
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా యథేచ్ఛగా ప్రభుత్వ ప్రచార హోర్డింగ్‌లు
సాక్షి ప్రతినిధి కడప: ఆదివారం సాయంత్రమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అధికారులంతా ఎన్నికల కమిషన్ నియమావళికి లోబడి విధి నిర్వహణ చేపట్టాలి. ఇకపై ఎన్నికలు ముగిసే వరకూ ప్రతి అడుగు నియమావళికి అనుగుణంగా ఉండాలి. కాగా ఎన్నికల కమిషన్‌కు దీటుగా జిల్లా యంత్రాంగం స్పీడు అందుకోలేకుంది. జిల్లా కేంద్రంలో ఇబ్బడి ముబ్బడిగా ప్రభుత్వ ప్రచార హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి. కేవలం ఓటర్లను ప్రలోభపర్చేందుకు ఏర్పాటు చేసినట్లుగా కన్పిస్తున్న హోర్డింగ్‌లు అలాగే తిష్ట వేశాయి.
కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్, సంధ్య సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, నాగరాజుపేట, అప్సర సర్కిల్, పాతబస్టాండ్, ఏడు రోడ్ల సర్కిల్ ఇలా నగరమంతా హోర్డింగ్‌లు హోరెత్తుతున్నాయి. తక్షణమే వాటిని తొలగించాల్సిన యంత్రాంగం ఆ దిశగా ప్రయత్నాలే చేపట్టకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రంలోనే కోడ్ అమలు తీరు ఇలా ఉంటే ఇక మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటని ప్రజాస్వామిక వాదులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment