సాక్షి, కడప: జమ్మలమడుగు నియోజవర్గం టీడీపీకి 1983 నుంచి 2004 వరకు కంచుకోటగా నిలిచింది. వరుసగా ఐదు పర్యాయాలు పొన్నపురెడ్డి కుటుంబీకులకు మద్దతుగా ప్రజలు నిలిచారు. ఆ కుటుంబ ప్రత్యర్థులుగా ఉన్న దేవగుడి కుటుంబం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అండదండలతో 2004లో విజయకేతనం ఎగురవేసింది. వైఎస్ కుటుంబం నీడలో వరుసగా మూడుసార్లు విజయం సాధించినా 2016లో టీడీపీ చెంతకు చేరిపోయింది. ఆపై టీడీపీలో మంత్రి పదవిని దక్కించుకుంది.
అప్పటి వరకూ జమ్మలమడుగులో ప్రత్యక్షంగా వైరివర్గీయులుగా ఫ్యాక్షన్‌కు ఆధ్యులుగా నిలిచిన ఆ రెండు కుటుంబాలు ఎన్నికల్లో ఏకమయ్యాయి. ప్రజలు వీరి కలయికను ఏవగించుకుకున్నా, తమకు ఎదురులేదని, తమ కుటుంబాలు ఒక్కటయ్యాక ఓడించే సత్తా ఎవ్వరికీ లేదని వారు ప్రగల్బాలు పలికారు. పోలింగ్ సందర్భంగా వారి అంచనాలు తలకిందులయ్యాయి. దేవగుడి, గుండ్లకుంట కుటుంబాలకు ఊహాలు పటాపంచలైయ్యాయి. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ ఏజెంట్లు నిలవరని భావించిన ఆ రెండు కుటుంబాలకు చేదు అనుభవం ఎదురయ్యింది.
వేగంగా మారిన రాజకీయ సమీకరణలు.....
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన దేవగుడి ఆదినారాయణరెడ్డి ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. వైరివర్గంగా ఉన్న గుండ్లకుంట రామసుబ్బారెడ్డి ఈయన చేరికను తీవ్రంగా అడ్డగించి విఫలమయ్యారు. ఇరువురు ఏకమయ్యాక జమ్మలమడుగులో తమకు ఎదురే లేదని వారు భావించారు. ప్రజాజీవితంలో మమేకమైన డాక్టర్ మూలే సుధీర్‌రెడ్డికి 2016లో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. ఆపై వైఎస్ కుటుంబం జమ్మలమడుగుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దానికి తోడు ఆ పార్టీ ప్రవేశపెట్టిన ‘గడపగడపకుౖ వెఎస్సార్’, ‘రావాలి జగన్... కావాలి జగన్’ కార్యక్రమాలతో ప్రజల మధ్యకు వెళ్లారు. నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
క్రమేపీ రాజకీయ సమీకరణలు మారిపోయాయి. టీడీపీనాయకులు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలకు సుధీర్ దీటుగా నిలిచారు. వారి ఎత్తుగడలను పసిగడుతూ నిర్ణయాలు తీసుకోసాగారు. రోజురోజుకూ పార్టీని బలోపేతం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఆ రెండు కుటుంబాల వారు కలిసికట్టుగా ప్రచారం నిర్వహించడంపై ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పటి వరకూ ఫ్యాక్షన్ మూలంగా ఎందరో ప్రాణాలు కోల్పోవడం, ఫ్యాక్షన్‌ను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సహించిన చరిత్రవారికే ఉండడమే అందుకు కారణం. ఈ పరిస్థితుల మూలంగా టీడీపీ నాయకులు ప్రవర్తన పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతూ వ చ్చింది. అప్పటివరకూ ఏకపక్షంగా పోలింగ్ నిర్వహిస్తున్న గ్రా మాల్లో పోలింగ్ ఏజెంట్లును ఏర్పాటు చేయడం వైఎస్సార్‌సీపీ కి అదనపు బలం చేకూరిందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఆ రెండు మండలాలపై బేరిజు...
నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ప్రధాన భూమిక పొషించేవి జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మండలాలే. ఈ రెండు మండలాల్లో లక్షా ఇరవైవేల ఓట్లు ఉన్నాయి. యర్రగుంట్ల డాక్టర్ సుధీర్‌రెడ్డికి సొంత మండలం. దీంతో ఆయన దృష్టింతా జమ్మలమడుగుపై పెట్టారు. పోలింగ్ సందర్భంగా 85.40శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎవరు ఎవరికి ఓటు వేశారో అన్న సందేహాలు నాయకుల్లో వ్యక్తం అవుతున్నాయి. జమ్మలమడుగు రూరల్ మండలంలో టీడీపీ అంచనాలు తలకిందులయ్యాయి. రెండు దశాబ్దాలుగా పోలింగ్‌కు అవకాశం లేకుండా ఏకపక్షంగా నిర్వహించే ఓటింగ్‌కు కట్టడి ఏర్పడింది. ప్రజలు స్వేచ్ఛగా ఓటేశారు. ఈ పరిస్థితి టీడీపీకి మింగుడుపడటం లేదు. మున్సిపాలిటిలో టీడీపీకి మెజార్టీ వచ్చిన దాఖలాలు లేవు.
దేవగుడి, గుండ్లకుంట వర్గీయులు ఏకమైనా అక్కడ వైఎస్ కుటుంబాన్ని అభిమానించే వారు ఎక్కువగా ఉన్నారు. పైగా జమ్మలమడుగులో వైఎస్ వైద్యునిగా సేవలు అందించారు. సామాన్య ప్రజానీకం వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయని పలువురు వివరిస్తున్నారు. టీడీపీ నాయకులు మాత్రం ఈసారి మెజార్టీ తమకే వస్తుందని అంచనాల్లో మునిగితేలుతున్నారు. ఎర్రగుంట్ల మండలంలో వైఎస్సార్‌సీపీ మెజార్టీ గణనీయంగా ఉంటోందని టీడీపీ నేతలే స్వయంగా వివరిస్తున్నారు. ఈ రెండు మండలాలల్లో టీడీపీ అంచనాలు తలకిందులు కావడంతో ఆ పార్టీ నేతలల్లో ఫలితంపై టెన్షన్ నెలకొందని భావిస్తున్నారు.
బెట్టింగ్‌ల జోరు...
జమ్మలమడుగులో వైఎస్సార్‌సీపీ గెలుస్తుందంటూ భారీగా బెట్టింగ్‌లు కాస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొంది. ఎన్నికలకు ముందు టీడీపీ గెలుస్తుం దంటూ బెట్టింగ్‌లు నిర్వహించగా ఆ తర్వాత బెట్టింగ్ నిర్వాహకులు వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపారు. జమ్మలమడుగుపై రకరకాలు బెట్టింగులు తెరపైకి వచ్చాయి. జమ్మలమడుగు మండలం కంటే యర్రగుంట్ల మండలంలో వైఎస్సార్‌సీపీకి అధికంగా ఓట్లు వస్తాయని, పెద్దముడియం మండలంలో వైఎస్సార్‌సీపీ ఒక్క ఓటైనా అధికంగా సాధిస్తుందని, గెలుపు వైఎస్సార్‌సీపీదేనని ఇలా రకరకాలు తెరపైకి వచ్చాయి.
జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ కాస్త ఢీలా పడినా గెలుస్తామనే ధీమాను ప్రదర్శిస్తుంటే, వైఎస్సార్‌సీపీ నాయకులు మాత్రం తమకు యువత, వృద్దులు, దళితులు, మైనార్టీలు, రైతులు ఓట్లుతో పాటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కలిసివచ్చిందని జోష్ మీదున్నారు. ఇవన్నీ కాకుండా ఆ రెండు కుటుంబాలు కలిసికట్టుగా ప్రచారం నిర్వహించడం కూడా అదనపు ప్రయోజనమే అయ్యిందని వారు పేర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జమ్మలమడుగు ఫలితంపై చర్చ కొనసాగడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment