరువాత సౌరాష్ట్ర, కచ్ ప్రాంతానికి చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీవైపు మొగ్గడం, కాంగ్రెస్‌లో చేరిన హార్దిక్ పటేల్ పోటీకి సుప్రీంకోర్టు నో చెప్పడం.. ఇంకోవైపు ఓబీసీల నేత అల్పేశ్ ఠాకూర్ కాంగ్రెస్‌ను వీడటం వంటి కారణాలన్నీ బీజేపీ మరోసారి అధిక స్థానాలు సాధిస్తుందనేందుకు సూచికలుగా మారాయి. ఇక గోవా విషయానికొస్తే.. ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ మరణం నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఏఏపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.
పంజాబ్‌లో బీజేపీ –అకాలీదళ్ కూటమి గత ఎన్నికల్లో సాధించిన సీట్లను మళ్లీ నిలుపుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ బలహీన పడటం, తన నిర్ణయాలతో కాంగ్రెస్ చేసుకున్న సెల్ఫ్ గోల్స్ ఇందుకు కారణమవుతున్నాయి. జమ్మూలో బీజేపీ గతంలో సాధించిన మూడు స్థానాలను నిలుపుకునే అవకాశం ఉండగా.. కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ పెద్దగా మార్పులు ఉండవు. ఏతావాతా.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హిందీ బెల్ట్, పశ్చిమ దిక్కున ఉన్న రాష్ట్రాలో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు కోల్పోతున్నప్పటికీ ఈశాన్య, తూర్పు ప్రాంతాల్లో కొత్తగా సాధించే సీట్లతో లోటును భర్తీ చేసుకోగలదన్న అంచనాలు బలపడుతున్నాయి. ఫలితంగా ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి మెజార్టీకి చేరువయ్యే సాధ్యత ఎక్కువ. ఒకవేళ మెజార్టీకి కొన్ని సీట్ల దూరంలో ఆగిపోతే.. ప్రభుత్వ ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్ వంటి ప్రాంతీయ పార్టీల అవసరం రావచ్చు. దీంతోపాటు ఇంకో అవకాశం ఏమిటంటే.. బీజేపీకి లోలోపలే మద్దతు పెరిగిపోవడం ద్వారా ఆ పార్టీకి, మొత్తమ్మీద ఎన్డీయే కూటమికి 350కుపైగా స్థానాలు రావడం.
హిందీ రాష్ట్రాల్లో పరిస్థితి....
భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో అత్యధికంగా లాభం గడించిన ప్రాంతం ఇదే. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, çహరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌లతో కూడిన హిందీబెల్ట్‌లో మొత్తం 225 స్థానాలకు గాను బీజేపీ 190 గెలుచుకోగలిగింది. ఒక్క యూపీలోనే ఉన్న 80 స్థానాల్లో 71 గెలుచుకున్న బీజేపీ ఈసారి మాత్రం కొంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎస్పీ –బీఎస్పీ –ఆర్‌ఎల్‌డీలు మహాగఠ్‌బంధన్‌గా బరిలో ఉండటం.. వారి ఉమ్మడి ఓటుబ్యాంకు బీజేపీ కంటే ఎక్కువగా 42.7 శాతంగా ఉంది. ప్రతిపక్ష కూటమి తమ సంప్రదాయ ఓటు బ్యాంకుకు ముస్లిం ఓట్లను కూడా కలుపుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేశాయి. మరోవైపు బీజేపీ అగ్రవర్ణ, యాదవేతర బీసీలు, జాటవేతర ఎస్సీలు, ఓబీసీల ఓట్లను స్థిరపరచుకోగలిగింది. అయితే కాంగ్రెస్ వైపు మొగ్గడం ద్వారా ముస్లింలు తమ ఓటు వృథా చేసుకోరాదన్న మాయావతి ప్రకటన... బీజేపీ ఇతర వర్గాల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు దోహద పడింది. అంతేకాకుండా కాంగ్రెస్‌ను దూరం పెట్టాలన్న నిర్ణయమూ మహాగఠ్‌బంధన్ ఓట్లను తగ్గించనున్నాయి. ఎస్పీ ప్రభావం పెద్దగా లేకపోవడం కూడా బీజేపీకి కలిసిరానుంది. మొత్తమ్మీద చూస్తే యూపీలో బీజేపీ ఈసారి 20 వరకూ లోక్‌సభ స్థానాలను కోల్పోనుందని చెప్పవచ్చు.
రాజస్తాన్‌లో కాంగ్రెస్‌కి ప్రతికూలమా..
గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని ఆలోచిస్తూండగా పరిస్థితలు మాత్రం అంత సానుకూలంగా ఏమీ లేవు. ముఖ్యమంత్రి వసుంధరా రాజేపై ఉన్న వ్యతిరేకతను ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల ద్వారా వ్యక్తం చేశారని, ఇప్పుడు ఆ కోపం ఉండదన్నది బీజేపీ అంచనా. అంతేకాకుండా సచిన్ పైలట్‌ను కాదని అశోక్ గహ్లోత్‌కు కాంగ్రెస్ ముఖ్యమంత్రి పీఠం అప్పగించడం కాంగ్రెస్ శ్రేణుల్లో ముఖ్యంగా గుజ్జర్ సామాజిక వర్గంలో చీలిక తేవడం కూడా బీజేపీకి కలిసివచ్చే అంశం.
బిహార్ విషయానికొస్తే..
బీజేపీ, జేడీయూ, ఎల్‌జేపీలు జట్టుకట్టి పోటీ చేస్తున్నాయిక్కడ. గత ఎన్నికల్లో ఈ మూడు పార్టీలకు ఉమ్మడిగా 55 శాతం ఓట్లు దక్కాయి. ఈసారి రాష్ట్రంలోని మైనార్టీలందరూ కూటమికి దూరంగా ఉంటారని అంచనా వేసుకున్నా ఆర్జేడీ, కాంగ్రెస్, ఆర్‌ఎల్‌ఎస్‌పీ, హెచ్‌ఏఎం కూటమి కంటే బీజేపీ కూటమి ఎక్కువ సీట్లు సాధిస్తుంది. మధ్యప్రదేశ్‌లో 2014 స్థాయిలో మోదీ హవా లేకున్నా కాంగ్రెస్ కంటే కొంచెం ఎక్కువ ఓట్లు రాబట్టుకోవడం బీజేíపీకి సానుకూల అంశంగా చూడవచ్చు. పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాత్రమే ఉన్నా బీఎస్పీ, ఎస్పీ, గోండ్వానా గణతంత్ర పార్టీల కూటమి కొన్నిచోట్ల ప్రధాన పార్టీలను చికాకుపెట్టవచ్చు. మోదీ ప్రభుత్వ వైఫల్యాలు, నిరుద్యోగ సమస్యలను కాంగ్రెస్ తన ప్రచార అస్త్రాలుగా మార్చుకోగా, బీజేపీ మోదీ మ్యాజిక్, సంక్షేమ పథకాలను నమ్ముకుంది. ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం హిందూ ఓట్ల ఏకీకరణకు చిహ్నంగా బీజేపీ భావిస్తోంది. ఇది తమకు లాభిస్తుందని అంచనా వేస్తోంది.
ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌లలో బీజేపీకి గడ్డు పరిస్థితా..
గత ఎన్నికల్లో గణనీయమైన విజయాలు సాధించినా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ చేతిలో ఓటమి చవిచూసింది. ఛత్తీసగఢ్‌లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 68 కాంగ్రెస్ దక్కించుకోవడం. వరికి కేంద్రం మద్దతు ధరకు రాష్ట్రం తరఫున కొంత జోడించి చెల్లించడం.. అధికారంలోకి వస్తే అమలు చేయబోయే న్యాయ్ పథకంపై ప్రచారం వంటి అంశాలు కాంగ్రెస్‌కు అనుకూల అంశాలుగా మారాయి. మరోవైపు ఝార్ఖండ్‌లోనూ బీజేపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. జేవీఎం, జేఎంఎం, ఆర్జేడీల కూటమి గట్టిపోటీ ఇస్తూండగా.. గిరిజనుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా బీజేíపీకి నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో గతంలో కాషాయ పార్టీ సాధించిన 12 స్థానాలు మళ్లీ నిలబెట్టుకోవడం కష్టమే. ఉత్తరాఖండ్, ఢిల్లీ, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఎన్నికల ఫలితాలు గత ఎన్నికలకు దగ్గరగా ఉండనున్నాయి.
మోదీ రేటింగ్ 43 శాతం
2014లో మోదీ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం స్థిరంగా ఉండటం, దాయాది పాకిస్తాన్‌పైకి జరిపిన సర్జికల్ దాడులు, స్వచ్ఛ భారత్, ఉజ్వల, ఆయుష్మాన్ భారత్ వంటి సంక్షేమ పథకాల ప్రభావం కారణంగా మోదీ ప్రభుత్వ రేటింగ్ 43 శాతంగా ఉందని ఇటీవలే జరిగిన సీఎస్‌డీఎస్ సర్వే ఒకటి తేల్చింది. ఈ లెక్కన చూసినప్పుడు యూపీఏ –1 కంటే ఎన్డీయే –2 పాలనకు ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు స్పష్టమవుతుంది. మరి.. ఎన్నికల ఫలితాలు కూడా ఇందుకు తగ్గట్టుగానే ఉంటాయా? చెప్పడం కష్టమే. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ జట్టు కట్టడం 2009లో కాంగ్రెస్ ఎదుర్కొన్న దాని కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఓ పదేళ్లు వెనక్కు వెళదాం....
2009 ఎన్నికలు ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ కూటమి మధ్యే నడిచింది. మన్మోహన్ – సోనియా – రాహుల్ గాంధీల నేతృత్వం, మెరుగైన పాలన వంటి అంశాలే ఎజెండాగా కాంగ్రెస్ బరిలోకి దూకింది. ప్రధానమంత్రి అభ్యర్థిగా మన్మోహన్‌సింగ్ రేటింగ్ 35 శాతం (సీఎస్‌డీఎస్ సర్వే) వరకూ ఉండగా ప్రధాన ప్రతిపక్ష నేత ఎల్‌కే ఆడ్వాణీ రేటింగ్ 21 శాతం మాత్రమే ఉండింది. ఉపాధి హామీ వేతనాలు లబ్ధిదారులకే నేరుగా చెల్లించడం, భారత్ నిర్మాణ్, రైతు రుణమాఫీ, అధికారపక్షంపై ఉన్న సానుకూలత వంటి అనేక కారణాలతో కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో 206 సీట్లు సాధించుకోగలిగింది. యూపీఏ–2గా మళ్లీ అధికారాన్ని కట్టబెట్టింది. అయితే ఆ తరువాతి కాలంలో వెలుగులోకి వచ్చిన పలు అవినీతి కేసులు, విధానపరమైన స్తబ్ధతలు 2014 నాటి ఎన్నికల్లో ప్రభావం చూపాయి. గుజరాత్ ముఖ్యమంత్రి స్థానం నుంచి ప్రధాని అభ్యర్థిగా ఎదిగిన నరేంద్రమోదీ హవా కూడా తోడవడంతో కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ స్థానాలకు పరిమితమైంది.
ప్రవీణ్ రాయ్
రాజకీయ విశ్లేషకులు, సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ.
మెజార్టీ గీతకు దగ్గరలో బీజేపీ..!
Published Fri, May 17 2019 4:57 AM | Last Updated on Fri, May 17 2019 11:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment